iPhone 5G: ఐఫోన్లకు 5జీ ఈ నెలలోనే - కానీ వారికి మాత్రమే!
ఐఫోన్లకు 5జీ యాక్సెస్ ఇచ్చే బీటా అప్‌డేట్ త్వరలో రానుంది.
మనదేశంలో 5జీ సర్వీసులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 1వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలు తమ 5జీ సేవలను కొన్ని నగరాల్లో ప్రారంభించాయి. 5జీ స్పీడ్ పొందాలంటే వినియోగదారులు ముందుగా 5జీ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసి ఉండాలి. అయితే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేని కారణంగా కొన్ని 5జీ ఫోన్లకు కూడా 5జీని అందుకునే అవకాశం ఇంకా రాలేదు. అయితే యాపిల్ మాత్రం తమ స్మార్ట్ ఫోన్లకు ఎప్పుడు 5జీ అప్‌డేట్ వస్తుందో తెలిపింది.
ఐవోఎస్ 16 బీటా యూజర్లకు నవంబర్ 7వ తేదీ నుంచి 5జీ సర్వీసులు అందించనున్నారు. ప్రస్తుతానికి ఎయిర్‌టెల్, జియో వినియోగదారులకు మాత్రమే ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
ఐవోఎస్ 16 5జీ బీటాను అందుకునే ఫోన్లు ఇవే!
1. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్
2. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్
3. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్
4. ఐఫోన్ ఎస్ఈ (2022)
అయితే మీ దగ్గర ఈ ఫోన్లు ఉన్నప్పటికీ ఐవోఎస్ 16 బీటా అప్‌డేట్ కూడా ఉండాల్సిందే.
ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌కు చాలా తక్కువ డిమాండ్ ఉందని వార్తలు వస్తున్నాయి. దీని తయారీని తగ్గించాల్సిందిగా యాపిల్ తన ఉత్పత్తిదారులను కోరినట్లు సమాచారం. ఐఫోన్ 14 ప్లస్‌లో 128 జీబీ వేరియంట్ ధరను మనదేశంలో రూ.89,900గా నిర్ణయించారు. 256 జీబీ వేరియంట్ ధర రూ.99,900 కాగా, 512 జీబీ వేరియంట్ ధర రూ.1,19,900గా ఉంది. బ్లూ, పర్పుల్, స్టార్ లైట్, మిడ్‌నైట్, ప్రొడక్ట్ రెడ్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14 ప్లస్‌లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?