Breaking News Live Telugu Updates: ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్ ప్లాన్- గంటా, లక్ష్మీనారాయణతో మంతనాలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించిన వాయుగుండం శ్రీలంకలో తీరం దాటింది. జనవరి 30 మధ్యాహ్నానికి శ్రీలంక ట్రింకోమలైకు 610 కిలోమీటర్లు, తమిళనాడులోని కరైకల్ కు 820 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం పశ్చిమ దిశగా పయనించి.. ఆ తర్వాత దక్షిణ నైరుతి వైపు దిశ మార్చుకుని ఫిబ్రవరి ఒకటో తేదీన శ్రీలంకలో తీరం దాటిందని వాతావరణ నిపుణులు తెలిపారు.
రానున్న 24 గంటల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబరు హెచ్చరికను జారీ చేశారు. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
‘‘సరిగ్గా ఇప్పుడు బంగాళాఖాతంలో మాడన్ జూలియన్ ఆసిలేషన్ (దీని వలన వర్షాలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి) ప్రభావం ఉంది. ఆ మాడన్ జూలియన్ ఆసిలేషన్ వలన దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ గాలులు కూడ బలంగా ఉంది. అంటే కింద ఎక్కడో ఉన్న అల్పపీడనం శ్రీలంక వైపుగా రానుంది. దీని వలన మనకు ప్రభావం అంతగా ఉండదు. దక్షిణాది జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలో తేలికపాటి వర్షాలుంటాయి. ఒకటి, రెండు చోట్ల మాత్రమే కొంచం సేపు గట్టిగా వర్షాలుంటాయి.
ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్లల్లో మాత్రమే తేలికపాటి వర్షాలు ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు ఉండవు. దీంతో ఎండాకాలానికి వాతావరణం సిద్దమవ్వనుంది. వెదర్ మాడల్స్ అంచనాల ప్రకారం ఈ సారి ఎండలు కాస్త ఎక్కువగా ఉండనున్నాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా కొద్ది నెలలుగా పొడి వాతావరణమే ఉంటుంది. రాష్ట్రమంతా చలి సాధారణంగానే ఉంటుందని, కానీ, ఉత్తరాది జిల్లాలకు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. చాలా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ లు జారీ చేశారు. వచ్చే ఐదు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఎల్లో అలర్ట్ అంటే.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంటే ఈ అలర్ట్ జారీ చేస్తారు.
హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 30.6 డిగ్రీలు, 15.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైపోథర్మియాతో జాగ్రత్త
విపరీతమైన చలిలో బయటకు వెళ్లే వారు ఎవరైనా అల్ప ఉష్ణస్థితికి (హైపోథర్మియా) గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత హానికర స్థాయికి పడిపోయే పరిస్థితినే హైపోథర్మియా అంటారు.
పసిడి ధర ఒక్కసారిగా జూలు విదిల్చింది. ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ₹ 500, స్వచ్ఛమైన పసిడి ₹ 550 చొప్పున దిగి పెరిగాయి. బిస్కట్ బంగారం ధర ₹58 వేలకు చేరువలో ఉంది. కిలో వెండి ధర ₹ 1000 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 53,000 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 57,820 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 53,000 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 57,820 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 76,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్ రేటే అమలవుతోంది.
ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్ ప్లాన్- గంటా, లక్ష్మీనారాయణతో మంతనాలు
ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్ పార్టీ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యా సంస్థల అధినేతలు, ఉద్యమ నేతలను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. విశాఖలో జరిగే కేసీఆర్ సభలో కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయించింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, మాజీ జేడీ లక్ష్మీ నారాయణతో భేటీ అయ్యారు. పార్టీలో చేర్చుకునేందుకు మంతనాలు జరిపినట్లు సమాచారం. మరికొంత మంది ఉత్తరాంధ్ర నేతలతో ఎమ్మెల్యే వివేక్ భేటీ అయినట్లు తెలుస్తోంది.
Sri Satya Sai District: చిలమత్తూరు మండలం నల్ల రాళ్లపల్లిలో దారుణం
శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్ల రాళ్లపల్లిలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం ఎరుగని ఆరవ తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టిన శ్రీనివాసులు అనే వ్యక్తి పై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. నల్లరాళ్ళపల్లి గ్రామానికి చెందిన విద్యార్థినితో మాయమాటలు చెప్పి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు దుర్మార్గుడు. ఇంటికి వచ్చిన విద్యార్థినిని గమనించిన తల్లిదండ్రులు అనుమానం వచ్చి ఆరా తీశారు. విషయం తెలుసుకొని స్థానిక చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో శ్రీనివాసులుపై ఫిర్యాదు చేశారు. స్పందించిన చిలమత్తూరు పోలీసులు నల్లరాళ్ళ పల్లి గ్రామానికి చేరుకుని శ్రీనివాసులుపై ఫోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Vikarabad News: వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా నారాయణ్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా 2015 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి నారాయణ రెడ్డి గురువారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా అయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. రాబోవు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ తో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కిన మిలటరీ డ్రోన్
శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల వలకు మిలటరీ డ్రోన్ చిక్కింది. సంతబొమ్మాలి మండలం భావనపాడు-మూలపేట తీరంలో మత్స్యకారులు వేట చేస్తుండగా వలలో ఈ భారీ డ్రోన్ లభ్యమయ్యింది. సుమారు 9 అడుగుల పొడవు,111 కిలోల బరువుతో విమానాన్ని పోలే విధంగా ఉంది. దీనిపై బ్యాన్ సీ టార్గెట్ అని ఇంగ్లీష్ రాతలతో పాటు 8001 నెంబర్ రాసి ఉంది. మత్స్యకారుల ఈ పరికరాన్ని భావనపాడు మెరైన్ పోలీసులకు అప్పగించారు. దీన్ని పరిశీలించిన మెరైన్ పోలీసులు మిలటరీ డ్రోన్ గా అనుమానిస్తున్నారు. డిఫెన్స్ మిసైల్స్ ప్రయోగం సమయంలో విఫలమై సముద్రంలో పడిపోయి ఉండవచ్చని మెరైన్ పోలీసులు చెబుతున్నారు. దీనిపై నేవీ, కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు.
Minister Talasani: చిక్కడ్ పల్లి అగ్ని ప్రమాద ఘటనను సందర్శించిన మంత్రి
- తగిన జాగ్రత్తలు పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- అగ్నిప్రమాదం జరిగిన VST వద్ద గోదాంను పరిశీలించి ప్రమాదం వివరాలు తెలుసుకున్న మంత్రి
- ఇలాంటి ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం
- ప్రజలలో అవగాహన కల్పించే విధంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం
- తగిన జాగ్రత్తలు పాటించని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి
- అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు - మంత్రి తలసాని