Life On Mars: మార్స్‌పై జీవం ఉందా? అవి ఏలియెన్స్ సంకేతాలా? నాసా రోవర్ కనుగొన్న సంచలన విషయాలు
Aliens On Mars | జేజేరో బిలం నుండి తీసిన మట్టి నమూనాలో అసాధారణ ఖనిజాలు, ఆకృతులను నాసా గుర్తించింది. ఇవి భూమిపై సూక్ష్మజీవుల కార్యకలాపాలకు సంబంధించినవి కావడంతో ఆసక్తి నెలకొంది.

NASA Says Mars Rover Discovered Potential Biosignature | భూమి మీద కాకుండా మరో గ్రహంపై ఎక్కడైనా జీవం ఉండే అవకాశం ఉందా? ఈ ప్రశ్న శతాబ్దాలుగా శాస్త్రవేత్తలను వెంటాడుతోంది. విశ్వంలో మరో "భూమి" ఉందా? మనుషుల్లా కాకపోయినా, కనీసం గుర్తించలేని రూపంలో అయినా ఏలియన్స్ లాంటి జీవరాశులు ఇతర గ్రహాలపై ఉన్నాయా? అనే సందేహాలు శాస్త్ర పరిశోధనలకు బీజం వేశాయి. ఇటీవల నాసా (NASA) చేసిన ఓ పరిశోధన ఈ ప్రశ్నకు కీలకమైన సమాధానం ఇచ్చే దిశగా దూసుకెళ్తోంది. నాసా 2021లో మార్స్ పైకి పంపిన పర్‌సివరెన్స్ రోవర్ ఇటీవల జీవానికి అవసరమైన మూలకాలు ఉన్న ఆధారాలను బయటపెట్టింది. ఇది అంగారక గ్రహంపై జీవం ఉండే అవకాశాన్ని స్పష్టంగా చూపిస్తున్న విషయం కావడం విశేషం.
మార్స్ పై పర్‌సివరెన్స్ రోవర్ ప్రయోగం
నాసా 2021లో మార్స్‌పైకి పంపిన పర్‌సివరెన్స్ రోవర్ ఇప్పటివరకు అక్కడ వాతావరణ పరిస్థితులపై, భూభాగ నిర్మాణాలపై విశ్లేషణ చేస్తూ ఉంది. ఈ రోవర్‌ను జెజెరో క్రేటర్ అనే ప్రాంతంలో ల్యాండ్ చేశారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతం కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం ఒక సముద్రం ఉండేదిగా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రాళ్లలో నీటి ప్రవాహం సంకేతాలు, వశ్రతాలు కనిపించడం ఈ ఊహలకు బలాన్ని ఇస్తోంది. ముఖ్యంగా "చేయావా ఫాల్స్" అనే ప్రదేశం, పాత నదీ ప్రవాహం గల లోయలా ఉంది. ఇక్కడి నుంచి రోవర్ సేకరించిన శాంపుల్స్‌ను నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో పరిశీలించి ఆశ్చర్యకర విషయాలను వెల్లడించారు.
రోవర్ సేకరించిన కీలక ఆధారాలు
రాళ్లలో ఆర్గానిక్ కార్బన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మూలకాలు కనుగొన్నారు. ఇవి జీవం ఏర్పడడానికి అత్యంత కీలకమైనవి. "లెపార్డ్ స్పాట్స్" అనే ప్రత్యేకమైన మచ్చలతో కూడిన రాళ్లను గుర్తించారు. ఇవి వివియనైట్, గ్రెగైట్ అనే అరుదైన ఖనిజాల ఉనికిని సూచిస్తాయి. ఈ రెండు ఖనిజాలు భూమిపై జీవం ఆవిర్భావానికి ముఖ్య కారణమైయినవిగా పరిగణించబడతాయి. అత్యంత తక్కువ వయస్సు కలిగిన రాళ్లను గుర్తించడం కూడా ఇది ఇటీవల జరిగిన జీవక్రియలతో సంబంధం ఉంటుందా? అనే అనుమానాన్ని కలిగిస్తోంది.

జీవం ఉందని ఖచ్చితంగా చెప్పలేం కానీ..
ఇవి ప్రత్యక్షంగా మార్స్‌పై జీవం ఉందని నిరూపించకపోయినా, "జీవానికి అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఎప్పుడో ఉండేవి" అని స్పష్టంగా చూపిస్తున్నాయి. అంతేకాదు, జీవం ఏర్పడటానికి అనువైన భౌతిక-రసాయనిక లక్షణాలు ఉన్నట్టు నాసా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా, ఇలా జీవానికి అనువైన మూలకాలు ఏర్పడటానికి అవసరమైన ఆమ్లాలు (యాసిడ్స్) మార్స్ మీద లేవు. అయినా ఈ ఖనిజాలు ఎందుకు ఉన్నాయనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే – ఇవి జీవ సంబంధిత మూలకాలు కావచ్చు.
భవిష్యత్తులో మార్స్‌పై జీవ వాతావరణం?
ఈ ఆధారాలన్నింటిని కలిపి చూస్తే, శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లుగా మార్స్ ఒకప్పుడు సముద్రాలు ఉన్న, జీవం ఉండే గ్రహంగా ఉండి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదో ఒక విపత్తు వల్ల అది ఇప్పుడు నిర్జీవంగా మారిపోయి ఉండొచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, భవిష్యత్తులో మార్స్‌ను కూడా భూమిలా మనిషి నివసించే స్థలంగా మార్చే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు భావిస్తున్నారు. పర్‌సివరెన్స్ రోవర్ సేకరించిన తాజా సమాచారం ఈ ఆశలకు బలాన్ని ఇస్తోంది.
మార్స్‌పై జీవం ఉందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా రుజువు కాలేదు. కానీ పర్‌సివరెన్స్ రోవర్ మాత్రం జీవానికి అవసరమైన మూలకాలు అక్కడ ఉన్నాయనే ఆధారాలు సేకరించింది. ఇది గ్రహాంతర జీవం అధ్యయనంలో ఓ పెద్ద ముందడుగుగా పరిగణించనున్నారు. భూమి మాత్రమే కాదు... శాస్త్ర విజ్ఞానం మనకు మరిన్ని "జీవం ఉండే గ్రహాలను" కనిపెట్టే రోజులు ఎంతో దూరంలో లేవు అనిపిస్తోంది.






















