Samsung New Phone: శాంసంగ్ కొత్త ఫోన్ వచ్చేసింది.. ఆ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎం22ని లాంచ్ చేసింది.
శాంసంగ్ గెలాక్సీ ఎం22 స్మార్ట్ ఫోన్ అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్ సైట్లో కూడా లిస్ట్ అయింది. ఈ లిస్టింగ్ లో ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు చూడవచ్చు. ఇందులో వాటర్ డ్రాప్ తరహా నాచ్ ఉండనుంది. ఫోన్ వెనకవైపు చదరపు ఆకారంలో నాలుగు కెమెరాలు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం22 ధర
ఈ ఫోన్ ప్రస్తుతానికి జర్మనీలో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బ్లాక్, లైట్ బ్లూ, వైట్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎం22 ఇంకా మనదేశంలో లాంచ్ కాలేదు. అయితే ఎం-సిరీస్ ఫోన్లకు మనదేశంలో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఈ ఫోన్ మనదేశంలో కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఫీచర్లను బట్టి చూస్తే దీని ధర బడ్జెట్ రేంజ్ లోనే ఉండనుందని అంచనా వేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం22 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.4 అంగుళాల హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఇది 1.6 కోట్ల రంగులను డిస్ ప్లే చేయగలదు. ఆక్టాకోర్ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. స్టోరేజ్ ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ పెడితే 25 గంటల వరకు ఇంటర్నెట్ యూసేజ్, 30 గంటల వీడియో ప్లేబ్యాక్, 106 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 38 గంటల 4జీ ఎల్టీఈ టాక్ టైంను ఈ ఫోన్ అందించనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఆటోఫోకస్, 10ఎక్స్ డిజిటల్ జూమ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు. ఎన్ఎఫ్ సీ, బ్లూటూత్ వీ5, వైఫై, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఇందులో ఉండనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లుగానూ, బరువు 186 గ్రాములుగానూ ఉంది.
Also Read: Realme New Phone: రూ.10 వేలలోపే రానున్న రియల్ మీ కొత్త ఫోన్.. అదిరిపోయే కెమెరా!
Also Read: JioBook Laptop: జియో చవకైన ల్యాప్ టాప్ వచ్చేస్తుంది.. ఫీచర్లు కూడా లీక్!