Vodafone Idea: ఇక ఆ ఆఫర్ లేనట్లే.. తెలుగు రాష్ట్రాలకు మాత్రమే తీసేసిన టెలికాం!
వొడాఫోన్ ఐడియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తన డబుల్ డేటా ఆఫర్ ను తీసేసింది.
దేశంలో మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వొడాఫోన్ ఐడియా తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు భారీ షాకిచ్చింది. మూడు ప్లాన్లతో అందించే డబుల్ డేటా ప్రయోజనాన్ని నిలిపివేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ.. వెబ్ సైట్లో మార్పులను చూడవచ్చు. ఏపీ, తెలంగాణ సర్కిల్ కు తప్ప దేశంలోని అన్ని ఇతర టెలికాం సర్కిళ్లలో ఈ డబుల్ డేటా ఆఫర్ అందుబాటులోనే ఉంది.
రూ.299, రూ.449, రూ.699 ప్లాన్ల ద్వారా వొడాఫోన్ ఐడియా గతంలో డబుల్ డేటా ఆఫర్ ను అందించేది. ఈ ప్లాన్ల ద్వారా ఇప్పుడు 4 జీబీ డేటాకు బదులు 2 జీబీ డేటానే లభించనుంది.
ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా విషయాల్లో వొడాఫోన్ ఈ ప్లాన్లకు మార్పులు చేయలేదు. రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లాభాలు ఇంతకుముందు లాగానే లభిస్తాయి. వీటిలో ఓటీటీ లాభాలను కూడా వొడాఫోన్ అందిస్తూ ఉండటం విశేషం. జీ5 ప్రీమియంతో పాటు వీఐ సినిమాస్ అండ్ టీవీ యాప్ సబ్ స్క్రిప్షన్ కూడా లభించనుంది.
దీంతోపాటు వీకెండ్ డేటా రోల్ఓవర్, బింజ్ ఆల్ నైట్ ఆఫర్లు కూడా అలానే ఉన్నాయి. వారం మొత్తంలో మీరు ఉపయోగించకుండా ఉన్న డేటాను వారాంతంలో ఉపయోగించుకోవచ్చు. అదే వీకెండ్ డేటా రోల్ఓవర్ ఆఫర్. ఇక ప్రతిరోజూ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ లిమిటెడ్ డేటాను కూడా ఈ ప్లాన్లతో అందిస్తారు. అదే బింజ్ ఆల్ నైట్. ఈ రెండు ఆఫర్లలో కూడా వీఐ ఎలాంటి మార్పులూ చేయలేదు.
అయితే వీఐ ఇతర సర్కిల్‌ల నుంచి కూడా డబుల్ డేటా ప్రయోజనాన్ని త్వరలో తొలగిస్తుందా లేదా అన్నది తెలియరాలేదు. ఒకవేళ ఈ ప్లాన్‌లకు అలవాటు పడిన వినియోగదారులు ఎవరైనా ఉంటే వారు కంపెనీ నుంచి మరిన్ని 4జీ డేటా వోచర్‌లను కొనుగోలు చేసి ఉపయోగించాల్సి వస్తుంది.
వొడాఫోన్ రూ.299 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ తో రోజుకు 2 జీబీ డేటా లభించనుంది. గతంలో రోజుకు మరో 2 జీబీ అదనంగా అందించేవారు. అయితే ఇప్పుడు అదనపు డేటాను అందించడం లేదు. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా అందించారు.
వొడాఫోన్ రూ.449, రూ.699 ప్లాన్ల లాభాలు
వొడాఫోన్ రూ.449 ప్లాన్ లాభాలు కూడా పైప్లాన్ తరహాలోనే ఉండనున్నాయి. ప్లాన్ వ్యాలిడిటీ మాత్రం 56 రోజులు. ఇక రూ.699 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉండనుంది. కాలింగ్, ఎస్ఎంఎస్ లాభాలు పై రెండు ప్లాన్ల తరహాలోనే ఈ ప్లాన్ లో కూడా ఉన్నాయి.
Also Read: Whatsapp: లుక్ అందంగా.. ప్రైవసీ పటిష్టంగా.. వాట్సాప్ తీసుకురానున్న కొత్త ఫీచర్లు ఇవే!
Also Read: రూ.15 వేలలోపే భారతీయ బ్రాండ్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు!
Also Read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 11 వంటి ఫీచర్లు!