అన్వేషించండి
Sanjay Singh: అడ్‌హక్ కమిటీని గుర్తించబోం, సంజయ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు
Wrestling Federation of India: తమ గెలుపును ప్రభుత్వం పక్కన పెట్టడం పైసంజయ్ సింగ్ ప్రశ్నించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విధించిన సస్పెన్షన్‌ను తాము గుర్తించమని కుండబద్దలు కొట్టారు.

సంజయ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు (Image Source : PTI)
నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య(Wrestling Federation of India)ను రద్దు చేసిన కేంద్ర కీడామంత్రిత్వశాఖ... రెజ్లింగ్ ఫెడరేషన్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(Indian Olympic Association)కు అప్పగించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్వహణకు తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయాలని ఐఓఏను క్రీడా శాఖ లేఖ రాసింది. రెజ్లర్ల సెలక్షన్ , ఫెడరేషన్ నిర్వహణ బాధ్యతలను చూడాలని ఐఓఏను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించిన భారత ఒలింపిక్ సంఘం... ముగ్గురు సభ్యులతో అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసింది. భారత రెజ్లింగ్ సమాఖ్యను నడిపించేందుకు భారత ఒలింపిక్ సంఘం ముగ్గురు సభ్యులతో అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసింది. భారత వుషు సంఘం అధ్యక్షుడు భూపిందర్ సింగ్‌ను ఈ కమిటీకి ఛైర్మన్‌గా నియమించింది. హాకీ ఒలింపియన్ ఎంఎం సౌమ్య, మాజీ షట్లర్ మంజుషా కన్వర్.. కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఇటీవలే ఫిబ్రవరిలో సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తామని తేదీలను కూడా ప్రకటించింది. అయితే ఈ అడ్‌హక్ కమిటీపై సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొత్త తలనొప్పి
తాము రెజ్లింగ్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా గెలిచామని... తాము గెలిచిన పత్రాలపై రిటర్నింగ్ ఆఫీసర్ సంతకాలు కూడా చేశారని... వాళ్లు దానిని ఎలా మరుగునపెడతారని సంజయ్ సింగ్(suspended WFI president Sanjay Singh) ప్రశ్నించారు. ఈ అడ్‌హక్ ప్యానెల్‌ను తాము గుర్తించబోమని.. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తమపై విధించిన సస్పెన్షన్‌ను కూడా తాము గుర్తించమని కుండబద్దలు కొట్టాడు. WFI తన పని తాను చేసుకుపోతోందని.. తాము తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని తెలిపాడు. స్టేట్ అసోసియేషన్స్ టీమ్స్‌ను పంపకపోతే అడ్‌హక్ కమిటీ నేషనల్ ఛాంపియన్స్ ఎలా నిర్వహిస్తుందని సంజయ్‌సింగ్ ప్రశ్నించారు. తాము త్వరలోనే నేషనల్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తామని.. త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరుపుతామని తెలిపాడు. అడ్‌హక్ కమిటీ కంటే ముందే తామే నేషనల్ ఛాంపియన్‌షిప్ నిర్వహించి తీరుతామని సంజయ్ సింగ్ చెప్పాడు. సంజయ్ సింగ్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న వేళ రెజ్లర్లకు ఈ సమస్య కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టేలా ఉంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తమపై విధించిన సస్పెన్షన్‌పై లేఖ రాశామని, దానికి సమాధానం రావాల్సి ఉందని సంజయ్ సింగ్ అన్నారు. తాము నిబంధనలను ఉల్లంఘించలేదని తెలిపాడు. కేంద్రం చర్చలకు రాకుంటే తాము కూడా ఆ సస్పెన్షన్‌ను అంతగా పట్టించుకోమని కుండబద్దలు కొట్టాడు.
కొనసాగుతున్న మద్దతు
భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) ఎన్నికవడంతో వివాదం కొనసాగుతోంది. సంజయ్ సింగ్ WFI కొత్త అధ్యక్షుడిగా ఎన్నికకావడాన్ని పలువురు రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. మరో దిగ్గజ రెజ్లర్ బజ్‌రంగ్ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశాడు. వినేశ్ ఫొగాట్ కూడా ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేసింది.
ఇంకా చదవండి





















