Breaking News Live Telugu Updates: ఈజిప్టులో ఘోర ప్రమాదం, చర్చిలో అగ్ని ప్రమాదం 41 మంది మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారుతోంది. దాంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాంలో వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం సైతం భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
తెలంగాణలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శనివారం వర్షాలు కురిశాయి. ఆదివారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగస్టు 17 వరకు రాష్ట్రానికి వర్ష సూచన ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొన్నిచోట్ల మరో 3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్ష సూచనతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో నైరుతి దిశ నుంచి గాలులు గంటకు 8 నుంచి 12 కి.మీ వేగంతో వీచనున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, పిడుగులు సైతం పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరంలో గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మరో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఆదివారం నుంచి మరో మూడు రోజులు ఓ మోస్తరు వానలు పడతాయి. రైతులకు ఈ వర్షాలు మేలు చేయనున్నాయి. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు ఏకంగా 10 గ్రాములకు రూ.400 పెరిగింది. వెండి ధర కూడా కిలోకు రూ.400 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,150 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,530 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.64,800 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,800 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,150 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,530 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,800 గా ఉంది.
ఈజిప్టులో ఘోర ప్రమాదం, చర్చిలో అగ్ని ప్రమాదం 41 మంది మృతి
Egypt Fire Accident : ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. కైరోలోని కాప్టిక్ చర్చిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Jurala Project: జూరాల ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మహబుబ్ నగర్ లో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 2,70,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా ప్రాజెక్టు దగ్గర అధికారులు 36 గేట్లు పైకెత్తి 2 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం దిగువకు విడుదల చేస్తున్నారు. గత పది రోజులుగా వరద ప్రవాహం యథావిధిగా కొనసాగుతుండటంతో కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో పెద్ద ఎత్తున వరద రావడం ఇదే మొదటిసారి అని అధికారులు అంటున్నారు. సాయంత్రం వరకు వరద మరింత పెరిగితే మరికొన్ని గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేసేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
Asifabad News: కుంగిన బ్రిడ్జి - నిలిచిన రాకపోకలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు బ్రిడ్జీలే బీటలు వారుతున్నాయి. కాగజ్‌నగర్ మండలంలోని అందవేల్లిలో పెద్దవాగు పై ఉన్న బ్రిడ్జి డెంజర్ జోన్ కు చేరింది. భారీ వరదలకు పెద్దవాగుపై బ్రిడ్జి కుంగింది. బ్రిడ్జి పై భాగం సైతం బీటలు వారింది. దీంతో కాగజ్‌నగర్, దహేగామ్ మద్య రాకపోకలు నిలిపివేశారు అదికారులు. బ్రిడ్జి కృంగిపోవడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉందని ప్రజలు భయపడుతున్నారు. ఇటీవల కుండపోతగా కురిసిన వర్షాలతో బ్రిడ్జి దెబ్బ తిన్నదని అదికారులు చెబుతున్నారు. రాకపోకలు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి కృంగిపోవడంతో ఎక్కడి వారిని అక్కడే నిలిపేసి తిరిగి పంపిస్తున్నారు అధికారులు. ప్రజలు సైతం బ్రిడ్జి కూలిపోతుందని భయాందోళనకు గురై అటు వైపుగా వెళ్ళడం లేదు. ప్రస్తుతం బ్రిడ్జి వద్ద అధికారులు అప్రమత్తమై రాకపోకలు నిలిపివేశారు. కృంగిన బ్రిడ్జి కి మరమ్మత్తులు చేసి త్వరలో ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
Pranahitha River: ఉదృతంగా ప్రవహిస్తున్న ప్రాణహితనది
తెలంగాణ సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహిత ఉధృత రూపం దాల్చింది. నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండగా తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గూడెం వంతెనను తాకుతూ నది ప్రవహిస్తోంది. నదీ తీర ప్రాంతంలో వరద నీటితో పంటలు ముంపునకు గురయ్యాయి. గత పదేళ్లలో ఇంత వరద రాలేదని స్థానికులు పేర్కొంటున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలోని దిందా, గూడెం, కోయపెల్లి, చిత్తం, బూరుగూడ గ్రామాల పరిధిలో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. మహారాష్ట్రలోని గోసికుర్ద్ డ్యాం గేట్లు ఎత్తివేయడంతోనే నదిలో నీటిమట్టం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరదతో పుష్కర ఘాట్లు నీట మునిగాయి. ఒడ్డున గల శ్రీకార్తీక్ మహరాజ్ ఆలయం చుట్టూ వరద చేరింది. తాటపల్లి, గుండాయిపేట, వీర్ధండి సమీపంలోని పెన్ గంగా నిండు కుండలా ప్రవహిస్తోంది.
Tirumala News: తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి, డిఆర్డిఏ ఛైర్మన్ సతీష్ రెడ్డిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. కలియుగ దైవం శ్రీనివాసుడి దర్శనం కోసం వేలాది మంది తిరుమలకు చేరుకుంటున్నారు.. సామాన్య భక్తులను అర్ధం చేసుకుని వివిఐపిలు తమ తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని నారాయణ స్వామి కోరారు.. భక్తులను ఎప్పుడూ స్వామి వారి ఆశీర్వదించాలని, పేద వాళ్ళ భవిష్యత్తును మార్చే ఇంగ్లీషు మీడియంను ప్రతి ప్రభుత్వం పాఠశాల్లో ప్రవేశ పెట్టారన్నారు.. పేదల పిల్లలు కూడా అన్ని రంగాల్లో ముందు ఉండాలనే ఉద్దేశంతో దాదాఒఉ ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమంకు సీఎం శ్రీకారం చుట్టారన్నారు.. కులము, మతము అనే తేడా లేకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, పేదలందరూ సీఎంను తమ దైవంగా భావిస్తున్నారని ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు.