Lenovo Yoga 7i Laptops Launch: లెనెవో నుంచి ల్యాప్‌టాప్ కమ్ ట్యాబ్లెట్స్.. వివరాలివే
Lenovo Yoga 7i Laptops Launch: ఒకే ల్యాప్‌టాప్‌ను రెండు విధాలుగా ఉపయోగించేలా లెనెవో సంస్థ యోగా డ్యూయెట్ 7 ఐ, ఐడియా ప్యాడ్ డ్యూయెట్ 3లను రూపొందించింది. వాటి ధర, ఫీచర్ల వివరాలు..
ఎప్పటికప్పుడు వైవిధ్య గ్యాడ్జెట్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించే లెనెవో.. మరోసారి రెండు సరికొత్త ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చింది. లెనోవా నుంచి యోగా డ్యూయెట్ 7 ఐ (Lenovo Yoga Duet 7i), ఐడియా ప్యాడ్ డ్యూయెట్ 3 (Lenovo Idea Pad Duet 3) అనే రెండు డిటాచబుల్ ల్యాప్‌టాప్‌లు భారత మార్కెట్లోకి విడుదల అయ్యాయి. ఈ రెండింటినీ ల్యాప్‌టాప్‌ల లాగా, ట్యాబ్లెట్‌లా కూడా వాడుకునే సదుపాయాన్ని కల్పించింది. రిమోట్ వర్కింగ్, ఆన్‌లైన్ విద్య వంటి వాటిని సులభతరం చేయడమే లక్ష్యంగా లెనెవో వీటిని రూపొందించింది.
ఈ రెండింటిలోనూ వెనుక భాగంలో అడ్జస్ట్‌బుల్ కిక్ స్టాండ్ (kickstand) ఉంటుంది. అలాగే వేరు చేయడానికి వీలుండేలా డిటాచబుల్ (Detachable) కీబోర్డు కూడా ఉంటుంది. ఈ కీబోర్డును కలిపి ఉంచితే ల్యాప్‌టాప్‌లాగా.. వేరు చేయడం ద్వారా ట్యాబ్లెట్‌లా వాడుకోవచ్చు. అందుకే వీటికి 2 ఇన్ 1 ల్యాప్‌టాప్స్ అని పేరు పెట్టింది.
యోగా డ్యూయెట్ 7 ఐ ఫీచర్లు ఇవే..
ఇది విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. 13 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డీ (WQHD 2160X1350 పిక్సెల్స్) ఐపీఎస్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేతో పాటు 450 నిట్స్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ ఉంది. ఇది ఇంటెల్ 11వ జనరేషన్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే సుమారు 10.8 గంటల బ్యాకప్ వస్తుంది. దీనికి వెనుక భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఉన్నాయి. లెనోవో ఈ-కలర్ పెన్ కూడా ఇందులో ఉంటుంది. ఇది దాదాపు 1.16 కేజీల బరువు ఉంటుంది. లెనోవా వాయిస్ అసిస్టెంట్‌తో పాటుగా డాల్బీ విజన్, డాల్బీ వీడియో వంటి వాటిని సపోర్టు చేస్తుంది. లెనోవా యోగా డ్యూయెట్ 7 ఐ స్లేట్ గ్రే కేసు రంగులో లభిస్తుంది.
ఐడియా ప్యాడ్ డ్యూయెట్ 3 స్పెసిఫికేషన్లు..
ఐడియా ప్యాడ్ డ్యూయెట్ 3ని ప్రత్యేకంగా విద్యార్థుల కోసం రూపొందించిందినట్లు కంపెనీ పేర్కొంది. ఇది 10.23 అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ (WUXGA 1,920x1,080 పిక్సెల్స్) ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇంటెల్ సెల్రాన్ ఎన్ 4020 ప్రాసెసర్లు ఇందులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ ఈఎంఎంసీ స్టోరేజీకి కలిగి ఉంది. లెనోవా ఐడియా ప్యాడ్ డ్యూయెట్ 3 గ్రాఫైట్ గ్రే కేస్ కలర్‌లో లభిస్తుంది. వీటితో పాటుగా లెనోవో డిజిటల్ పెన్ కూడా ఉంటుంది. 0.86 కేజీల బరువుతో చాలా లైట్‌వెయిట్‌గా ఉంటుంది. దీని బ్యాటరీని కెపాసిటీ 7 గంటల పాటు ఉంటుంది. అలాగే వెబ్ కెమెరాలో ప్రైవసీ షట్టర్ ఆప్షన్ కూడా ఉంది.
ధరలు ఇలా..
లెనోవా యోగా డ్యూయెట్ 7 ఐ ధర రూ.79,999గా, లెనోవా ఐడియా ప్యాడ్ డ్యూయెట్ 3 ధర రూ.29,999గా ఉంది. లెనోవా యోగా డ్యూయెట్ 7 ఐ లెనెవో వెబ్‌సైట్, అమెజాన్‌లలో అందుబాటులో ఉండగా.. లెనోవా ఐడియా ప్యాడ్ డ్యూయెట్ 3 లెనోవో డాట్ కామ్ సహా పలు ఇతర ఈకామర్స్ వెబ్‌సైట్లలో లభిస్తోంది.