T20 World Cup 2026: సొంతగడ్డపై దారుణ వైఫల్యాలతో శ్రీలంక జట్టులో భారీ మార్పులు.. వారిపై తప్పని వేటు!
Sri lanka Captain Dasun Shanaka | వరల్డ్ కప్ నెగ్గాలన్న కల మరోసారి నెరవేరకపోవడంతో శ్రీలంక జట్టు, బోర్డులో కొందరిపై వేటు పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పలు నివేదికలు అదే విషయాన్ని సూచిస్తున్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2026లో దారుణ ప్రదర్శన తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టులో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సహ-ఆతిథ్య దేశం అయిన శ్రీలంక జట్టు టోర్నమెంట్ సూపర్-8 దశ నుండే నిష్క్రమించడం జట్టుకు, అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. పొట్టి ప్రపంచ కప్‌లో లంక ప్రదర్శన ప్రభావం జట్టు కెప్టెన్, సెలక్షన్ కమిటీపై పడే అవకాశం ఉంది. కెప్టెన్ దాసున్ షనకను తొలగిస్తారని మాజీ క్రికెటర్లు అంచనా వేశారు.
సూపర్-8లో వరుస ఓటములతో పెరిగిన ఒత్తిడి
గ్రూప్ స్టేజ్‌లో వరుసగా 3 మ్యాచ్‌లు గెలిచి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చిన శ్రీలంక జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే లంక జట్టు సూపర్-8కు చేరుకోగానే, దాని ప్రదర్శన దారుణంగా తయారైంది. సూపర్ 8 పోరులో తొలి మ్యాచులో ఇంగ్లాండ్‌తో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ సైతం లంకేయుల్ని తేలికగా ఓడించింది. ఈ రెండు వరుస ఓటములతో శ్రీలంక జట్టు దాదాపు సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకున్నట్లే.
2014లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక జట్టు, గత కొన్ని సంవత్సరాలుగా ICC మేజర్ టోర్నమెంట్లలో టాప్-4 కి కూడా చేరుకోలేకపోతోంది. స్వదేశంలో ఆడటం కలిసొచ్చే అంశమైనా తీవ్రంగా నిరాశపరుస్తూ లంక జట్టు అంచనాలను అందుకోలేకపోయింది. మరోసారి ప్రపంచ కప్ నెరవేరకుండానే, కనీసం తుది పోరుకు సైతం చేరకుండానే ఇంటి బాట పట్టింది. దాంతో లంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
New Zealand takes the win by 61 runs.#SLvNZ #SriLankaCricket pic.twitter.com/3I8EfVcxUw
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) February 25, 2026
కెప్టెన్, సెలక్టర్లపై వేటు పడే అవకాశం
ఏఎఫ్‌పీ (AFP) నివేదిక, వార్తా సంస్థల సమాచారం ప్రకారం, టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టు ప్రదర్శనను రివ్యూ చేయనుంది. ఆ తర్వాత కెప్టెన్ దసున్ షనక, జాతీయ సెలక్టర్లను తొలగించడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొంతమంది తమ పదవుల నుంచి తప్పుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. శ్రీలంక హెడ్ కోచ్ సనత్ జయసూర్య, వరల్డ్ కప్ తర్వాత తాను పదవి నుండి తప్పుకుంటానని గతంలోనే ప్రకటించారు. అటువంటి పరిస్థితుల్లో ఈ మెగా టోర్నీ తరువాత టీమ్ మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు తప్పవని చెప్పవచ్చు.
ఓటమి తర్వాత కెప్టెన్ ఏమన్నారు?
న్యూజిలాండ్‌తో జరిగిన ఓటమి తర్వాత కెప్టెన్ దసున్ షనక తీవ్ర నిరాశకు లోనయ్యాడు. సొంతగడ్డపై తమ ప్రేక్షకుల ముందు ఈ తీరుగా టోర్నమెంట్ నుండి నిష్క్రమించడం అత్యంత అవమానకరమైన విషయమని అంగీకరించారు. జట్టు మంచి ఆరంభాన్ని అందుకున్నప్పటికీ, కీలక సమయాల్లో బౌలర్లు, బ్యాటర్లు ఒత్తిడికి లోనవడంతో ఓటములు తప్పలేదని పేర్కొన్నాడు. ఇకపై ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లపై ఆధారపడటం మానుకోవాలని జట్టుకు సూచించారు. టీ20 వంటి వేగవంతమైన ఫార్మాట్‌లో పాజిటివ్ థింకింగ్, దూకుడు వైఖరి చాలా అవసరం, కానీ ఈ టోర్నమెంట్‌లో జట్టు కొన్నిసార్లు ఆ ఆటతీరును ప్రదర్శించలేకపోయిందని ఒప్పుకున్నాడు.





















