Adilabad: ఆస్పత్రికి రానని మొండికేసిన నిండు గర్భిణీ, ఎమ్మార్వో చెప్పినా వినకుండా.. కారణం తెలిస్తే షాక్!
గర్భిణి అయిన ఓ మహిళ ఆస్పత్రికి రానని మొండికేసింది. తాను దేవుడికి మొక్కుకున్నానని అతడే రక్షిస్తాడని తెగేసి చెప్పింది.
మారుమూల పల్లెల్లో కొందరి మూఢనమ్మకాలు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఓ మహిళ ప్రవర్తించిన తీరు కూడా అలాగే అయింది. ఆమెకు అత్యవసర వైద్యం అందాల్సి ఉండగా.. తనను దేవుడే కాపాడతాడని చెప్పి చికిత్సకు నిరాకరించింది. పెద్ద మనుషులతో పాటు అధికారులు సైతం వచ్చి నచ్చచెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గర్భిణి అయిన ఓ మహిళ ఆస్పత్రికి రానని మొండికేసింది. తాను దేవుడికి మొక్కుకున్నానని అతడే రక్షిస్తాడని తెగేసి చెప్పింది. నార్నూర్ మండలంలోని మహగావ్ శేకుగూడ గ్రామానికి చెందిన మేస్రం రేణుకబాయి అనే మహిళ 8 నెలల గర్భిణీ. ఇది ఆమెకు మూడో కాన్పు. తొలి, రెండో కాన్పుల్లోనూ ఆమెకు అబార్షన్ అయింది. హైబీపీ (అధిక రక్తపోటు) కారణంగా అబార్షన్ జరిగినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ నెల 26న ఉట్నూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో నెలవారి వైద్య పరీక్షలో భాగంగా ఆశ కార్యకర్త ఆ గర్భిణీని తీసుకెళ్లారు.
నాలుగు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో కొన్ని సమస్యలు గుర్తించి గైనకాలజిస్ట్ మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌లోని పెద్దాస్పత్రి రిమ్స్‌కు రిఫర్ చేశారు. అయితే, ఆస్పత్రికి వెళ్లేందుకు రేణుకబాయి నిరాకరించింది. సూపర్‌వైజర్‌లు రాజమ్మ, చరణ్‌దాస్‌లు ఎంతో నచ్చచెప్పినా ఆమె చికిత్స చేయించేందుకు ఒప్పుకోలేదు. దీంతో వారంతా కలిసి శనివారం తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్‌కు సమాచారం అందించారు. ఆయన గ్రామానికి చేరుకుని గోండ్ భాషలో మహిళకు నచ్చజెప్పారు. ఆస్పత్రికి వెళ్లకుంటే వచ్చే అనార్థల గురించి అధికారులు, వైద్య సిబ్బంది రేణుకబాయి కుటుంబ సభ్యులకు వివరించారు. అయిన వినకుండా తాను దేవుడికి మొక్కుకున్నానని, మొత్తం దేవుడే కాపాడతాడని చెప్పేసింది.
గర్భిణీకి హైబీపీ ఉండడం వల్ల ఆ ప్రభావం తల్లితో పాటు పుట్టబోయే బిడ్డపై పడుతుందని తహసీల్దార్ కోరారు. అయినా సరే ఆస్పత్రికి వెళ్లేదే లేదంటూ అందరూ ఉండగానే రేణుకబాయి గ్రామంలోని తన ఇంటికి వెళ్లిపోయింది. చివరికి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలకు మాత్రమే మహళ అంగీకరించింది. డిప్యూటీ తహసీల్దార్ అమృత్‌లాల్, ఆర్‌ఐ శకుంతల, సీడాం మల్కు పటేల్, మేస్రం జంగు, తొడసం బండు తదితరులు ఉన్నారు.
Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న చరిత్ర అలాంటిది.. మాజీ ఉద్యోగుల సంచలన ఆరోపణలు
Also Read: YSR Death Anniversary: వైఎస్ కేబినేట్ మంత్రులకు విజయమ్మ ఆహ్వానం!... పిలుపుపై రాజకీయవర్గాల్లో చర్చ