Google For India 2024: ఇండియా ఈవెంట్‌లో గూగుల్ లాంచ్ చేసిన ఫీచర్లు ఇవే - ఇక ఏఐదే ఫ్యూచర్ అంతా!
Google Event: భారతదేశంలో జరుగుతున్న గూగుల్ ఈవెంట్‌లో కొన్ని కొత్త ఫీచర్లు, సర్వీసులను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Google Event in India: దీపావళికి ముందు భారతీయ వినియోగదారులకు గూగుల్ గొప్ప బహుమతిని ఇచ్చింది. ఈరోజు (అక్టోబర్ 3వ తేదీ) భారతదేశంలో జరిగిన వార్షిక ఈవెంట్‌లో కంపెనీ అనేక ఏఐ టూల్స్, ఫీచర్లతో ముందుకు వచ్చింది. భారతదేశంలో లాంచ్ అయిన ఈ వినూత్న ఏఐ ఫీచర్ల గురించి చెప్పాలంటే... ఇవి భారతీయ వినియోగదారుల జీవితాలను పూర్తిగా మారుస్తాయని గూగుల్ తెలిపింది. దీని కోసం గూగుల్ హిందీ భాషలో ట్యాగ్‌లైన్‌ను ఉపయోగించింది, అదే "జో అబ్ హోగా, గజాబ్ హోగా." గూగుల్ ఫర్ ఇండియా 2024 ఈవెంట్‌లో ఆవిష్కరించిన ఐదు ఆసక్తికరమైన ఫీచర్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జెమిని లైవ్ అంటే ఏమిటి?
జెమిని లైవ్ అనేది గూగుల్ ప్రారంభించిన అధునాతన ఏఐ ప్లాట్‌ఫారమ్. ఇది రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్, అనాలసిస్‌ను సులభతరం చేస్తుంది. ఈ ప్లాట్‌ఫారం వివిధ పరిశ్రమలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది భారీ మొత్తంలో డేటాను త్వరగా ప్రాసెస్ చేస్తుంది. దీంతోపాటు ముఖ్యమైన ఇన్‌సైట్స్‌ను కూడా అందిస్తుంది.
జెమిని లైవ్ గతంలో ఆంగ్ల భాషలో అందుబాటులో ఉంది. ఇప్పుడు గూగుల్ దీనిని భారతదేశంలో ఎనిమిది ఇతర భాషలతో (బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తెలుగు, తమిళం, ఉర్దూ) పాటు హిందీ భాషలో కూడా ప్రారంభించింది. వినియోగదారులు నేటి నుండే ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.
గూగుల్ లెన్స్‌తో వీడియోల్లో కూడా...
ఇప్పటి వరకు మీరు ఫొటో ద్వారా సెర్చ్ చేయడానికి గూగుల్ లెన్స్‌ని ఉపయోగించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఫోటోతో పాటు మీరు గూగుల్ లెన్స్‌లో వీడియోని కూడా క్యాప్చర్ చేయవచ్చు. అలాగే దాని గురించి సమాచారాన్ని శోధించవచ్చు.
వంటగదిలో మీ కుక్కర్ సరిగ్గా పని చేయకపోతే మీరు దాని వీడియోను రికార్డ్ చేసి అసలు సమస్య ఏమిటో, దాన్ని ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకోవడానికి గూగుల్ లెన్స్‌తో సెర్చ్ చేయవచ్చని గూగుల్ తన ఈవెంట్‌లో ఒక ఉదాహరణను చూపింది.
గూగుల్ పే యూపీఐ సర్కిల్ ప్రారంభం
గూగుల్ తన ఆన్‌లైన్ పేమెంట్ సర్వీస్‌లో కొత్త ఫీచర్ యూపీఐ సర్కిల్‌ను విడుదల చేసింది. యూపీఐ సర్కిల్ సహాయంతో ఏ యూజర్ అయినా తన స్నేహితులు లేదా బంధువుల కోసం కేవలం ఒక క్లిక్‌లో చెల్లింపు చేయగలరు.
ఉదాహరణకు మీరు ఏదైనా కొనడానికి దుకాణానికి వెళితే చెల్లింపు చేయడానికి క్యాష్ లేదా యూపీఐ లేకపోతే... అతను యూపీఐ సర్కిల్ ద్వారా పేమెంట్ చేయమని తన తల్లిదండ్రులను సులభంగా అభ్యర్థించగలడని గూగుల్ ఒక ఉదాహరణను ఇచ్చింది. పాప్-అప్ నోటిఫికేషన్ ద్వారా సర్కిల్‌లో ఉన్నవారి కోసం సులభంగా చెల్లింపు చేయగలరు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
గూగుల్, అపోలో హాస్పిటల్ మధ్య భాగస్వామ్యం
గూగుల్, అపోలో హాస్పిటల్స్ హెల్త్ నాలెడ్జ్ ప్యానెల్‌ల కోసం భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. దీనిలో అపోలో క్లయింట్‌తో జెమిని లైవ్ ఏజెంట్‌ను ఉపయోగించవచ్చు. ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత సౌకర్యవంతంగా, ప్రభావవంతంగా చేయడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం.
ఈ భాగస్వామ్యం సహాయంతో అపోలో హాస్పిటల్ తన రోగులకు గూగుల్ ఉచిత ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం ద్వారా మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించగలదు. ఆరోగ్య రంగంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఈ పార్ట్‌నర్‌షిప్ ఒక ముఖ్యమైన దశ.
కోటి మంది భారతీయులకు గూగుల్ ఏఐ కోర్సు
గూగుల్ ఏఐ స్కిల్స్ హౌస్‌ను ప్రారంభించింది. ఇది విద్యార్థులు, ఉద్యోగార్ధులు, ఉపాధ్యాయులు, డెవలపర్లు, ప్రభుత్వ అధికారుల కోసం ఏఐ కోర్సులను కలిగి ఉన్న అభ్యాస కార్యక్రమం. గూగుల్ తీసుకువచ్చిన ఈ కార్యక్రమం లక్ష్యం 10 మిలియన్ల భారతీయులకు ఏఐ పరిజ్ఞానాన్ని అందించడం. అంటే దాదాపు కోటి మంది భారతీయులకు అన్నమాట. గూగుల్ తీసుకువచ్చిన ఈ స్కిల్ హౌస్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లో మూడు కోర్సులు ఉన్నాయి: జనరేటివ్ ఏఐ ఇంట్రడక్షన్, రెస్నాన్సిబుల్ ఏఐ ఇంట్రడక్షన్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌కు ఇంట్రడక్షన్.
గూగుల్ తీసుకొచ్చిన ఈ ఏఐ కోర్సులను యూట్యూబ్, గూగుల్ క్లౌడ్‌లో ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. అయితే ఇది మొదట ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. త్వరలో దీన్ని గూగుల్ ఏడు ఇతర భారతీయ భాషలలో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఇది మాత్రమే కాకుండా హిందీ మాట్లాడే వ్యక్తుల కోసం గూగుల్ ఏఐ ఎసెన్షియల్స్, జెన్ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్ కోర్సులను కూడా గూగుల్ తీసుకువస్తుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?