ఓ మై గాడ్, భూమి లోపలా.. అతిపెద్ద మహాసముద్రం - భూమిపై ఉన్న నీటి కంటే మూడు రెట్లు ఎక్కువ
ఈ భూగోళంపై 75 శాతం నీరే ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే, భూమి లోపల అంతకంటే మూడు రెట్లు నీరు ఉందంట! కాదు, కాదు.. ఏకంగా అతిపెద్ద మహా సముద్రమే ఉందట. ఔనండి, పరిశోధకులే చెప్పారు.
అసలు మన భూమి మీదకు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇది ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలను వెంటాడుతున్న ప్రశ్న. చాలా మంది ఏకాభిప్రాయానికి వచ్చింది ఏంటంటే ఓ భారీ ఉల్క భూమిని ఢీకొట్టిన కారణంగా భూమి మీద నీరు పుట్టిందని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. భూమి పైన ఉండే నీరు ఆవిరి రూపంలో మేఘాలుగా ఏర్పడటం తిరిగి అది చల్లబడి వర్షం రూపంలో కురవటం.. కొంతశాతం నీరు భూమిలోకి ఇంకి భూగర్భజలాలుగా ఉపయోగపడటం జరుగుతుందని భావించి ఓ వాటర్ సైకిల్ ను రూపొందించారు. అయితే ఇప్పుడు ఈ భావనలకు విఘాతం కలిగించేలా ఓ ఆశ్చర్యకరమైన విషయం శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగు చూసింది. అదే భూమిలోపల మహాసముద్రం.
అదేంటీ? భూమిపైన మహాసముద్రాలు ఉన్నట్లే భూమి లోపల కూడా ఉంటాయా? అంటే ఇప్పుడు ఈ విషయాన్నే శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు భూమి నుంచి 700 కిలోమీటర్ల లోతులో ఈ మహాసముద్రం ఉన్నట్లు గుర్తించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మహాసముద్రంలో ఉన్న నీరు.. భూమి పైన ఉన్న మొత్తం మహా సముద్రాలు, నదులు, చెరువుల్లో ఉన్న నీరంతా కలిపితే వచ్చే నీటికి మూడురెట్లు ఉంది. అంటే అంతపెద్ద మహాసముద్రం అన్నమాట. కాకపోతే ఈ సముద్రం స్పాంజ్ రూపంలో మినరల్స్ గా గడ్డకట్టి ఉంది. స్పాంజ్ ఎలాగైతే కిందపడిన నీళ్లను పీల్చుకుని ఉంటుందో అలా ఈ సముద్రంలోని బ్లూ కలర్ మినరల్స్ చాలా ఎక్కువ నీటిని.. చాలా తక్కువ స్పేస్ లో పట్టి ఉంచాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
భూమికి ఉండే మాంటెల్‌కు చుట్టూ ఈ మహాసముద్రం ఉన్నట్లుగా పరిశోధకులు కనిపెట్టారు. గడచిన 500 ఏళ్లుగా వస్తున్న భూకంపాలను 2 వేల సెసిమోగ్రాఫ్స్ ద్వారా అధ్యయనం చేసిన తర్వాత ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఈ సముద్రం అంతా దానిలో నీటిని ఓ రిజర్వాయర్ లా పట్టేసి ఉంచినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంపై మరింత డేటాను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్న పరిశోధకులు.. ఇది కనుక వాస్తవమని పూర్తిగా తేల్చగలిగితే భూమిపై ఇప్పుడున్న నీరు ఒకప్పుడు భూమి పొరలలోపల నుంచే వచ్చినట్లు నిర్ధారణ అవుతుంది. అంతే కాదు.. భూకంపాలు రావటానికి కారణమవుతున్న విషయాలపైనా స్పష్టత వస్తుంది. పైగా ఆ నీరు భవిష్యత్తు భూమి అవసరాలకు పనికి వస్తుందా? భూమి ఏర్పడేప్పుడు పరిస్థితులు ఏమిటీ.. ఇలా అనేకరకాల సందేహాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఉపయోగపడే అవకాశం ఉంది.
Also Read: భూమిని చీల్చుకుని పుడుతోన్న మరో మహా సముద్రం - ఆ దేశంలో భారీ పగుళ్లు, మరో ఖండం ఏర్పడనుందా?