AP TS Cabinet Meeting : సెప్టెంబర్ 3న తెలంగాణ, 7న ఏపీ కేబినెట్ భేటీ!
AP TS Cabinet Meeting : సెప్టెంబర్ 3వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో వర్షాకాల సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఏపీ కేబినెట్ భేటీ సెప్టెంబర్ 7కు వాయిదా పడింది.
AP TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 3న హైదరాబాద్ ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 15తో ముగియడంతో సెప్టెంబర్ 14లోపు శాసనసభ మళ్లీ సమావేశం కావాల్సి ఉంటుంది. దీంతో శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్‌లో చర్చించి ఖరారు చేయనున్నట్లు సమాచారం. వీటితో పాటు ఇతర ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
వర్షాకాల సమావేశాలపై చర్చ!
కేబినెట్ భేటీలో శాసనసభ వర్షాకాల సమావేశాల తేదీల ఖరారు, నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబరు 14లోపు తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలను నిర్వహించాల్సి ఉండడంతో శాసనసభ సమావేశాలపై ఎప్పుడు ఏర్పాటు చేయాలనే దానిపై సీఎం కేసీఆర్ చర్చించి, షెడ్యూలు ఖరారు చేసే అవకాశం ఉంది.
ఏపీ కేబినెట్ వాయిదా
ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. సెప్టెంబర్ 1న జరగాల్సిన మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 7న జరగనుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 31న వినాయక చవితితో పాటు సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు సీఎం జగన్ కడప జిల్లా పర్యటన ఉండడంతో కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్ వైఎస్ఆర్ కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.
సీఎం జగన్ కడప టూర్
సీఎం జగన్ మూడు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కడప జిల్లాకు సీఎం చేరుకుంటారు. వేముల మండలం వేల్పులలో గ్రామ సచివాలయం కాంప్లెక్స్‌ను సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ వెళ్లి వైఎస్సార్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు. సెప్టెంబర్ 2న ఉదయం 8.50 గంటలకు సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఎస్టేట్‌లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేసి సెప్టెంబర్ 3న ఉదయం కడప నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి తిరుగు పయనం అవుతారు.
Also Read : Power Politics : ఎవరు ఎవరికి బాకీ ? ఏపీ, తెలంగాణ విద్యుత్ బకాయిల వివాదం పూర్తి డీటైల్స్ ఇవిగో !