Breaking News Live Telugu Updates: తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపుపై పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
తెలుగు రాష్ట్రాలకు ఈ వారం భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. నేడు (సెప్టెంబరు 19) బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో నేడు మోస్తరు వర్ష సూచన ఉండగా, రేపటి నుంచి మరో మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. వాయువ్య మరియు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దిగువ ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు వీస్తున్నాయి.
తెలంగాణలో వర్షాలు ఇలా (Telangana Weather Updates)
నేడు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం ప్రభావం నేడు అంతంతమాత్రమే. కానీ రేపటి నుంచి మూడు, నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సెప్టెంబర్ 20 నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఈ 20 నుంచి భారీ వర్షాలు
భారీ వర్షాలు తెలంగాణలోని మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా్ల్లో అక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు 21 వరకు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఒకట్రెండు చోట్ల మోస్తరు వానలు కురుస్తాయి. నేటి (సెప్టెంబర్ 19) నుంచి మరో అల్పపీడనం ప్రభావం రాష్ట్రం పై మొదలవుతుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. రాయలసీమలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఈ ప్రాంతంలో చాలా తక్కువ వర్షాలుంటాయి. కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల చిరుజల్లులు పడతాయి. ఈ ప్రాంతానికి ఎలాంటి వర్షాల హెచ్చరికలు జారీ చేయలేదు.
తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపుపై పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తెంలగాణలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు, ఏపీలోని అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు పెంచాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి కరీంనగర్ లో ఈడీ సోదాలు
కరీంనగర్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం సోదాలు నిర్వహిస్తోంది. దిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి పలువురి ఇళ్లలో సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇద్దరు రియల్ ఎస్టేట్ బిల్డర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.





















