Sony Xperia 5 IV: యాపిల్ రేంజ్ కెమెరాలతో సోనీ కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సోనీ తన కొత్త స్మార్ట్ ఫోన్ ఎక్స్‌పీరియా 5 ఐవీని మార్కెట్లో లాంచ్ చేసింది.
సోనీ ఎక్స్‌పీరియా 5 ఐవీ స్మార్ట్ ఫోన్ ఎంపిక చేసిన దేశాల్లో లాంచ్ అయింది. ఈ కొత్త సోనీ స్మార్ట్ ఫోన్ సేల్ ఈ నె మధ్యలో నుంచి ప్రారంభం కానున్నట్లు కంపెనీ తెలిపింది. యూకే, యూరోప్‌ల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఇందులో 6,1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
సోనీ ఎక్స్‌పీరియా 5 ఐవీ ధర
ఈ ఫోన్ ధర యూరోప్‌లో 1,049 యూరోలుగా (సుమారు రూ.83,700) ఉంది. యూకేలో దీని ధరను 949 పౌండ్లుగా (సుమారు రూ.87,600) నిర్ణయించారు. ఇక అమెరికాలో దీని ధర 999.99 డాలర్లుగా (సుమారు రూ.79,600) ఉంది. బ్లాక్, వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
సోనీ ఎక్స్‌పీరియా 5 ఐవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ ఫుల్ హెచ్‌డీ+గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 21:9 కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు మరో రెండు 12 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
బ్లూటూత్ వీ5.2, ఏ-జీపీఎస్, 5జీ, 4జీ ఎల్టీఈ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా దీన్ని చార్జింగ్ పెట్టవచ్చు. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, అడాప్టివ్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ పెట్టవచ్చు. దీని మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 172 గ్రాములుగా ఉంది.
ఇటీవలే సోనీ 100 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ తెలుపుతున్న దాని ప్రకారం మిడ్ రేంజ్, బడ్జెట్ ఫోన్లలో ఈ సెన్సార్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. యాపిల్, గూగుల్ కంపెనీలకు సోనీనే సెన్సార్లు అందిస్తుంది. అయితే ఈ 100 మెగాపిక్సెల్ సెన్సార్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు.
ప్రస్తుతం శాంసంగ్ 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను రూపొందించే పనిలో ఉంది. దీనికి ఐసోసెల్ హెచ్‌పీ3 అని పేరు పెట్టనున్నారు. 2023లో లాంచ్ కానున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్ ఫోన్‌లో ఈ సెన్సార్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలుపుతున్న దాని ప్రకారం సోనీ ఐఎంఎక్స్8 సిరీస్‌లో ఈ 100 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉండనుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లకు అందుబాటులో ఉన్న పెద్ద సెన్సార్లలో శాంసంగ్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉండనుందని తెలుస్తోంది. శాంసంగ్ ఇప్పటికే 108 మెగాపిక్సెల్ సెన్సార్లను లాంచ్ చేసింది.
సోనీ ఐఎంఎక్స్8 సెన్సార్‌తో పాటు ఐఎంఎక్స్9 సెన్సార్లపై కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. లీకుల ప్రకారం దాదాపు ఒక అంగుళం సైజు ఉన్న 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కూడా సోనీ రూపొందిస్తుందని తెలుస్తోంది. దీనికి ఐఎంఎక్స్989 అని పేరు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!