Sonu Sood: కుమారీ ఆంటీని కలిసిన నటుడు సోనూసూద్ - ఫుడ్ స్టాల్‌లో సందడి చేసిన రియల్ హీరో, ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ
Hyderabad News: ప్రముఖ నటుడు సోనూసూద్.. సోషల్ మీడియా ఫేం కుమారి ఆంటీని కలిశారు. మాదాపూర్‌లోని ఆమె ఫుడ్ స్టాల్‌ను సందర్శించి సందడి చేశారు. ఈ సందర్భంగా కుమారి ఆంటీని సత్కరించి ప్రశంసలు కురిపించారు.
SonuSood Visited Kumari Aunty Food Stall: కుమారి ఆంటీ (Kumari Aunty).. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో (Madhapur) రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా 'మీది మొత్తం థౌజెండ్ అయ్యింది. రెండు లివర్స్ ఎక్స్ ట్రా' అనే డైలాగ్‌తో ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫుడ్ స్టాల్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఈ క్రమంలో ఆమె హోటల్‌కు జనం పోటెత్తారు. ప్రముఖ నటులు, సెలబ్రిటీలు సైతం ఆమె హోటల్‌కు క్యూ కడుతున్నారు.
సడన్ సర్‌ప్రైజ్
తాజాగా, రియల్ హీరో సోనూసూద్ (Sonusood) సైతం కుమారి ఆంటీని కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్న ఆమె ఫుడ్ స్టాల్‌ను అకస్మాత్తుగా సందర్శించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. రియల్ హీరోను చూసిన కుమారి ఆంటీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోనూసూద్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో సోనూసూద్ సైతం వారితో కలిసి సందడి చేశారు. కుమారి ఆంటీని శాలువాతో సత్కరించి బొకే ఇచ్చారు. ఆమెతో సరదాగా మాట్లాడుతూ.. పంచ్‌లు వేస్తూ అందరినీ నవ్వించారు. ఫుడ్ సైతం సర్వ్ చేశారు.
కుమారి ఆంటీపై ప్రశంసలు
ఈ సందర్భంగా కుమారి ఆంటీపై సోనూసూద్ ప్రశంసలు కురిపించారు. మహిళా సాధికారతకు ఆమె బెస్ట్ ఉదాహరణ అని కొనియాడారు. భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని ఆమెకు భరోసా ఇచ్చారు. రియల్ హీరో కుమారి ఆంటీని కలిసిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
YOU ARE YOUR ONLY LIMIT..
— sonu sood (@SonuSood) July 5, 2024
Kumari aunty is a testament to the quiet strength and fierce resilience that resides in each woman..let us support, celebrate, uplift and empower these bearers of boundless strength by our words and actions ..#WomenEmpowerment pic.twitter.com/ETUR8jduGu
ఫేమస్.. ఇబ్బందులు సైతం
తక్కువ టైంలోనే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ అదే సమయంలో పలు ఇబ్బందులను సైతం ఎదుర్కొన్నారు. రోడ్ సైడ్ చిన్న ఫుడ్ స్టాల్ నిర్వహిస్తోన్న ఆమె దగ్గరకు ఫుడ్ కోసం జనం భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని పోలీసులు ఆమె హోటల్‌ను క్లోజ్ చేయాలని ఆదేశించారు. దీనిపై సరత్రా విమర్శలు వ్యక్తం కాగా.. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సైతం ఈ విషయం చేరింది. స్పందించిన ఆయన.. ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అండతో ఆమె మళ్లీ ఫుడ్ బిజినెస్ కొనసాగించారు. అనంతరం ఆమె ఫుడ్ స్టాల్‌కు పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం క్యూ కట్టారు. అక్కడ ఫుడ్ టేస్ట్ చేశారు. సోషల్ మీడియా క్రేజ్‌తో కుమారి ఆంటీ జీతెలుగులో ప్రసారమయ్యే ఓ సీరియల్‌లో గెస్ట్‌గా సైతం కనిపించారు.