Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల! 11 వరకు నామినేషన్లు స్వీకరణ
Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదలైంది. 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23న పోలింగ్ జరగనుంది.

Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మొదటి విడతకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక ప్రకటన చేశారు. మొదటి దశలో 292 జడ్పీటీసీ, 2, 963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న వాటిని పరిశీలిస్తారు. 15 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ఎన్నికల సంఘం తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు కోర్టు అంగీకరించకపోవడంతో అధికారులు కూడా ధైర్యంగా ముందడుగు వేశారు. అందుకే ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. తర్వాత గ్రామపంచాయితీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు దశల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు దశల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్‌లో భాగంగానే ఇవాళ( గురువారం) అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్‌లు వివరాలను వెల్లడించారు. రెండో విడత నోటిఫికేషన్ 13వే తేదీన విడుదల చేస్తారు.
ఇప్పుడు నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు అక్టోబర్ 11 ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. నామినేషన్ వేసేటప్పుడు ప్రతి అభ్యర్థి తమ పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, క్రైమ్ హిస్టరీ అన్నింటినీ పొందుపరచాలని పేర్కొన్నారు. వివరాలు సరిగా లేకుండే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని హెచ్చరించారు. వచ్చిన నామినేషన్లను 12న పరిశీలిస్తారు. అదే రోజు ఇచ్చిన వివరాల ప్రకరం ఎవరెవరు పోటీకి అర్హులో కూడా వెల్లడిస్తారు. వారిలో పోటీ నుంచి తప్పుకోవాలంటే గడవు 15వ తేదీ వరకు ఉంటుంది. అనంతరం తుది జాబితా బహిర్గతం చేస్తారు. పోటీలో ఉన్న వాళ్లకు ఈ నెల 23న పోలింగ్ ఉంటుంది. రెండో విడత పోలింగ్ కూడా అక్కడికి ఐదు రోజుల తర్వాత ఉండే అవకాశం ఉంది. ఈ ఫలితాలను నవంబ్ 11న విడుదల చేస్తారు.
అభ్యర్థులు ఫారం-4లో ఉన్న మోడల్‌లోనే నామినేషన్లు దాఖు చేయాలి. జిల్లాలో ఓటు హక్కు కలిగిన వాళ్లు మాత్రమే పోటీ చేసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. పోటీ చేసే వ్యక్తితోపాటు మద్దతుగా నామినేషన్లు సంతకం చేసే వాళ్లికి కూడా స్థానికంగా ఓటు హక్కు ఉండాలి. అధికారులు పేర్కొన్న ఆఫీస్‌కు వెళ్లి నామినేషన్లు ఇవ్వాలి. గుర్తింపు పొందిన పార్టీ నుంచి పోటీ చేస్తుంటే ఆ వివరాలను ఫారమ్-2లో చెప్పాలి. బీఫామ్‌ను కూడా ఉపసంహరణ గడువు లోపు అధికారులు సమర్పించాలి. ఒక వేళ పొరపాటున ఈ వివరాలు సమర్పించకుంటే వాళ్లను స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటించి ఫ్రీ సింబర్ ఇస్తారు. గుర్తింపు పొందిన పార్టీ నుంచి పోటీ చేస్తే పార్టీ గుర్తును కేటాయిస్తారు. స్వతంత్ర అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన గుర్తుల్లో మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు.





















