BC Reservations Issue: బీసీ బిల్లుపై ఏకాభిప్రాయం - సుప్రీం తీర్పు ప్రకారం ఆమోదించినట్లే - హైకోర్టులో ప్రభుత్వం వాదనలు
Telangana High Court: బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందినట్లేనని ఏజీ హైకోర్టులో వాదించారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆమోదం పొందినట్లేనన్నారు.

BC Reservation Bill Telangana High Court: : రిజర్వేషన్ల పెంపు బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో సుదీర్ఘ కాలంగా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆమోదం పొందినట్లేనని అడ్వకేట్ జనరల్ తెలంగాణ హైకోర్టులో వాదించారు. బీసీ రిజర్వేషన్ల జీవోపై దాఖలైన పిటిషన్ లపై మరోసారి హైకోర్టులో విచారణ ప్రారంభమయింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏజీ వాదనలు కొనసాగించారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారని.. ఒక్క పార్టీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదన్నారు. ఆరు నెలల పాటు గవర్నర్ లేదా రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్ లో ఉంటే ఆమోదించినట్లేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు . సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని హైకోర్టు దృష్టికి ఏజీ తీసుకెళ్లారు. . బీసీ జనగణన శాస్త్రీయంగా నిర్వహించాం. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. బీసీ జనగణన చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ కూడా బీసీ జనగణన చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. బీసీల సంఖ్యపై పిటిషన్లకు అభ్యంతరం లేనప్పుడు .. వారికి రిపోర్టు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
పంచాయతీ రాజ్ చట్టంలో 285-ఏ సెక్షన్‌ను సవరించే బిల్లుకు రాష్ట్రపతి డ్రౌపది ముర్ము ఆమోదం తెలిపి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం దానిని అధికారికంగా నోటిఫై చేసి, 42% బీసీ కోటాను అమలు చేసి ఉండేది. ప్రస్తుతం బిల్లు గవర్నర్ దగ్గర ఆమోదానికి ఉంది, కానీ ఆమోదం లేకున్నా ప్రభుత్వం గో (గవర్నమెంట్ ఆర్డర్) నెం. 9 ద్వారా కోటాను ప్రకటించింది. సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం, గవర్నర్‌కు బిల్లు అందిన తేదీ నుంచి 1 నెల (కొన్ని సందర్భాల్లో 3 నెలలు) గడువులో ఆమోదం ఇవ్వకపోతే, అది స్వయంచాలకంగా చట్టంగా (డీమ్డ్ పాస్డ్) పరిగణించాలి. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇలాంటి పద్ధతి అమలులో ఉందని, తెలంగాణలో కూడా ఇది వర్తిస్తుందని ఏజీ వాదించారు. ఈ బిల్లు ఇంకా ఆ కాలపరిమితి లోపల ఉంది కాబట్టి, ఆమోదం లేకున్నా చట్టబద్ధమేన్నారు.
గవర్నర్ గడువు ముగిసిన తర్వాత బిల్లు చట్టంగా మారితే, ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇది స్వయంచాలకంగా అమలులోకి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే బీసీ కమిషన్ సిఫార్సులు, కుల సర్వే డేటా (56.36% బీసీలు) ఆధారంగా గో ప్రకటించింది, ఇది ట్రిపుల్ టెస్ట్ (సైంటిఫిక్ డేటా, కమిషన్ సిఫార్సు, పబ్లిక్ కన్సల్టేషన్) పాటించిందని ఏజీ స్పష్టం చేశారు.
బుధవారం జరిగిన సుదీర్ఘ వాదనల అనంతరం.. ఎలాంటి స్టే ఇవ్వకపోవడంతో నోటిఫికేషన్ గురువారం జారీ అయింది. తొలి విడత పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. కోర్టు విచారణ ముగిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.





















