Telangana Congress : బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ - కాంగ్రెస్‌లో ఊహించని చేరికలు ఉండబోతున్నాయా ?
వచ్చే నెల రోజుల్లో కాంగ్రెస్‌లో ఊహించని చేరికలు ఉండబోతున్నాయా ? తెలంగాణ రాజకీయాలు మలుపులు తిరగనున్నాయా ?
Telangana Congress : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఇంకా నెలకుపైగా సమయం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం ఇప్పుడే అసలు జోష్ కనిపిస్తోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ చేయాలన్న పట్టుదలతో కీలక నేతలందర్ని పార్టీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే కొద్ది రోజుల్లో ఆ పార్టీలో ఊహించని చేరికలు ఉంటాయన్న ప్రచారం ఊపందుకుంటోంది.
కేసీఆర్ వ్యతిరేక నేతలంతా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారా ?
ఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహాలను రచిస్తోంది. సమర్థులయిన అభ్యర్థుల కోసం జల్లెడ పడుతోంది. ఈ మేరకు ఆశావాహులంతా దరఖాస్తు చేసుకోవాలని కోరగా.. వేల సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చాయి. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులతో పాటు.. పెద్ద ఎత్తున ఎన్నారైలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తులు చేసుకోని వారికీ టిక్కెట్లు ఖరారు చేయబోతున్నారని చెబుతున్నారు. వచ్చే నెల రోజుల్లో ఎవరూ ఊహించని చేరికలు కాంగ్రెస్ లో ఉండబోతున్నాయంటున్నారు.
కాంగ్రెస్‌లో చేరే వారిలో పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రచారం లోకి !
బీజేపీ సీనియర్ నేత గడ్డం వివేక్.. కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంచనమేనన్న చర్చ జరుగుతోంది. ఆయన సోదరుడు వినోద్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వివేక్ లోక్ సభ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయనది సంప్రదాయంగా కాంగ్రెస్ ఫ్యామిలీ. ఇక ఈటల రాజేందర్ పేరు కూడా జోరుగా ప్రచారంలోకి వస్తోంది. ఈటలకు ఇటీవల కిషన్ రెడ్డి తర్వాత స్థానం ఇచ్చారు. అందుకే ఆయన ముందడుగు వేయలేకపోతున్నారు. కానీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ను ఓడించాలంటే.. కాంగ్రెస్ లో చేరక తప్పని ఆయన డిసైడయ్యే చాన్స్ ఉందంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఇప్పటికీ అందరికీ డౌటే. మునుగోడులో ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తానంటున్నారు. ఇక ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు చేరికను దాదాపుగా ఫైనల్ చేసుకున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ లో టిక్కెట్ ప్రకటించిన మైనంపల్లికి కాంగ్రెస్ రెండు టిక్కెట్లు ఆఫర్ చేసిందని చెబుతున్నారు. వీరంతా .. అటు ఇటూగా వచ్చే నెలలో కాంగ్రెస్ లోచేరిపోవచ్చని చెబుతున్నారు.
కాంగ్రెస్ పరిస్థితి బాగుందని అనిపిస్తే వెల్లువలా చేరికలు
కాంగ్రెస్‌లో ఫీల్ గుడ్ పాజిటివ్ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో కనిపించని ఓ రకమైన ఆత్మవిశ్వాసం.. కాంగ్రెస్ లో ఉంది. బీఆర్ఎస్ నేతలు ... కాంగ్రెస్ నేతలు చేసిన ప్రకటనల్ని హైలెట్ చేసి.. బీఆర్ఎస్ కావాలా..కాంగ్రెస్ కావాలా అని ప్రశ్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం.. తమ డిక్లరేషన్లను హైలెట్ చేస్తున్నారు. అదే సమయంలో పదేళ్ల అధికార వ్యతిరేకత ఊహించనంతగా ఉంటుందన్న అంచనాలు కిందిస్థాయిలోనూ వినిపిస్తూండటంతో..కాంగ్రెస్ కు డిమాండ్ పెరుగుతోంది. కేసీఆర్ రెండు చోట్ల పోటీ ప్రకటన .. సిట్టింగ్‌లకు అభ్యర్థులను ప్రకటించడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నరు.
మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు మందే ఫీల్ గుడ్ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. అందుకే తెలంగాణ రాజకీయాలు ముందు ముందు మరింత ఆసక్తికరంగా జరగనున్నాయి.