(Source: ECI/ABP News/ABP Majha)
Breaking News Live Telugu Updates: తెలంగాణ ఎన్నికల సమరం - బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ - గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరిక
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.
LIVE
Background
తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. రేపటితో గడువు ముగియనుండగా మంచి రోజు కావడం వల్ల గురువారం నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేయగా, సీఎం కేసీఆర్ నేడు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు గజ్వేల్ లో, మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. దీనికి సంబంధించిన పత్రాలపై ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత సంతకాలు చేశారు. కేసీఆర్ నామినేషన్ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేశాయి. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం నామినేషన్లు వేస్తుండగా, 11 స్థానాల్లో బీజేపీ, 4 స్థానాల్లో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కూడా రేపు సిద్దిపేటలో నామినేషన్ వేయనున్నారు. గురువారం ఉదయం 11:30 తరవాత నామినేషన్ వేయనున్నారు. తెలంగాణలోని అందరు ఎమ్మెల్యేల్లో హరీశ్ రావు మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే.. సీఎం కేసీఆర్ తర్వాత సిద్దిపేట శాసన సభ స్థానానికి 2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి హరీశ్ రావు 24,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 58,935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64,014 ఓట్లతో గెలిచారు. 2010 మొదట్లో యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబరు 9 లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకియ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నందున నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఓట్లతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొంది 2009 లో వై.యస్.రాజశేఖరరెడ్డి పులివెందుల నియోజక వర్గంలో సాధించిన 68,681 ఓట్ల రికార్డును తిరగరాశారు.
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 93,328 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1,18,699 ఓట్లతో రికార్డు మెజార్టీతో విజయం సాధించి, 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హరీష్ రావుకు ఆరోగ్యశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం 2021, నవంబరు 9న బాధ్యతలు చేపట్టారు. 2023 లో జరిగే ఎన్నికలకు సిద్దిపేట అభ్యర్థిగా ఆగస్టు 21న మరోసారి ప్రకటించారు.
బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ - గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరిక
కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నామినేషన్ సందర్భంగా కామారెడ్డి చేరుకున్న ఆయన, ఎమ్మెల్యే గంప గోవర్థన్ నివాసంలో నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. గ్రూప్ తగాదాలు వీడాలని, గీత దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో తప్పుడు సంకేతాలు పొతాయని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. కాగా, కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండడంతో పొలిటికల్ హీట్ నెలకొంది.
ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత - నామినేషన్ల సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల ఘర్షణ, పోలీసుల లాఠీఛార్జ్
హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొనగా, ఇరువర్గాల వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వాహనం దిగి వెళ్లిపోయారు.
మధిర కాంగ్రెస్ అభ్యర్థిగా భట్టి విక్రమార్క నామినేషన్
మధిర కాంగ్రెస్ అభ్యర్థిగా భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేశారు. అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లి ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. మరోవైపు, పొంగులేటిపై ఐటీ దాడులను ఆయన ఖండించారు. బీఆర్ఎస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్ - వీల్ ఛైర్ పై వెళ్లి నామినేషన్ సమర్పణ
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి వీల్ ఛైర్ పై వెళ్లి నామినేషన్ వేశారు. ఇటీవల ఆయనపై కత్తి దాడి జరగ్గా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నేడు దుబ్బాక స్థానానికి నామినేషన్ వేశారు.
కామారెడ్డికి చేరుకున్న సీఎం కేసీఆర్ - కాసేపట్లో నామినేషన్
సీఎం కేసీఆర్ కామారెడ్డి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన కామారెడ్డి స్థానానికి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసగించనున్నారు. ఇప్పటికే గజ్వేల్ లో నామినేషన్ వేశారు.