Breaking News Live: కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
తిరుమల శ్రీవారిని మాజీ బ్యాట్మింటన్ ఆటగాడు పుల్లెల గోపిచంద్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా....ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.... శ్రీవారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని..... మంచి దర్శనాన్ని కల్పిస్తున్న టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ తిరుపతిలో జరగనున్న లే పంగ...కబాడీ జాతీయ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాల్గొంటున్నట్లు చెప్పారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో జాతీయ స్థాయి స్పోర్ట్ మీట్ కు సంకల్పించిన ఎమ్మెల్యే భూమన., మేయర్ శిరీషా., కమిషనర్ గిరీషాల ప్రయత్నం అభినందనీయం అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లు, థియేటర్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రామ్ గోపాల్ వర్మ పది ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ వీడియోను ఆయన తన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంచారు. తన ప్రశ్నలకు స్పందించాలని ఏపీ ప్రభుత్వ పెద్దలకు లేదా మంత్రులకు మంగళవారం సాయంత్రం సవాలు విసిరారు. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పందించారు. రామ్ గోపాల్ వర్మ వదిలిన 10 ప్రశ్నలకు కౌంటర్ ఇస్తూ వరుస ట్వీట్లు చేశారు.
‘‘గౌరవనీయులైన ఆర్జీవీ గారూ.. మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. రూ.100 టికెట్‌ను రూ.వెయ్యికి, రూ.2 వేలకి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయి? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ అండ్ సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా? సామాన్యుడి మోజుని, అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి.’’
‘‘ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు. బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు.. ప్రొడ్యూసర్స్ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ.’’
‘‘సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే.. మెడికల్, ఎడ్యుకేషన్ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు రామ్ గోపాల్ వర్మ గారూ. థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి.’’
‘‘హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు ఆర్జీవీ గారూ’’
‘‘ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు. అది వినోద సేవ మాత్రమే. ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్ ధరల నియంత్రణ మాత్రమే తప్ప, సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు’’ అని పేర్ని నాని ట్వీట్లు చేశారు.
కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల
కరీంనగర్ జైల్ నుంచి బండి సంజయ్ విడుదల అయ్యారు. తనపై నమోదు చేసిన కేసులపై బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కరీంనగర్ మెజిస్ట్రేట్ ఇచ్చిన జ్యూడిషియల్ రిమాండ్ ఆర్డర్ ను రద్దు చేయాలని బండి సంజయ్ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ చేసింది. వెంటనే విడుదల చేయాలని.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
బండి సంజయ్ కి హైకోర్టులో ఊరట.. వెంటనే విడుదల చేయాలని ఆదేశం
బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది. బండి సంజయ్ రిమాండ్ ను రద్దు చేసింది. వెంటనే.. ఆయనను విడుదల చేయాలని జైళ్ల శాఖ డీజీని ఆదేశించింది.
ప్రజాగ్రహాసభ స్పందన చూసి ఏపీ ప్రభుత్వం గుండెల్లో రాళ్లు పడ్డాయి.. ఎంపీ జీవీఎల్
ప్రజాగ్రహాసభకు వచ్చిన స్పందన చూశాక ఏపీ ప్రభుత్వం గుండెల్లో రాళ్లు పడ్డాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అందుకే సీఎం జగన్ వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుండి నిధులు వస్తుంటే ఇక్కడ వైసీపీ తన స్టికర్లు వేసుకుంటుందన్న జీవీఎల్.. వైసీపీ, టీడీపీ రెండూ తమకు ప్రత్యర్థులేనన్నారు . రెండురోజుల పర్యటన కోసం వైజాగ్ వచ్చిన ఆయన నగర పరిసర ప్రాంతాల్లో కేంద్ర నిధులతో నడుస్తున్న సంస్థలను, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అలాగే ఏపీపై బీజేపీకి సడన్ గా ప్రేమ పుట్టలేదనీ మొదటినుండీ ఏపీ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నది బీజేపీయేనని చెప్పారు.
సంగారెడ్డి జిల్లాలో భూప్రకంపనలు
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కోహీర్ మండలం మనియార్‌పల్లి, బిలాల్‌పూర్, గొట్టిగార్‌పల్లిలో ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని స్థానికులు చెప్పారు.
ఎస్సారెస్పీ కాలువలో పడ్డ కారు ఎట్టకేలకు బయటికి.. ఇద్దరి మృతదేహాలు గుర్తింపు
జగిత్యాల జిల్లాలో రెండు రోజుల కిందట ఎస్సారెస్పీ కాలువలో పడిన కారును పోలీసులు ఎట్టకేలకు బయటికి తీశారు. అందులో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను గుర్తించారు. వారి పేర్లు మెట్‌పల్లికి చెందిన పూదరి రేవంత్ (31), గుండవేని ప్రసాద్ (41) అని పోలీసులు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి మెట్‌పల్లి నుంచి ఆత్మకూరుకు కారులో వెళ్తుండగా.. వంతెన రెయిలింగ్‌ను ఢీకొని వీరు కాలువలో పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.