AI Software Engineer: డెవిన్, ఓ మంచి పనోడు - ప్రపంచంలోనే మొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - మనుషుల కంటే యమ ఫాస్టు!
Devin: అమెరికాకు చెందిన ఏఐ ల్యాబ్ కాగ్నిషన్ ప్రపంచంలోనే మొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను రూపొందించింది.
World First AI Software Engineer: అమెరికా కేంద్రంగా పని చేసే ఏఐ ల్యాబ్ కాగ్నిషన్ ప్రపంచంలోనే మొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఈ ఏఐ ఏజెంట్‌కు డెవిన్ (Devin) అనే పేరు కూడా పెట్టారు. అనేక లీడింగ్ ఏఐ కంపెనీలు నిర్వహించే ప్రాక్టికల్ ఇంజినీర్ ఇంటర్వ్యూలను కూడా డెవిన్ క్లియర్ చేయడం విశేషం. దీంతోపాటు అప్‌వర్క్ అనే ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫాంలో జాబ్స్ కూడా ఈ ఏఐ ఇంజినీర్ చేసినట్లు కాగ్నిషన్ తెలిపింది.
‘డెవిన్ ఎప్పటికీ అలసిపోని, స్కిల్డ్ టీమ్ మేట్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు చేసే పనులు కూడా డెవిన్ చేయగలదు. డెవిన్ కారణంగా ఇంజినీర్లు మరిన్ని ఆసక్తికరమైన సమస్యలపై ఫోకస్ చేయవచ్చు. అలాగే ఇంజినీరింగ్ టీమ్స్ తమకు కొత్త లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి కోసం పని చేయవచ్చు.’ అని కంపెనీ తన అఫీషియల్ బ్లాగులో పేర్కొంది.
డెవిన్ సామర్థ్యం ఏంటి?
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కోడింగ్, డీబగ్గింగ్, ప్రాబ్లం సాల్వింగ్ వంటి అధునాతన అత్యాధునిక సామర్థ్యాలు డెవిన్ సొంతం. మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా డెవిన్ ఎప్పటికప్పుడు స్థిరంగా నేర్చుకుంటూ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరుచుకుంటాడు. కొత్త సవాళ్లకు సిద్ధం అవుతూ ఉంటాడు. సులభంగా చెప్పాలంటే డెవిన్ యాప్స్‌ను రూపొందించడంతో పాటు డిప్లాయ్ చేయగలడు. ఇతర ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇచ్చి మెరుగుపరచగలడు. రోబో సినిమాలో ఒక రోబో మిగతా రోబోలకు ట్రైనింగ్ ఇచ్చినట్లు అన్నమాట.
వేలకు పైగా రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన కష్టమైన ఇంజినీరింగ్ టాస్క్‌లను కూడా డెవిన్ సులభంగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలడు. లాంగ్‌టర్మ్ రీజనింగ్, ప్లానింగ్‌లో డెవిన్‌కు ఇచ్చిన ట్రైనింగే దీనికి కారణం. దీంతోపాటు డెవిన్ యూజర్‌తో కూడా కొలాబరేట్ అవ్వగలడు. రియల్ టైమ్‌లో ప్రోగ్రెస్ కొలాబరేట్ చేసి ఫీడ్‌బ్యాక్ యాక్సెప్ట్ చేయడంతో పాటు యూజర్ కోరిన డిజైన్ ఛాయిసెస్‌లో కూడా పని చేయగలదు.
రియల్ వరల్డ్ సాఫ్ట్‌వేర్ ఇష్యూస్‌పై పని చేసే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సామర్థ్యాన్ని పరీక్షించే ఎస్‌డబ్ల్యూఈ-బెంచ్‌లో డెవిన్ ఇప్పటివరకు ఎవరి సాయం లేకుండా 13.86 శాతం సమస్యలను పరిష్కరించాడు. ఇంతకు ముందు ఇందులో హయ్యస్ట్ పర్సంటే 1.96 కావడం డెవిన్ సామర్థ్యాన్ని తెలుపుతుంది.
పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రాసెస్‌ను డెవిన్ చాలా వేగంగా, కచ్చితత్వంతో పూర్తి చేస్తుంది. ఇందులో కోడ్ జనరేట్ చేయడం, ప్రాజెక్ట్ టైమ్‌లైన్స్‌ను వేగవంతం చేయడం, డెవలప్‌మెంట్ ఖర్చులను తగ్గించడంలో డెవిన్ ముందుంది.
మానవ తప్పిదాలు, పనిలో హెచ్చుతగ్గులు లేకుండా చేయడం డెవిన్‌కు పెద్ద విజయం. ఈ ఏఐ చాలా వేగంగా కోడింగ్‌ను రాయడంతో పాటు ఎర్రర్స్ లేకుండా రాయడం విశేషం. దీంతో మంచి క్వాలిటీ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ రెడీ అవుతాయి. అయితే కంపెనీ దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ఓపెన్ఏఐ కోడెక్స్, గిట్‌హబ్ కోపైలట్, పాలీరైడర్, కోడ్‌టీ5, ట్యాబ్‌నైన్ వంటి ఇతర ఏఐ టూల్స్‌ను కూడా కోడ్ జనరేట్ చేయడంలో ఉపయోగిస్తున్నారు.
అయితే దీనికి సవాళ్లు కూడా అదే స్థాయిలో ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా కష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి మానవ దృక్పథం, క్రియేటివిటీ అవసరం అవుతాయని, ఏఐకి అవి కొరవడతాయని అంటున్నారు. అంతే కాకుండా డెవిన్ వంటి ఏఐ టూల్స్ ద్వారా కొన్ని వేల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డెవిన్ సాయపడుతుందని సృష్టికర్తలు అంటున్నారు. డెవిన్‌ను త్వరలోనే కంపెనీలకు ఉద్యోగాలకు పంపిస్తామని రూపకర్తలు అంటున్నారు. ఆసక్తి గల కంపెనీలు వెయిట్‌లిస్ట్‌లో ఉండాలని కోరుతున్నారు.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?