Telangana grain 54 tenders: యాసంగి ధాన్యం కొనుగోలుకు 54 టెండర్లు-రేపు అర్హుల ఎంపిక
ధాన్యం టెండర్ల ప్రక్రియలో మరో కీలక అడుగు ముందుకు పడింది. ధాన్యం కొనుగోలుకు 54 టెండర్లు వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. రేపు ఫైనాన్షియల్ బిడ్లు తెరిచి.. అర్హులను ఎంపిక చేయబోతున్నారు.
తెలంగాణ యాసింగ్ ధాన్యం కొనుగోలులు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి విశేష స్పందన లభించింది. మొదటి విడతలో 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించాలని పౌరసరఫరాల సంస్థ భావించింది. గత నెలలో టెండర్లను ఆహ్వనించింది. ఈ 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి గ్లోబల్ టెండర్లు పిలవగా... 54 సంస్థల నుంచి టెక్నికల్ బిడ్లు దాఖలయ్యాయని అధికారులు ప్రకటించారు.
మొత్తం 66.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోళ్లకు టెండర్లు పిలవాల్సి ఉంది. ఇందులో మొదటి విడతగా 25 లక్షల మెట్రిక్ టన్నుల విక్రయానికి టెండర్లు పిలిచారు. ఈ 25 లక్షల మెట్రిక్ టన్నులను.. 25 లాట్లుగా విభజించి ఆన్‌లైన్‌లో బిడ్స్ ఆహ్వానించారు. ఒక్కో లాటు విలువ తక్కువలో తక్కువగా 200 కోట్ల రూపాయలు ఉంటుంది. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సంబంధించిన టెండర్ల గడువు.. నిన్న మధ్యాహ్నం అంటే గురువారం మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది. దీంతో నిన్న సాయంత్రం 5గంటల తర్వాత అధికారులు టెక్నికల్ బిడ్లు తెరిచి.. 54 సంస్థలు టెండర్ బిడ్లు దాఖలు చేశాయని ప్రకటించారు. ఇందులో 8 లాట్లకు సంబంధించి కేవలం ఒక్కో బిడ్ మాత్రమే దాఖలైనట్లు సమాచారం. మిగతా 17 లాట్ల కోసం 46 సంస్థలు పోటీ పడ్డాయి.
గత ఏడాది అంటే 2022–23కు సంబంధించి.. తెలంగాణ రాష్ట్ర వ్యప్తంగా... 66.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మొత్తం 66.85 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేసి ఉంచారు. ఆ ధాన్యంలో కొంత భాగం అకాల వర్షాల కారణంగా తడిచిపోయింది. తడిచిన ధాన్యంతో పాటు మిగతా ధాన్యాన్ని కూడా ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు నిరాకరించారు. బాయిల్డ్ రైస్‌గా మాత్రమే ఇస్తామని చెప్పినా... కేంద్రం నిబంధనలతో అది సాధ్యం కాలేదు. దీంతో మిల్లుల్లో నిల్వ చేసిన ధాన్యాన్ని ఒకేసారి విక్రయించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా... తొలి విడత 25 ఎల్‌ఎంటీలు విక్రయించేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ధాన్యం విక్రయించేందుకు ప్రక్రియ మొదలుపెట్టారు.
గత నెలలో ధాన్యం కొనుగోళ్లకు టెండర్లు పిలిచారు. ఆ టెండర్ల గడువు నిన్నటితో అంటే గురువారంతో మధ్యాహ్నంతో ముగిసింది. గడువు ముగిసే సమయానికి 54 టెక్నికల్ బిడ్లను వచ్చినట్టు అధికారులు ధృవీకరించారు. బిడ్లు దాఖలు చేసిన సంస్థ వివరాలు పరిశీలించి, అర్హత పొందిన వాటిని ఫైనాన్షియల్ బిడ్లకు ఎంపిక చేస్తారు. ఈనెల 16న అంటే... రేపు ఫైనాన్షియల్ బిడ్లను తెరుస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత అర్హులైన సంస్థలను ఎంపిక చేస్తారు.
25 లక్షల మెట్రిక్ టన్నులను.. 25 లాట్లుగా విభజించి.. ఒక్కో లాటు విలువ తక్కువలో తక్కువగా 200 కోట్ల రూపాయలుగా నిర్ణయించడంపై రైస్‌మిల్లర్ల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. 200 కోట్లంటే... చాలా ఎక్కువని.. అందుకే ఎక్కువ మంది పోటీపడలేదని సమాచారం. 200 కోట్లు కాకుండా 100 కోట్ల టర్నోవర్ పెడితే డిమాండ్ ఉండేదని కొందరు రైస్‌మిల్లర్లు చెబుతున్నారు. టెండర్ల కమిటీ సభ్యులు రేపు ఫైనాన్షియల్ బిడ్లను తెరవనున్నారు. అయితే... తక్కువ ధరకు టెండర్లు దాఖలైతే ధాన్యం అప్పగించటానికి పౌరసరఫరాల సంస్థ సుముఖంగా లేదని సమాచారం.