PAK vs ENG 2022: 17 ఏళ్ల తర్వాత పాక్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు - మ్యాచు రోజు హెలికాప్టర్లతో భద్రత!
PAK vs ENG 2022: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కరాచీలో అడుగుపెట్టింది. దాదాపుగా 17 ఏళ్ల తర్వాత తొలిసారి పాకిస్థాన్‌లో ద్వైపాక్షిక సిరీసు ఆడుతోంది. గురువారం ఆటగాళ్లంతా కరాచీ విమానాశ్రయానికి చేరుకున్నారు.
PAK vs ENG 2022: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కరాచీలో అడుగుపెట్టింది. దాదాపుగా 17 ఏళ్ల తర్వాత తొలిసారి పాకిస్థాన్‌లో ద్వైపాక్షిక సిరీసు ఆడుతోంది. గురువారం ఆటగాళ్లంతా కరాచీ విమానాశ్రయానికి చేరుకున్నారు. 2005 తర్వాత ఆ దేశంలో ఆంగ్లేయులు పర్యటించడం ఇదే తొలిసారి. గతేడాదే రావాల్సి ఉన్నా భద్రతా కారణాలతో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తప్పుకోవడంతో ఈసీబీ అదే దారిలో నడిచింది. ఇది తమను అగౌరపరచడమే అంటూ అప్పట్లో పీసీబీ హడావిడి చేసిన సంగతి తెలిసిందే.
పాక్‌లో పర్యటించేందుకు దాదాపుగా అన్ని జట్లూ వెనుకాడతాయి. 2009లో లాహోర్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై బాంబు దాడి జరగడమే ఇందుకు కారణం. అప్పట్నుంచి ఆ దేశంలో ఎవ్వరూ అడుగుపెట్టలేదు. అక్కడ అంతర్జాతీయ క్రికెట్ జీవం కోల్పోయింది. దాంతో యూఏఈని తటస్థ వేదికగా ఎంపిక చేసుకొని పాకిస్థాన్ సిరీసులు ఆడింది. 2012, 2015లో ఇంగ్లాండ్‌కు అక్కడే ఆతిథ్యం ఇచ్చింది.
పాకిస్థాన్‌లో ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రాణం పోసుకుంటోంది. బాంబు దాడికి గురైన శ్రీలంక జట్టే తొలుత అక్కడ ద్వైపాక్షిక సిరీసు ఆడింది. కొన్నేళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా గతేడాది అక్కడ పర్యటించింది. ఆసీస్ సిరీసును విజయవంతంగా పూర్తి చేయడం తమ ప్లానింగ్, నిర్వాహక సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని పీసీబీ తెలిపింది. ఇంగ్లాండ్ సిరీసునూ సురక్షితంగా పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది.
ఆంగ్లేయులు లాహోర్, కరాచీలో మొత్తం 7టీ20లు ఆడతారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 వరకు మ్యాచులు జరుగుతాయి. ఇందుకోసం పీసీబీ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచులు జరిగే రోజుల్లో ఇంగ్లాండ్ బస చేసిన హోటల్ నుంచి కరాచీ స్టేడియం వరకు రహదారులను మూసేస్తారు. స్టేడియం కనిపించే దుకాణాలు, కార్యాలయాలు బంద్ చేస్తారు. ఇంగ్లాండ్ టీమ్ బస్సు ప్రయాణాన్ని ఓ హెలికాప్టర్‌లో పర్యవేక్షిస్తారు.
అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడటంతో పాక్‌లో మళ్లీ బాంబు దాడులు జరగడం కలవరపెడుతోంది. బలూచిస్థాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న దళాలూ దాడులు చేస్తున్నాయి. మార్చిలో పెషావర్‌లోని షియా మసీదులో ఐసిస్ ఉగ్రవాది బాంబు దాడిలో 64 మంది మృతి చెందారు. ఈ మధ్యే పాక్‌లో మూడోవంతు ప్రజలు వరద బీభత్సం ఎదుర్కొన్నారు. హిమాలయ నదుల నుంచి ఉద్ధృతంగా వరద రావడంతో 3.3 కోట్ల మంది ప్రజలు అల్లాడారు.
Our 18-player squad for the seven-match T20I series against England 👇
— Pakistan Cricket (@TheRealPCB) September 15, 2022
🗒️ https://t.co/JnHpDOvXsS#PAKvENG | #BackTheBoysInGreen pic.twitter.com/r6kChdbbDJ
Our Men's team have landed in Karachi ahead of our historic IT20 series against Pakistan. pic.twitter.com/TQEnKzaRpl
— England Cricket (@englandcricket) September 15, 2022