Voter ID Aadhaar Link: ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేయాలా? జస్ట్, ఇలా చేస్తే సరిపోతుంది
ఎన్నికల విధానంలో పారదర్శకత కోసం కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే ఆధార్ తో ఓటర్ ఐడీ లింక్ చేయాలని సూచించింది.
దేశంలో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ మొదలయ్యాక.. అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తో ఆధార్ నెంబర్ ను లింక్ చేయడం జరుగుతోంది. ఇప్పటికే రేషన్ కార్డు, పాన్ కార్డు, పెన్షన్ కార్డు సహా ఇతర ముఖ్యమైన పత్రాలతో అనుసంధానం చేస్తున్నాయి ఆయా శాఖలు. భారత ఎన్నికల సంఘం కూడా ఓటర్ ఐడీతో ఆధార్ లింక్ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా, పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు పలు సంస్కరణలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు నెంబర్ ను లింక్ చేయాలని సూచించింది. ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ నెంబర్ తో లింక్ చేయడం మూలంగా ఒక వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉంటే తెలుస్తుంది. వెంటనే అధికారులు మిగతా ఓట్లను తొలగిస్తారు. ఇలా చేయడం వల్ల దొంగ ఓట్లు పడే అవకాశం ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఓటర్ ఐడీ ఉన్న పౌరులు స్వచ్ఛందంగా ఆధార్ తో లింక్ చేసుకోవాలని సూచింది. ఓటర్ ఐడీ, ఆధార్ లింక్ తప్పని సరి కాదని వెల్లడించింది.
గత సంవత్సరం పార్లమెంట్ లో ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021కి ఆమోదం లభించింది. అప్పటి నుంచి ఆధార్ నెంబర్ తో ఓటర్ గుర్తింపు కార్డులను లింక్ చేసే ప్రక్రియ మొదలయ్యింది. ఇప్పటి వరకు చాలా మంది తమ ఓటర్ కార్డులను ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకున్నారు. ఒక వేళ మీరు కూడా ఆధార్ నెంబర్ తో ఓటర్ ఐడీ కార్డును లింక్ చేసుకోకపోతే.. సులభమైన పద్దతులతో మీ స్మార్ట్ ఫోన్ లేదంటే కంప్యూటర్ నుంచి అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకు మీరు ముందుగా www.nvsp.in వెబ్ సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎలక్టోరల్ ఆథెంటికేషన్ ఫామ్ (Form 6B) పూర్తి చేసి ఈ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.
NVSP.in ద్వారా లింక్ ఎలా చేసుకోవాలంటే?
1. జాతీయ ఓటరు అధికారిక సేవా పోర్టల్ అయిన NVSP.inకి లాగిన్ అవ్వాలి.
2. మీ NVSP అకౌంట్ కు లాగిన్ అవ్వాలి.
3. ఎలక్టోరల్ రోల్ లో సెర్చ్ పై క్లిక్ చేయాలి.
4. ఓటర్ IDని సెర్చ్ చేయడానికి మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
5. ఆధార్ సమాచారాన్ని పూరించాలి.
6. మొబైల్‌ని ఆధార్ తో లింక్ చేయడానికి OTP వస్తుంది.
7. ఈ OTPని నమోదు చేసిన తర్వాత అనుసంధానం పూర్తి అవుతుంది.
స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా లింక్ చేసుకోవచ్చు..
1. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో Voter Helpline యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి.
2. యాప్ ఓపెన్ చేసిన తర్వాత Voter Registration ఆప్షన్ ను ఎంచుకోవాలి.
3. ఎలక్టోరల్ ఆథెంటికేషన్ ఫామ్ (Form 6B) పైన క్లిక్ చేయాలి.
4. ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది.
5. Yes I have voter ID ఆప్షన్ సెలక్ట్ చేసి క్లిక్ చేయాలి.
6. మీ ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేసి, స్టేట్ సెలెక్ట్ చేయాలి.
7. Fetch Details పైన క్లిక్ చేయాలి.
8. ఆ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి.
9. మీ ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Done పైన క్లిక్ చేయాలి.
10. మీ ఓటర్ ఐడీతో ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?