Breaking News Live Updates: సిద్ధిపేట జిల్లాలో కేఏ పాల్ పై దాడి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలలో నేటి మరో నాలుగైదు రోజుల వరకు వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో మే 4 తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తరువాత 24 గంటల్లోనే ఇది బలహీన పడుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
కోస్తాంధ్రలో వర్షాలు..
ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు వర్ష సూచనతో ఉపశమనం కలిగింది. నేటి నుంచి మరో మూడు రోజుల వరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు చూసుకోవాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత సురక్షితం కాదని అధికారులు మత్స్యకారులను హెచ్చరించారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం నేడు పొడిగా మారుతుంది. రేపటి నుంచి రెండు రోజులపాటు ఈ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాయలసీమలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు.
తెలంగాణలోనూ వర్షాలు..
దక్షిణ అండమాన్‌లో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంత తెలంగాణపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. నేటి నుంచి మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. ఒకట్రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, దేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలతో సహా కొన్ని కొండ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 2న అరుణాచల్ ప్రదేశ్, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మే 2 నుంచి మే 4 వరకు అసోం, మేఘాలయాలో ఇదే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో మే 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ , ఒడిశాలో రాబోయే ఐదు రోజులలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రాబోయే ఐదు రోజులలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సిద్ధిపేట జిల్లాలో కేఏ పాల్ పై దాడి
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై దాడి జరిగింది. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి కేఏ పాల్ పై దాడికి పాల్పడ్డాడు. డీఎస్పీ సమక్షంలోనే పాల్ పై దాడి జరిగింది. కేఏ పాల్ సిరిసిల్ల రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఒంగోలు రిమ్స్ వద్ద పోలీసులు, జనసేన నేతలకు మధ్య వాగ్వివాదం
ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న రేపల్లె రైల్వే స్టేషన్ బాధితురాలిని పరామర్శించేందుకు జేనసేన నాయకులు ప్రయత్నించారు. బాధితురాలి వద్దకు వెళుతున్న జనసేన నాయకులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిని స్టేషన్ కు తరలించే సమయం లో జనసేన నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
Chandrababu Letter To AP DGP: ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు - డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి చంద్రబాబు లేఖ
Chandrababu Letter To AP DGP: ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ
రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైం రేట్ పై వివరాలతో ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో నేరాలను అదుపు చెయ్యడంలో పోలీసుల వైఫల్యం అవుతున్నారని, నిందితులపై కఠిన చర్యలకు చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విచ్చిన్నం అయ్యింది. జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందైన్నారు.
ఏపీ ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయని, పెట్రేగుతున్న వైఎస్సార్‌సీపీ గూండాలను అదుపు చెయ్యడంలో పోలీసు శాఖ విఫలం అవుతోందని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. జి కొత్తపల్లిలో తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్ రావు కారణం అని స్వయంగా మృతుడు గంజి ప్రసాద్ భార్య చెప్పారని వెల్లడించారు. శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసుల విఫలం అయ్యారని గుర్తు చేశారు.
లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్ లో దారుణం జరిగేది కాదన్నారు. రాష్ట్రంలో నేరాలకు మద్యం, గంజాయి వాడకమే కారణమని, గంజాయి సరఫరాలో వైసీపీ నేతల ప్రమేయం కనిపిస్తున్నా, పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని తన లేఖలో చంద్రబాబు ఆరోపించారు. అనంతపురంలో పెన్షన్ అడిగిన పాపానికి టిడిపి కార్యకర్తపై పోలీసు అధికారి దాడి చెయ్యడం డిపార్ట్మెంట్‌లో పరిస్థితికి నిదర్శనం అన్నారు.
ఏపీలో ఎప్పుడూ లేని విధంగా పట్టపగలు గన్ తో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోటలో బ్యాంక్ దోపిడీ జరిగిందని.. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ పోలీసులు స్పందించడం లేదని.. కర్ణాటక పోలీసులు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఆస్ట్రేలియాకు డగ్స్ సరఫరా కేసులో దర్యాప్తు సంస్థలు ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాయని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుని లా అండ్ ఆర్డర్ అమలుపై పోలీసు శాఖ ఫోకస్ చేయాలని ఏపీ డీజీపీని కోరుతూ లేఖ రాశారు చంద్రబాబు.
Kadapa Smugglers Arrest: కడప జిల్లా సిద్దవటంలో ఎర్రచందనం అక్రమరవాణా
సిద్ధవటంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్ల గుట్టు రట్టు చేశారు కడప జిల్లా సిద్దవటం పోలీసులు. కడప ఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అన్బు రాజన్ మాట్లాడుతూ కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా సిద్ధవటం మండలం మందపల్లి గ్రామం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్ల తో పాటు 22 ఎర్రచందనం దుంగలు, కారు, ఆటో, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని స్మగ్లర్లను రిమాండ్ కు తరలించామని అన్నారు. ఎర్రచందనం పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఒంటిమిట్ట సీఐ రాజా ప్రభాకర్, టాస్క్ ఫోర్స్ సీఐ నాగార్జున, సిద్ధవటం ఎస్సై, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
Tirumala శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి, రాజకీయాలు వద్దని సూచన
తిరుపతి : తిరుమల శ్రీవారిని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. నేటి ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నో జన్మల పుణ్యఫలంతోనే స్వామి వారి దర్శన భాగ్యం కలిగిందన్నారు. ఏడుకొండలపై రాజకీయాల వ్యాఖ్యలను ఆయన ఖండించారు.