Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోసం ఎంత చెల్లించాలి?
నిర్ణీత రుసుము చెల్లించని ట్విట్టర్ వినియోగదారులు తమ బ్లూ వెరిఫికేషన్ టిక్ కోల్పోతారని ఎలన్ మస్క్ గతంలో వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా బ్లూ టిక్ తొలగింపు షురూ అయ్యింది.
ట్విట్టర్ బ్లూ ప్లాన్ కోసం నిర్ణీత రుసుము చెల్లించని వినియోగదారుల అకౌంట్స్ కు సంబంధించి బ్లూ టిక్‌ల తొలింపు ప్రక్రియ మొదలయ్యింది. ట్విట్టర్ ముందుగా ప్రకటించనట్లుగానే సబ్ స్ర్కిప్షన్ తీసుకోని ఖాతాదారుల బ్లూ టిక్ రిమూవ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అకౌంట్లు బ్లూ టిక్ ను కోల్పోయాయి. వీరిలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులున్నారు. ఏప్రిల్ 12న ట్విట్టర్ CEO ఎలోన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 20 నుంచి బ్లూ టిక్ కు సంబంధించి రుసుము చెల్లించని వినియోగదారులందరూ తమ వెరిఫైడ్ బ్లూ బ్యాడ్జ్ లను కోల్పోతారని ట్వీట్ చేశారు. ఆయన చెప్పినట్లుగానే తాజాగా బ్లూటిక్ తొలగింపు మొదలయ్యింది.
బ్లూ టిక్ కోసం ఎంత డబ్బు చెల్లించాలంటే?
ట్విట్టర్ వెరిఫికేషన్ బ్లూ టిక్ కోసం పలు రకాల సబ్ స్ర్కిప్షన్ ఫ్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది. వెబ్ బ్రౌజర్ ద్వారా సైన్ అప్ చేసే వినియోగదారులు ట్విట్టర్ బ్లూ టిక్ కోసం ప్రపంచ వ్యాప్తంగా నెలకు 7 అమెరికన్ డాలర్లు చెల్లించాలి. iOS లేదా ఆండ్రాయిడ్ లో ట్విట్టర్ ని ఉపయోగించినట్లైతే నెలకు 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. భారత్ లో అయితే, Ios, Android వినియోగదారులు ట్విట్టర్ బ్లూ టిక్ కోసం నెలకు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వెబ్ క్లయింట్స్ అయితే రూ. 650 ఇవ్వాల్సి ఉంటుంది. అటు ఏడాదికి గాను బ్లూటిక్ కోసం రూ. 6,500 ప్లాన్ ను అందుబాటులో ఉంచింది.
బ్లూ టిక్ కోల్పోయిన పలువురు ప్రముఖులు
ఇక భారత్ లో చాలా మంది ప్రముఖులు తమ అకౌంట్స్ కు బ్లూ టిక్ ను కోల్పోయారు. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ కూడా తమ బ్లూ వెరిఫైడ్ టిక్‌లను కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఈ జాబితాలో ఉన్నారు. క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సైతం ట్విట్టర్ బ్లూటిక్ తొలిగింపు లిస్టులో చేరారు.
బ్లూ టిక్ కోల్పోయిన తెలుగు స్టార్స్ వీళ్లే!
బ్లూటిక్ కోల్పోయిన తెలుగు సినీ నటీనటులలో సీనియర్ నటుల నుంచి కొత్త తారల వరకు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్,వెంకటేష్, అక్కినేని నాగచైతన్య, అఖిల్ అక్కినేని, నితిన్, ప్రకాష్ రాజ్, మంచు మనోజ్ అకౌంట్స్ కు బ్లూ టిక్ తొలగించింది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే పూజా హెగ్డే, కీర్తి సురేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి సహా పలువురు అకౌంట్లు బ్లూ టిక్ కోల్పోయాయి. అయితే, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, మంచు విష్ణు బ్లూ టిక్‌లు అలాగే ఉన్నాయి. అయితే వీరంతా ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని ఉంటారని తెలుస్తోంది.
ఇకపై బ్లూ టిక్ పొందడం చాలా ఈజీ
వాస్తవానికి గతంలో ట్విట్టర్ ఉచితంగా ఈ బ్లూటిక్ లను అందించింది. అయితే, మస్క్ గత సంవత్సరం $44-బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను స్వాధీనం చేసుకున్న నాటి నుంచి డబ్బు సంపాదనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. Twitter బ్లూ సర్వీస్ లో భాగంగా, సబ్‌స్క్రయిబ్ చేసుకునే వినియోగదారులు ఇంతకు ముందుగా కఠినమైన ధృవీకరణ ప్రక్రియ ద్వారా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈజీగా బ్లూ టిక్‌ను పొందుతారు. ట్విట్టర్ నిర్ణయించిన రుసుము చెల్లిస్తే బ్లూ టిక్ పొందే అవకాశం ఉంది.
Read Also: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన మన టాలీవుడ్ స్టార్స్ వీరే - ఆ స్టార్ట్స్‌కు మాత్రమే మినహాయింపు!