YSR Death Anniversary: వైఎస్ కేబినేట్ మంత్రులకు విజయమ్మ ఆహ్వానం!... పిలుపుపై రాజకీయవర్గాల్లో చర్చ
ఈ ఏడాది వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి(సెప్టెంబర్ 2) రోజున నిర్వహించే కార్యక్రమానికి వైఎస్ కేబినేట్ మంత్రులను విజయమ్మ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ ఆహ్వానాలపై రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది.
సెప్టెంబర్ 2... ఏపీ రాజకీయాల్లో మరిచిపోలేని రోజు. ఈ రోజునే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఏడాది వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ కేబినేట్ లో పనిచేసిన మంత్రులు, రాజకీయ సహచరులను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తోపాటు వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులను విజయమ్మ ఫోన్‌చేసి ఆహ్వానిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
రాజకీయ వర్గాల్లో చర్చ
చిత్తూరు జిల్లాలో 2009 సెప్టెంబరు 2 రచ్చబండ కార్యక్రమంలో పాల్గోనేందుకు వెళ్తూ వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వైఎస్ వర్ధంతి రోజున జరిగే కార్యక్రమాలకు గతంలో వైఎస్‌తో కలిసి పనిచేసిన వారిని పిలవడం ఇదే తొలిసారి. వైఎస్ షర్మిల తెలంగాణలో నూతన పార్టీని ప్రారంభించారు. షర్మిల సొంత పార్టీని ప్రారంభించిన నేపథ్యంలో విజయమ్మ ఆహ్వానాలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలా ఆహ్వానించడం ఏంటని చర్చ జోరుగా సాగుతోంది.
Also Read: AP RTC : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇక నుంచి కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ..!
కాంగ్రెస్ పై విమర్శలు
వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ)ని ప్రారంభించారు. పార్టీ విషయంలో కూతురు షర్మిలకు వైఎస్ విజయమ్మ మద్దతుగా నిలిచారు. వైఎస్సార్టీపీ ఆవిర్భావ సభలో విజయమ్మ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిందని విజయమ్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. వైఎస్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
Also Read: Modi On Afghan: అఫ్గాన్ పై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ.. చాలా మందిని తీసుకొచ్చాం