News
News
X

Breaking News Live: రజనీకాంత్ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 28న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

FOLLOW US: 
రజనీకాంత్ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

మణికొండలో ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు మణికొండ మున్సిపాలిటీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ వితోబాను సస్పెండ్‌ చేశారు. మరమ్మతులు జరుగుతున్న సమయంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు, చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిన గుత్తేదారు రాజ్‌కుమార్‌పై నార్సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈనెల 25న రాత్రి 9గంటల సమయంలో ప్రమాదవశాత్తు మరమ్మతుల కోసం తీసిన గుంతలో పడి రజనీకాంత్‌ గల్లంతయ్యారు. సోమవారం అతని మృతదేహం నెక్నాంపూర్‌ చెరువులో దొరికింది. 

జగతి పబ్లికేషన్స్‌ ఈడీ ఛార్జ్‌షీట్‌పై విచారణ రేపటికి వాయిదా 

హైదరాబాద్​లోని నాంపల్లి సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్‌, పెన్నా, ఇండియా సిమెంట్స్‌ ఈడీ కేసులపై దర్యాప్తు పూర్తయిందా? కొనసాగుతోందా తెలపాలని ఈడీని న్యాయస్థానం ప్రశ్నించింది. పెన్నా కేసు నుంచి తొలగించాలని కోరుతూ జగన్‌, విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలు చేశారు. ఇండియా సిమెంట్స్‌ కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ జరిగింది. డిశ్ఛార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు ఈడీ గడువు కోరింది. జగతి పబ్లికేషన్స్‌ ఈడీ ఛార్జ్‌షీట్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. పెన్నా, ఇండియా సిమెంట్స్‌ ఈడీ కేసుల విచారణ అక్టోబరు 5కి వాయిదా పడింది. 

ముగిసిన వైసీపీ నేతల పంచాయితీ... గీత దాటితే చర్యలు తప్పవని సీఎం సీరియస్

రాజమండ్రి పంచాయితీ తాడేపల్లికి చేరింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజమహేంద్రవరం వైసీపీ నేతల పంచాయితీ జరిగింది. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పిలిపించి సీఎం జగన్‌ ఇవాళ మాట్లాడారు. పరస్పర బహిరంగ ఆరోపణలు చేసుకోవడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని జగన్‌ చెప్పినట్లు తెలిసింది. అంతకు ముందు తూర్పుగోదావరి జిల్లా ఇన్ ఛార్జ్ వై.వి.సుబ్బారెడ్డి భరత్, జక్కంపూడి రాజాతో సమావేశమయ్యారు. ఇద్దరితో విడివిడిగా మాట్లాడిన సుబ్బారెడ్డి వివరణ తీసుకున్నారు. 

తెలంగాణలో కొత్తగా 220 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 44,200 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 220 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 6,65,504 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కొవిడ్ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒక్కరు కరోనా కారణంగా మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,915కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 255 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,57,040కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 4,549 యాక్టివ్‌ కేసులున్నాయి. 

కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ

కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఏపీ నిర్మిస్తున్న పిన్నపురం జలవిద్యుత్ ప్రాజెక్టు ఆపాలని లేఖలో కోరింది. కొత్త, ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ఆపాలని కోరింది. కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని విజ్ఞప్తి చేసింది. జల విద్యుత్ ప్రాజెక్టు విషయాన్ని జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ కృష్ణా బోర్డును కోరింది. 

ప్రెస్ క్లబ్ వద్ద జనసేన ఆందోళన

సోమాజిగుడా ప్రెస్ క్లబ్ వద్ద జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నటుడు పోసాని కృష్ణ మురళి పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు పోసాని పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. పోలీసు ఎస్కార్ట్ తో పోసాని ఇంటికి తరలిస్తున్నారు.

పవన్ పై మరోసారి పోసాని తీవ్ర వ్యాఖ్యలు... తనపై పవన్ ఫ్యాన్స్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ 

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. తనని తిడుతూ గత 24 గంటల్లో వేల ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు వచ్చాయని సినీ నటుడు, వైకాపా కార్యకర్త పోసాని అన్నారు. మంగళవారం మరోసారి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనన్న ఆయన... కానీ, కక్ష కట్టి మాట్లాడటం సరికాదన్నారు. పవన్‌ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ పవన్ ను బహిరంగంగా హెచ్చరించినప్పుడు ఫ్యాన్స్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ షూటింగ్‌ సమయంలో తమ మధ్య విభేదాలు వచ్చాయన్నారు. 

పంచాయతీరాజ్, స్థానిక సంస్థల గౌరవ వేతనాలు పెంపు

పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల గౌరవ వేతనాలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెంచింది. ఎంపీటీసీ, సర్పంచుల గౌరవ వేతనం రూ. 5 వేల నుంచి రూ.6,500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం.. కాలువలో దిగిన యువకుడు మృతి

జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. గూడెం దొడ్డి నెట్టెంపాడు ఫేస్ వన్ కాల్వ వద్ద తరుణ్ అనే యువకుడు సరదా కోసం కాలువలో దిగాడు. నీటి ఉధృతికి తరుణ్ కొట్టుకుపోవడంతో మరో ఇద్దరు యువకులు అతడ్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఎలాగోలా ఆ యువకులు అతి కష్టం మీద బయటకొచ్చారు. కానీ తరుణ్ మృతి చెందాడు.

యూట్యూబ్ లో చూసి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట పోలీస్ స్టేషన్ పక్క వీధిలో 13 సంవత్సవరాల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. అయినవిల్లి మోక్షిత (13) తన అమ్మమ్మ ఇంటి వద్ద బాత్ రూమ్ లో  పీక కోసుకొని మృతి చెందిందని బాలిక తల్లి అయినవిల్లి బేబి వెంకట సత్యవతి అంబాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ లో వీడియోలు చూసి పీక కోసుకున్నట్లు బాలిక తల్లి  ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అయినవిల్లి బేబీ వెంకట సత్యవతి అత్తారిల్లు విజయవాడ  కాగా భర్త మరణించడంతో గత రెండు సంవత్సరాలుగా పుట్టిలైన అంబాజీపేటలో తన కూతురు మోక్షితాతో  కలిసి ఉంటున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అంబాజీపేట ఎస్ఐ తెలిపారు. 

 

ఏపీలో కొత్తగా 771 కరోనా కేసులు, 8 మరణాలు

ఏపీలో కొత్తగా 771 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది మరణించారు. ప్రస్తుతం 11,912 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. కరోనా వివరాలను తాజాగా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. 

 

మూసీకి పెరిగిన వరద ఉధృతి.. చాదర్ ఘాట్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత

గులాబ్ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలోనూ వర్షాల నేపథ్యంలో నేడు ప్రభుత్వం సెలవు ప్రకటించడం తెలిసిందే. మూసీలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని చాదర్ ఘాట్ బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు మూసివేశారు. మూసారాం బాగ్ దగ్గర మూసీలో ఓ మృతదేహం కొట్టుకుపోతున్నట్లుగా గుర్తించారు. వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం తలెత్తుతోంది.

మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి... పెనుగులాటలో కత్తి గుచ్చుకుని భర్య మృతి

మద్యం మత్తులో భార్యను కత్తితో పొడవబోగా ఆ పెనుగులాట భర్త చనిపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. తల్లిపై దాడి చేస్తున్న తండ్రిని అడ్డుకున్నాడు కుమారుడు. ఈ పెనుగులాటలో అదే కత్తి తండ్రికి గుచ్చుకోవడంతో అతను మృత్యువాత పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజేశ్వర రావు నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజేశ్వరరావు నగర్ కు చెందిన బాబు అనే వ్యక్తి తరచూ మద్యం మత్తులో గొడవకు దిగేవాడు. మంగళవారం కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యను చితకబాది, అనంతరం కత్తితో భార్య రేణుకపై దాడిచేశాడు. అక్కడే ఉన్న అతని రెండో కుమారుడు అజయ్ అడ్డుకోవడంతో, అతనిపై దాడికి దిగాడు. దీంతో ఇద్దరికి చోటు చేసుకున్న పెనుగులాటలో కత్తి పొరబాటున తండ్రికి గుచ్చుకుందని దీంతో బాబు మృతిచెందాడని భార్య రేణుక,  పెద్ద కుమారుడు మీడియాకు తెలిపారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు. 

పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ పదవికి రాజీనామా

పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ పదవికి రాజీనామా చేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు సిద్ధూ షాకిచ్చారు. ఇటీవలే పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూను ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం

ఏసీబీ అధికారులకు చిక్కిన రంపచోడవరం ఆర్ఐ

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం తహశీల్దార్ కార్యాలయంలో ఆర్.ఐ గా విధులు నిర్వహిస్తున్న వీరబ్రహ్మం ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. రంపచోడవరం సిరిగిందల పాడుకు చెందిన గూడెం రాంబాబు తన పట్టాదారు పాసు పుస్తకం పేరు మార్చుకునేందుకు చాలాసార్లు సంప్రదించగా రూ.10 వేలు లంచం ఇస్తే గాని పనిచేయనని చెప్పడంతో  గూడెం రాంబాబు రాజమండ్రిలోని అవినీతి నిరోధక శాఖను సంప్రదించాడు. దీంతో  మంగళవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో రంపచోడవరం తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్.ఐ వీరబ్రహ్మం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ఆర్ఐ వీరబ్రహ్మంను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి : హైకోర్టు

గతేడాది వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నష్టపోయిన రైతులకు 3 నెలల్లో ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని తెలిపింది. నాలుగు నెలల్లో బీమా సొమ్ము కూడా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం, బీమా చెల్లించాలని తెలిపింది. పంట దెబ్బతిన్న రైతులను గుర్తించాలని ప్రభుత్వానికి సూచించింది. 
రైతు స్వరాజ్య వేదిక విస్సా కిరణ్ కుమార్, రవి కన్నెగంటి, ఎస్.ఆశలత హైకోర్టులో వేసిన పిల్ పై తుది తీర్పు ఇచ్చింది. 

హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ న నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న కౌంటింగ్ జరగుతుంది.

ఎయిర్ పోర్టుకు దారి బంద్

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజేంద్రనగర్‌ సమీపంలోని అప్ప చెరువు పొంగిపొర్లింది. ఆ నీరంతా బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి 44 పైకి పోటెత్తింది. గగన్ పహాడ్ వద్ద రోడ్డుపై వరద ప్రవహిస్తుండడం వల్ల శంషాబాద్ వైపు వెళ్లే దారిని అధికారులు మూసివేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే వారు కూడా ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లాలని అధికారులు సూచించారు. గతేడాది అప్ప చెరువు కట్ట తెగి నీటిలో కొట్టుకుపోయి ఐదుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

 
అర్ధరాత్రి రక్తమోడిన నెల్లూరు రహదారి..

నెల్లూరు జిల్లాలో అర్ధ రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఓ కంటైనర్ ని ఢీకొంది. కావలి రూరల్ మండలం మద్దూరుపాడు హైవేపై ఈ ప్రమాదం జరిగింది. సరిగ్గా రాత్రి ఒంటి గంట 40 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. మరో ఏడుగురిని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ కాలికి తీవ్ర గాయాలవడంతోపాటు తలపై కూడా దెబ్బలు తగలడంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 28న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

COOKIES_POLICY