Malla Reddy: నేను బోళా మనిషిని.. అప్పటి నుంచి రేవంత్ నన్ను సతాయిస్తున్నడు.. మంత్రి మల్లా రెడ్డి ఆవేదన
మల్లా రెడ్డి రేవంత్ రెడ్డిపై మండిపడుతూ విలేకరుల సమావేశం నిర్వహించారు. తనపై రేవంత్ చేసిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి - మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మళ్లీ తాజాగా మల్లా రెడ్డి రేవంత్ రెడ్డిపై మండిపడుతూ విలేకరుల సమావేశం నిర్వహించారు. తనపై రేవంత్ చేసిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు. పిచ్చి కాగితాలు చూపించి తాను అన్ని కబ్జా చేసినట్లుగా రేవంత్ నమ్మిస్తున్నాడని మండిపడ్డారు. 2014కు ముందు టీడీపీ మల్కాజ్‌గిరి సీటు రేవంత్‌కు కాకుండా తనకు ఇచ్చినప్పటి నుంచి రేవంత్ తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. అప్పుడే చంద్రబాబు దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినట్లు చెప్పారు.
‘‘మాకు రెండు మెడికల్ కాలేజీలున్నయ్. ఇండియాలో ఫస్ట్ లేడీస్ మెడికల్ కాలేజీ పెట్టింది కూడా నేనే. 2002లోనే ఫస్ట్ ఇంజినీరింగ్ కాలేజీ, 2012లో ఫస్ట్ మెడికల్ కాలేజీ, 2013లో రెండో మెడికల్ కాలేజీ పెట్టినా. బాలికల కోసం ప్రత్యేక కాలేజీలు పెట్టింది ఫస్ట్ నేనే. నా కాలేజీల్లో డ్రైవర్ బిడ్డ, రైతు బిడ్డలు ఎంతో మంది చదువుకొని గొప్ప స్థానాల్లో ఉన్నరు. నా కాలేజీల్లో అమ్మాయిలు 7 వేల మంది ఉన్నరు. నాలుగేళ్లు నా దగ్గర చదువుకొని గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకెళ్లేటప్పుడు బాధపడతరు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా నా కాలేజీలో చదువుకున్న వారు ఉంటారు. నా లాంటి పెద్ద మనిషిని పట్టుకొని బాగా ఇబ్బంది పెట్టి.. దొంగ కాగితాలు చూపించి నాటకాలు ఆడతవా?’’ అని మంత్రి మల్లా రెడ్డి నిలదీశారు.
‘‘పేద ప్రజల కోసం నేను ఆస్పత్రి పెడితే కబ్జా చేసిండు అంటున్నడు. బట్ట కాల్చి నా మీదేస్తున్నడు. అన్ని అనుమతులతోనే ఆస్పత్రిని నిర్మించినా. కాలేజీలు, ఆస్పత్రులకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నయ్. రేవంత్ ఎంపీ అయిన సంది నన్ను బాధ పెడుతున్నడు. బ్లాక్ మెయిల్ చేస్తున్నడు. ఆర్టీఐ కింద నా కాలేజీలన్ని మూపిస్తనని నాతో ఛాలెంజ్ చేసిండు. నన్ను చిత్ర హింసలు పెట్టిండు. నాకు ముందు నుంచి ఇదంతా తెల్వదు. నేను అమాయకుడ్ని.. బోళా మనిషిని.. మనకి ఇదంతా రాజకీయం తెలవదు. నాకున్న తెలివి ఎవ్వరికి లేదని పొంగిపోయిండు.. రేవంత్ రెడ్డి. దొంగ కాగితాలతోటి ఇప్పుడు కూడా నాటకాలు ఆడుతున్నడు.
‘‘రేవంత్ రెడ్డి కన్నా ముందు మల్కాజ్ గిరికి నేనే ఎంపీగా ఉన్నా. నా హాయాంలో రూ.100 కోట్ల విలువైన అండర్ పాస్‌లు తెచ్చినా. నువ్వు ఏం తెచ్చినవ్ రేవంత్ రెడ్డి? ఏవో కొన్ని కాగితాలు చూపిచ్చి మల్లారెడ్డి అవినీతికి పాల్పడిండు అంటున్నవ్. రేవంత్ కొత్తగా ఎంపీగా గెల్చినప్పుడు ఓ ఫంక్షన్‌లో కలిసినం. ఆయన కొత్తగా ఎంపీగా గెలిచిండు. నేను మంత్రి అయినా. ఇద్దరం కలిసి లంచ్ చేస్తున్నం. ఏ కమిటీలో ఉండాల అని నన్ను అడిగిండు. నువ్వు డిఫెన్స్ కమిటీలో ఉండు అని నేనే చెప్పినా. నువ్విప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అయినవు. ఎంపీ అయి రెండేళ్లయింది. నియోజకవర్గానికి ఏమన్నా చెయ్యాల కదా.. ఏం చేసినవు’’ అని మల్లా రెడ్డి ప్రశ్నించారు.