Breaking News Live Telugu Updates: ఐదుగురు హైస్కూల్ విద్యార్థులకు కరెంట్ షాక్, ఒకరు మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం అక్టోబరు 29 నాటికి శ్రీలంక, తమిళనాడు మధ్యన ఏర్పడుతుందని, దీని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్రపై ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. దాని ప్రభావంతో ఈ నెలాఖరులో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అదే సమయంలో 29 నుంచి ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ విడుదల చేసిన వెదర్ బులెటిన్ తెలిపింది. సాధారణంగా, నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 17న దేశంలోని వాయువ్య ప్రాంతాల నుండి ఉపసంహరించుకోవడం ప్రారంభమవుతాయి. అక్టోబర్ 15 నాటికి దేశం నుండి పూర్తిగా తొలగిపోతాయి.
“పై పరిస్థితులలో, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్‌లో అక్టోబర్ 29 మరియు 30 తేదీలలో మరియు కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాంలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 30న రాయలసీమ, కేరళలలో, అక్టోబర్ 30న తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలు మరియు ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో కోస్తాంధ్రలో 338.1 మిల్లీమీటర్లు, రాయలసీమలో 223.3 మిల్లీ మీటర్ల సాధారణ సరాసరి వర్షపాతం నమోదవుతుంది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలోనే బంగాళాఖాతంలో తుపానులు ఎక్కువగా ఏర్పడతాయని అంచనా వేశారు. వాటిలో అధికంగా దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడులపైనే ప్రభావం ఉండనుంది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజను అక్టోబర్ - డిసెంబర్‌ల మధ్యలో కనీసం మూడు తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ ఈ ఏడాది అంతకు మించి పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెరుగుతున్న చలి
ఏపీలోని పలు ప్రాంతాల్లో చలి వాతావరణం నెలకొంది. ఇక అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 15 డిగ్రీలకు పడిపోయాయి. ఇటు తెలంగాణలోనూ చలి తీవ్రత పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులు, మేఘాలు లేకపోవడం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ అధికారులు తెలిపారు. వాతావరణంలో తేమ కూడా తక్కువగా ఉంటుంది. తూర్పు కోస్తా నుంచి వీస్తున్న గాలుల తీవ్రత రెండు మూడు రోజుల్లో పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. కాబట్టి, మూడు నాలుగు రోజుల్లో, ఉష్ణోగ్రతలో వ్యత్యాసం కనిపిస్తుందని తెలిపారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజుల నుంచి వర్షాలు అసలు లేవు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేళ చలి తీవ్రత సైతం అధికం అవుతోంది. హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 31 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది. వాయువ్య దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వచ్చే 3 రోజులు తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఐదుగురు హైస్కూల్ విద్యార్థులకు కరెంట్ షాక్, ఒకరు మృతి
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతికుర్రు హై స్కూల్ కి చెందిన ఐదుగురు విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిని 108లో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. హై స్కూల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న పంచాయితీ భవన నిర్మాణం కోసం ఐరన్ పనులు చేయడం కోసం విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేసుకున్నారు. దీనిని తొలగించకపోవడంతో విద్యార్థులకు షాక్ కు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండుగా ఐదుగురు విద్యార్థుల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
TTD News: నవంబర్ 1వ తేదీ నుండి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ
నవంబర్ 1వ తేదీ నుండి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభం చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుపతిలోని అలిపిరి లింక్ బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం నిర్మించిన షెడ్ ను వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో విధులు నిర్వహించే టీటీడీ ఉద్యోగులు అలిపిరి బస్టాండ్ ప్రాంతంలో తమ ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసి వెళుతున్నారని చెప్పారు. ఇలాంటి వాహనాలు కొన్ని చోరీ, డ్యామేజ్ కావడం జరుగుతోందని ఆయన చెప్పారు. ఉద్యోగుల వాహనాలకు భద్రత కల్పించేందుకు రూ.54 లక్షలతో ప్రత్యేకంగా పార్కింగ్ షెడ్ నిర్మించామని తెలిపారు.
తిరుమల పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొండ మీద విధులు నిర్వహించే కొందరు ఉద్యోగులకు దాతల సహకారంతో విద్యుత్ ద్విచక్ర వాహనాలు అందించనున్నామని చెప్పారు. మిగిలిన వారు కూడా ఆసక్తి చూపితే బ్యాంకు రుణం ఇప్పించి వారికి విద్యుత్ వాహనాలను అందించే ఏర్పాటు చేస్తామని అన్నారు. తిరుపతిలో ఉచిత దర్శనం స్లాటెడ్ టోకెన్ల జారీ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుండి వీఐపీ బ్రేక్ దర్శనం సమయం మార్పుపై అధ్యయనం చేసి త్వరలోనే అమలు చేస్తామని సుబ్బారెడ్డి వివరించారు. ముందుగా అనుకున్న విధంగా 10 గంటల నుండి 12 గంటలకు అనుకున్నామని, అదే సమయంలో కళ్యాణోత్సవం భక్తులు ఉంటారని, అందుకని ఉదయం 8 గంటలకు 8:30 మధ్య బ్రేక్ దర్శనం ప్రయోగాత్మకంగా ప్రారంభించి పరిశీలిస్తామన్నారు. అంతే కాకుండా తిరుమలలో పర్యావరణ పరిరక్షణ రక్షించేందుకు తిరుమలలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ వాహనాలు అందించడం జరిగిందని, వంద ద్విచక్ర వాహనాలను దాతలు అందించడం జరిగిందని, త్వరలో ఉద్యోగులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు అందజేస్తామని తెలియజేశారు.





















