Breaking News Live Telugu Updates: గవర్నర్ తమిళిసై లక్ష్మణ రేఖ దాటుతున్నారు - సీసీఐ నారాయణ విమర్శలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో నైరుతి రుతుపవనాల కదలికలకు అడ్డంకి ఏర్పడింది. ఈ సంవత్సరం మే 28వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. మే 31 నాటికి కర్ణాటక, ఏపీ సరిహద్దు వరకు వచ్చినా.. మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో రుతుపవనాల రాక ఆలస్యమైందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. జూన్ 4, 5వ తేదీనే రాయలసీమను రుతుపవనాలు తాకాల్సి ఉంది. నేడు లేదా రేపు నైరుతి రుతుపవనాలు ఏపీని తాకనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనుండగా, మరికొన్ని చోట్ల వేడి, ఉక్కపోత ఉండనుంది.
మరో మూడు గంటల్లో ఈ జిల్లాలకు వర్ష సూచన
హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు జూన్ 9 న రాబోయే 3 గంటల్లో నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది. అంతేకాక, 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వేగవంతమైన గాలులు వీయనున్నాయి. మరో 3 గంటల్లో వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ ఐఎండీ జూన్ 9న ఉదయం 7 గంటలకు ట్వీట్ చేసింది.
ఇక తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో వాతావరణ వివరాలు ఇలా ఉండనున్నాయి. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పసుపు రంగు అలర్ట్ కూడా జారీ అయింది. అంతేకాక, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా అక్కడక్కడ పడే అవకాశం ఉంది.
ఏపీలో వాతావరణం ఇలా..
‘‘విజయవాడ నగరంలో నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. నేడు కూడా ఎండ వేడి కొనసాగుతుంది. కానీ జూన్ 10 నుంచి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు తక్కువగా నమోదవ్వనున్నాయి. ఆ తర్వాత జూన్ 15 నుంచి 35 డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. విశాఖ నగరంలో మాత్రం ప్రస్తుతం ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది. ఈ ఉక్కపోత వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు తెల్లవారుజామున అక్కడక్కడ కొన్ని వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు భాగాల్లోకి విస్తరించే అవకాశాలు కూడ కనిపిస్తున్నాయి.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
CPI Narayana: గవర్నర్ పై సీసీఐ నారాయణ విమర్శలు
తెలంగాణ గవర్నర్ తమిళిసైపై (Tamilisai Sounderarajan) తీరుపై సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ గవర్నర్ లక్ష్మణ రేఖను దాటుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ రోజు రాజ్ భవన్ లో మహిళల దర్బార్ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భవన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు బీజేపీ తెలంగాణపై రాజకీయ దాడి పెంచిందని, మరోవైపు గవర్నర్ పాత్ర అగ్నికి అజ్యం పోస్తున్నట్లుగా ఉందని అన్నారు.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ గురించి మాట్లాడుతూ.. మైనర్లను పబ్‌లోకి అనుమతించడం చట్టరీత్యా నేరమని అన్నారు. పబ్‌ను సీజ్ చేసి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.
YS Viveka Murder Case: వైఎస్ వివేకా కేసులో సాక్షి హఠాన్మరణం
వైఎస్ వివాకానంద రెడ్డి సంచలనాత్మక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వ్యక్తి అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. వివేకా హత్యకేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం జిల్లా యాడికిలో మృతి చెందాడు. గంగాధర్ రెడ్డి రాత్రి నిద్రలోనే మృతి చెందినట్లుగా బంధువులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గంగాధర్ రెడ్డి ఇంటి చుట్టుపక్కల కూడా పరిశీలన జరుపుతున్నారు. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి గంగాధర్ రెడ్డి మృతదేహాన్ని తరలించారు.
Hanamkonda: బట్టల షోరూంలో అగ్ని ప్రమాదం
హన్మకొండ నక్కలగుట్టలోని కళానికేతన్ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో షాప్ లోని వినాయకుడి మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. రూ.లక్ష వరకు ఆస్తినష్టం జరిగినట్లు షాప్ యజమానులు తెలిపారు.
Hyderabad Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు నేడు
నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నందున ఆయన తిరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. తొలుత ఉదయం 9.35 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నం.29లోని ఆయన నివాసానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో పీఎన్‌టీ ఫ్లైఓవర్, శ్యామ్‌లాల్ బిల్డింగ్, హెచ్‌పీఎస్ బేగంపేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, పంజాగుట్ట ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, జూబ్లీహిల్స్ రోడ్డు నం.29 మార్గంలో ట్రాఫిక్ నిలిపివేత ఉండనుంది. ఆ సమయంలో వాహనదారులు వేరే మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.