Breaking News Live: రెండో వన్డేలో వెస్టిండీస్‌కు 238 పరుగుల లక్ష్యం నిర్దేశించిన భారత్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. కొన్ని రోజుల కిందటి వరకు ఏపీలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. తాజాగా తెలంగాణలో వర్షాల ప్రభావంతో చలి తీవ్రత అధికమైంది. రెండు వైపుల నుంచి వీచే గాలులతో ఉదయం వేళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏపీ, యానాంలలో ఉత్తర, ఈశాన్య దిశల నుంచి చలిగాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, కోస్తాంధ్రలో మాత్రం చలి తగ్గడం లేదు.
ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీచే గాలులలో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అత్యల్పంగా నందిగామలో 16.3 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కళింగపట్నంలో 17.1 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 18.2 డిగ్రీలు, బాపట్లలో 18.3, అమరావతిలో 19.2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది. వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండవని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి ప్రభావం కాస్త తగ్గింది. ఆరోగ్యవరంలో 19 డిగ్రీలు, అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.1 డిగ్రీలు, నంద్యాలలో 19.6 డిగ్రీలు, కర్నూలులో 20 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్, కొమురంభీమ్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం వేళ కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు పెరిగింది. గ్రాముకు రూ.20 చొప్పున ఎగబాకింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.200 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,400 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,530 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.65,100గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,530గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,400 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,530గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,100గా ఉంది.
వెస్టిండీస్ ముందు 238 పరుగుల లక్ష్యం
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లో సూర్యకుమార్ యాదవ్ (64: 83 బంతుల్లో, ఐదు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు
విశాఖపట్నంలో శారదాపీఠం వార్షికోత్సవాలకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. రాజశ్యామల యాగం కోసం సీఎంతో పండితులు సంకల్పం చేయించారు. అనంతరం అమ్మవారికి జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత శారదాపీఠంలోని విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాలను సీఎం సందర్శించారు. ఆ తర్వాత జగన్ చేతుల మీదుగా కలశ స్థాపన చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలు, పతకాలను సీఎం అందజేయనున్నారు.
శ్రీ శారదాపీఠం వార్షిక ఉత్సవాలకు హాజరైన సీఎం జగన్
విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేశారు. రాజశ్యామల యాగం, రుద్ర హోమం పూర్ణాహుతికి సీఎం హాజరయ్యారు.
తిరుపతికి చేరుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
చిత్తూరు జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న ఆయన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం గుండా తిరుపతి పద్మావతి అతిథి గృహంకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేరుకోనున్నారు. కాసేపు విశ్రాంతి తరువాత యోగిమల్లవరం వద్ద నున్న రాహుల్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరు కానున్నారు. అటుతరువాత అక్కడి నుంచి నేరుగా తిరుమలకు పయనం కానున్నారు. అటు తరువాత తిరుమలలోని పద్మావతి అతిధి గృహంలో రాత్రి వెంకయ్య నాయుడు బస చేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనంతరం పద్మావతి అతిధి గృహంకు చేరుకుని అల్పాహారం స్వీకరించి కాసేపు విశ్రాంతి తరువాత మధ్యాహ్నం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు వెంకయ్య నాయుడు తిరిగి వెళ్ళనున్నారు.
నిర్మల్‌లో ప్రధాని దిష్టి బొమ్మ దహనం
పార్లమెంట్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రధాని వ్యాఖ్యలు యావత్ తెలంగాణా సమాజాన్ని కించ పరిచేలా ఉన్నాయని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజీపీ నాయకులు వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.