Rahul Dravid Dhawan Speech: డ్రెస్సింగ్‌రూమ్‌లో రోమాలు నిక్కబొడిచేలా ద్రవిడ్ స్పీచ్! చప్పట్లే చప్పట్లు!
IND vs WI: వెస్టిండీస్‌తో వన్డే సిరీసులో యువ క్రికెటర్లు అద్దరగొట్టారని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అన్నారు.
Rahul Dravid Dhawan Speech: వెస్టిండీస్‌తో వన్డే సిరీసులో యువ క్రికెటర్లు అద్దరగొట్టారని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) అన్నారు. సుదీర్ఘ కాలం వారు భారత్‌కు సేవలందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అత్యంత ఒత్తిడి ఎదురైన మ్యాచుల్లో కుర్రాళ్లు తెగువను చూపించారని కెప్టెన్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ప్రశంసించారు. భవిష్యత్తులోనూ వారు ఇలాగే ఆకట్టుకోవాలని కోరుకున్నారు. విండీస్‌పై 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేశాక వీరిద్దరూ డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడారు.
కుర్రాళ్లు గ్రేట్!
'ఇదో అద్భుతమైన సిరీస్. వెల్డన్! మనం ఇక్కడికి యువ జట్టుతో వచ్చాం. ఇంగ్లాండ్‌లో ఆడిన చాలామంది ఆటగాళ్లు విండీస్‌పై ఆడలేదు. అందుకే ఇది కుర్రాళ్ల టీమ్‌ఇండియా అంటున్నాను. పరిస్థితులకు తగ్గట్టు మీరు స్పందించారు. మూడు వన్డేల్లోనూ ప్రొఫెషనలిజం చూపించారు. తొలి రెండు మ్యాచులు నువ్వా నేనా అన్నట్టు సాగాయి. మేం వాటి గురించి చర్చించుకున్నాం. అలాంటి ఒత్తిడితో కూడిన మ్యాచుల్లో మీరు అదరగొట్టారు. కుర్ర జట్టుకు ఇదో శుభసూచకం' అని రాహుల్ ద్రవిడ్ అన్నారు.
సూపర్ స్టార్స్
టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ సైతం కుర్రాళ్లను అభినందించారు. జట్టు సభ్యులు, సహాయ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. కుర్రాళ్లు ఇప్పుడున్న స్థాయి కన్నా ఎంతో ఎత్తుకు ఎదుగుతారని ధీమా వ్యక్తం చేశారు.
'బ్యాటింగ్, బౌలింగ్‌లో కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. మీరంతా యువకులే. అయినా సమర్థంగా ఆడారు. ఇప్పుడున్న స్థాయిని మించి మీరు ఎదుగుతారు. ఇప్పటికే ఆ బాటలో అడుగులేయడం మొదలుపెట్టారు. మీకు సుదీర్ఘ భవిష్యత్తు ఉంటుంది. ఈ ప్రసంగం ముగించే ముందు మనమంతా కలిసి ఒక ఫొటో దిగుదాం. మనం ఎవరం అని నేను అడుగుతాను. మనం విజేతలం అని మీరు అరవండి' అని గబ్బర్ వెల్లడించారు.
3-0తో క్లీన్‌స్వీప్
IND vs WI 3rd ODI, Highlights: వెస్టిండీస్‌పై మూడు వన్డేల సిరీసును టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా రెండోసారీ ఆ జట్టుపై 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆఖరి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించినా గబ్బర్ సేన అదరగొట్టింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 35 ఓవర్లకు 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్లను భారత బౌలర్లు ఓ ఆటాడించారు. కేవలం 26 ఓవర్లకే 137కు కుప్పకూల్చారు. బ్రాండన్ కింగ్ (42), నికోలస్ పూరన్ (42) టాప్ స్కోరర్లు. యూజీ 4, శార్దూల్, సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో శుభ్‌మన్ గిల్ (98 నాటౌట్; 98 బంతుల్లో 7x4, 2x6) శతకానికి చేరువయ్యాడు. శిఖర్ ధావన్ (58; 74 బంతుల్లో 7x4, 0x6), శ్రేయస్ అయ్యర్ (44; 34 బంతుల్లో 4x4, 1x6) అదరగొట్టారు.
From The #TeamIndia Dressing Room!
— BCCI (@BCCI) July 28, 2022
Head Coach Rahul Dravid & Captain @SDhawan25 applaud 👏 👏 the team post the 3-0 win in the #WIvIND ODI series. 🗣 🗣
Here's a Dressing Room POV 📽 - By @28anand
P.S. Watch out for the end - expect something fun when Shikhar D is around 😉😁 pic.twitter.com/x2j2Qm4XxZ