T Congress Dispute: తెలంగాణ కాంగ్రెస్‌పై డిగ్గీరాజా రిపోర్ట్ రెడీ- అసలు సమస్య అదేనంటూ వివరణ!
T Congress Dispute: రెండ్రోజుల పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో చర్చలు, సమాలోచనలు జరిపిన ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వారి వివాదాలకు సర్దుమాట మార్గం ప్రతిపాదించారు.
Telangana Congress Dispute: తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య వివాదం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. సొంత పార్టీలోనే విభేదాలు జరగడంతో పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. వారి సమస్యలను పోగొట్టి మళ్లీ అందరూ కలిసుండేలా చేసేందుకు ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుల మధ్య ఉన్న విబేధాలను పోగొట్టేందుకు.. రెండు రోజుల పాటు రాష్ట్ర నేతలతో దిగ్విజయ్ సింగ్ సమాలోచనలు జరిపారు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాదాలకు ముగింపు పలికేలా సర్దుబాటు మార్గం ప్రతిపాదించారు. నేతల మధ్య ఉన్న విభేదాలకు పరిష్కారం చూపేలా ఆయన నివేదకను సిద్ధం చేశారు. దీన్ని అధిష్ఠానానికి సమర్పించడంతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కేసీ వేణు గోపాల్ కు ఇక్కడి పరిస్థితులను ప్రత్యేకంగా వివరించనున్నారని సమాచారం.
రెండ్రోజుల పాటు నేతలతో సమాలోచనలు..
దీని అనుగుణంగానే త్వరలోనే అదిష్ఠానం సర్దుబాటు దిశగా కీలక చర్యలకు శ్రీకారం చుడుతుందని ఏఐసీసీ వర్గాల అభిప్రాయం. దిగ్విజయ్ సింగ్ నివేదికకు తుది రూపు ఇచ్చే క్రమంలో మరోమారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ ఛార్జీ కార్యదర్శులతో కూడా చర్చించారు. సుమారు ఏడాదిన్నరగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య సత్సంబంధాలు లేకపోవడం పార్టీకి నష్టం కల్గిస్తోందని క్షేత్ర స్థాయిలో నాయకులు, శ్రేణుల్లో వ్యతిరేక భావాలను పెంచిందని దిగ్విజయ్ అభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలోనే పలువురు నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల దారి వెతుక్కుంటున్నారని.. ఇదే పరిస్థితి కొనసాగితే క్షేత్ర స్థాయిలో పార్టీకి సమస్యలు మరింత ఎక్కువవుతాయని గుర్తించారు.
రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాణికం ఠాగూర్ ..
రేవంత్ రెడ్డి, పార్టీలో సీనియర్ నేతల మధ్య వివాదాల అంశం గత ఎన్నికల ముందు నుంచీ కొనసాగినా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడం కొందరు సీనియర్లకు ఆమోద యోగ్యంగా లేదని అన్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, సర్దుకుపోలేక సతమతమవుతున్నట్లు కొందరు సీనియర్లు పేర్కొనడాన్ని దిగ్విజయ్ ప్రత్యేకంగా పరిగణించారు. దీని కోసం ఐదు అంశాలపై కీలక పరిష్కార ప్రతిపాదనలు ఏఐసీసీ ముందుంచేందుకు ఆయన సిద్ధమైనట్లు సమాచారం. ఏఐసీసీ ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ పై సీనియర్ నేతలకు అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. ఆయన పూర్తిగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తారని, తాము ఏ సూచనలూ చేసే పరిస్థితి లేదని సీనియర్లు భావిస్తున్నారని వివరించారు. దీనిపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించాలని, సీనియర్ నేతను ఇంఛార్జీగా నియమించడంపై ఆలోచించాలన్నారు.
వెంటనే సమస్యలు పరిష్కరించాలి..!
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో పార్టీలోనే విభేదాలు పార్టీకి చాలా నష్టం కల్గిస్తాయయని.. ఇప్పటికే ఆలస్యం అయింది, త్వరగా సమస్యలు తీర్చాలని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో సీనియర్లపై వ్యతిరేక ప్రచారం జరగడంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. దీనిపై వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని సమస్యపు పరిష్కారం చూపాలన్నారు. సమస్యల కోసం ప్రత్యేక కమిటీని నియమించడం లేదా ఏఐసీసీ ముఖ్యులకు బాధ్యతలు అప్పగించడం అవసరం అని దిగ్విజయ్ సింగ్ సూచించారు.