PM Narendra Modi: పారాలింపిక్ ఛాంపియన్లతో ప్రధాని మోదీ చిట్ చాట్
పారాలింపిక్స్ లో సత్తా చాటిన భారత ప్లేయర్లను మోదీ అభినందించారు. ఈరోజు వారిని కలిసి విజయానందాన్ని వ్యక్తం చేశారు.
పారాలింపిక్స్ విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. దేశ కీర్తిని విశ్వక్రీడల్లో నలుదిశలా వ్యాపింపజేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా భారత్ విజయోత్సవాన్ని వారితో కలిసి పంచుకున్నారు మోదీ. ఒక్కొక్కరితో మాట్లాడి వారి విజయగాథలను శ్రద్ధగా విన్నారు.
ఈ సందర్భంగా ప్లేయర్లు.. తమను ప్రోత్సహించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తుల్లో మరిన్ని పతకాలు సాధిస్తామన్నారు. వారిని మోదీ కలిసిన చిత్రాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సత్తా చాటిన భారత్..
ఈ క్రీడల్లో భారత్ 19 పతకాలు సాధించింది. 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. 1968 నుంచి పారాలింపిక్స్‌లో పోటీపడుతోన్న భారత్.. 2016 వరకూ మొత్తం 12 పతకాలు మాత్రమే సాధించగా.. ఇప్పుడు ఏకంగా 19 పతకాలు గెలుచుకోవడం విశేషం.
పతకాల పట్టికలో భారత్ 24వ స్థానంలో నిలిచింది. 2012 లండన్ పారాలింపిక్స్‌లో భారత్‌కి ఒకే ఒక పతకం దక్కగా.. 2016 రియో పారాలింపిక్స్‌లో ఆ సంఖ్య 4కి చేరింది.
అవని లేఖరా (షూటింగ్), సుమిత్ అన్టిల్ (జావెలిన్ త్రో), మనీశ్ నర్వాల్ (షూటింగ్), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్), కృష్ణ నగర్ (బ్యాడ్మింటన్) స్వర్ణ పతకాలు గెలిచారు.
4045 మంది అథ్లెట్లు బరిలో దిగిన ఈ పారాలింపిక్స్‌లో 207 పతకాలతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. బ్రిటన్ (124), అమెరికా (104) తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి.
ఉపరాష్ట్రపతి ప్రశంసలు..
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత అథ్లెట్ల ప్రదర్శనపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే పారిస్ ఒలింపిక్స్ (2024) నాటికి ఈ పతకాల సంఖ్య రెట్టింపవ్వాలని ఆయన అభిలషించారు. ఇందుకోసం అవసరమైన ప్రోత్సాహభరితమైన వాతావరణాన్ని నిర్మించడంలో క్రీడా సంస్థలతోపాటు ప్రైవేటురంగం అండగా నిలబడాలని, భారతీయ యువశక్తికి మద్దతుగా నిలవాలని సూచించారు.
ఎస్.ఆర్.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరుచురాపల్లి ప్రాంగణాన్ని గురువారం చెన్నై రాజ్ భవన్ నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ శ్రీ భన్వరీలాల్ పురోహిత్, ఎస్.ఆర్.ఎం. వ్యవస్థాపక కులపతి, పార్లమెంటు సభ్యుడు శ్రీ టీఆర్ పారివెందర్ అంతర్జాల వేదిక ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: Indian Air Force: నేషనల్ హైవేపై 'సుఖోయ్' ఫైటర్ జెట్ ల్యాండింగ్.. వీడియో చూశారా?