Tecno Pova 3: రెండ్రోజుల్లో లాంచ్ కానున్న టెక్నో పోవా 3 - ధర, ఫీచర్లు లీక్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ టెక్నో పోవా 3ని జూన్ 20వ తేదీన మనదేశంలో లాంచ్ చేయనుంది.
టెక్నో పోవా 3 స్మార్ట్ ఫోన్ మనదేశంలో జూన్ 20వ తేదీన లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన మైక్రోసైట్ కూడా అమెజాన్‌లో ఓపెన్ అయింది. ఈ ఫోన్ ఫీచర్లను ఈ మైక్రోసైట్‌లో చూడవచ్చు. ఇందులో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌ను అందించనున్నారు. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే కూడా ఉంది.
టెక్నో పోవా 3 ధర (అంచనా)
టెక్నో పోవా 3 ఇప్పటికే ఫిలిప్పీన్స్‌లో లాంచ్ అయింది. అక్కడ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 బాత్‌లుగా (సుమారు రూ.13,300) ఉంది. హైఎండ్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,399 బాత్‌లుగా (సుమారు రూ.13,900) నిర్ణయించారు. ఎకో బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, టెక్ సిల్వర్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. మనదేశంలో రూ.12 వేల నుంచి రూ.15 వేల రేంజ్‌లో టెక్నో పోవా 3 లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
టెక్నో పోవా 3 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో పోవా 3 పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. టెక్నో పోవా 3 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరో 5 జీబీ వరకు పెంచుకోవచ్చు. అంటే 11 జీబీ వరకు ర్యామ్ లభించనుందన్న మాట.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు సెకండరీ, టెర్టియరీ సెన్సార్లు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
4జీ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 7000 ఎంఏహెచ్ కాగా... 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.94 సెంటీమీటర్లుగా ఉండనుంది.