Breaking News Live Updates: ముగిసిన ఏపీ కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గ నేతల సమావేశం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 10న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 10న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ముగిసిన రాష్ట్రస్థాయి కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గ విస్తృత స్థాయి సమావేశం
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో రాష్ట్రస్థాయి కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. కాపు రిజర్వేషన్లు సాధనకు రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చిందని నేతలు చర్చించారు. పార్లమెంటులో ఇటీవల జరిగిన చట్ట సవరణ ప్రకారం ప్రభుత్వమే 5 శాతం కాపు రిజర్వేషన్ ఇవ్వ వచ్చునని పేర్కొన్నారు. త్వరలో విజయవాడలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల భారీ సమావేశం నిర్వహించాలని చర్చించారు. కాపులకు ఏడాదికి రూ.2 వేల కోట్ల హామీని ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
వృద్ధ దంపతులపై పెట్రోల్.. నిప్పంటించి హత్య
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కేపీహెచ్‌బీ కాలనీలోని 6వ ఫేజ్‌లో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, వారి అల్లుడే పెట్రోల్ పోసి నిప్పుపెట్టినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. దంపతుల కుమార్తెను సాయి కృష్ణ అనే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడని.. ఇటీవల దంపతుల కుమార్తెను ఇతను వేధిస్తున్నందున ఈ అత్తామామలు పోలీసులకు ఫిర్యాదు చేశారని స్థానికులు వెల్లడించారు.
నదిలో దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య
గోదావరి ఖనిలో గోదావరి నదిలో దూకి ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. కమిషనరేట్ పరిధిలో సీసీఎస్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న అలెగ్జాండర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగానే ఆయన ఈ ఆత్మహత్యకి పాల్పడినట్లుగా నిర్దారించారు. ఆయన శవం కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని బయటకు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.
గోడ కూలి ఐదుగురు దుర్మరణం
జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అయిజ మండలం కొత్తపల్లిలో ఓ ఇంటి గోడకూలి ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రాత్రి వేళ ఇంట్లో ఏడుగురు నిద్ర పోతుండగా.. పాతకాలపు గోడ కూలిందని స్థానికులు తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ, ఏపీ మంత్రి
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహా, ఏపి దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సినీనటుడు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందజేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.