PV Sindhu: పారిస్ ఒలింపిక్స్‌లో ఓడిపోయిన సింధు - పరాజయానికి కారణాలివే!
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో పతకం తీసుకొస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న సింధు రిక్తహస్తాలతో ఇంటిదారి పట్టింది. రాత్రి జరిగిన మ్యాచ్‌లో 9వ ర్యాంకర్ చేతిలో ఓటమిపాలైంది.
PV Sindhu : పారిస్ లో ఒలింపిక్స్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఓటమి పాలైంది. 2016రియోలో సిల్వర్ మెడల్ గెలుచుకున్న సింధు..2020లో టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకుంది. అలా వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్ లో పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు చరిత్ర సృష్టించింది. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో వరుసగా మూడోసారి పతకం సాధిస్తుందని..అది కూడా స్వర్ణం గెలిచి త్రివర్ణపతాకాన్ని రెపరెపలాడిస్తుందని అభిమానులంతా భావించారు.కానీ జరిగింది పూర్తి విరుద్ధం. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ లో చైనా అమ్మాయి హే బిన్ జియావో చేతిలో 19-21, 14-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయింది సింధు. ఫలితంగా పారిస్ ఒలింపిక్స్ నుంచి సింధు నిష్క్రమించాల్సి వచ్చింది..సింధు ఓటమికి అసలు టాప్ 3 కారణాలేంటో చూద్దాం.
1. గాయాలతో సతమతం
2022లో కామన్ వెల్త్ గేమ్స్ లో సింధు స్వర్ణపతకం సాధించింది. తద్వారా కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణం, రజతం, కాంస్యం మూడు పతకాలు కైవసం చేసుకున్న రెండో క్రీడాకారాణిగా, తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. అయితే ఆ తర్వాత సింధును గాయాలు వేధించాయి. ఎడమకాలి పాదానికి గాయం కావటంతో ఏడాదంతా సింధు ఆటకు దూరమైంది. వరల్డ్ ఛాంపియన్ షిప్, వరల్డ్ టూర్ ఫైనల్స్ లోనూ ఆమె పాల్గొనలేదు. 2023 మలేసియా ఓపెన్ తో సింధు తిరిగి బరిలోకి దిగినా...ఆ ఏడాదంతా ఒక్క టోర్నమెంట్ ను కూడా సింధు గెలవలేకపోయింది. నాలుగు సార్లు సెమీఫైనల్లో ఓడిపోయిన సింధు..ఏడుసార్లు మొదటి రౌండ్ లోనే ఓడిపోయింది. తిరిగి మోకాలికి గాయం కావటంతో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అకస్మాత్తుగా నిష్క్రమించింది సింధు. సో గాయాలు ఆమె ఆటను ఎంత ఎఫెక్ట్ చేశాయో అర్థం చేసుకోవచ్చు.
2. కోచ్ ల మార్పు
ఇది పూర్తిగా సింధు వ్యక్తిగత ఛాయిస్ అయినప్పటికీ సింధు కోచ్ ల మార్పు ఆమె ఆట తీరులోనూ మార్పులు తీసుకొస్తుంది అనేది విశ్లేషకుల వాదన. ఎందుకంటే సింధు ఫస్ట్ నుంచి కోచ్ పుల్లెల గోపీచంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంది. ఆయన గైడెన్స్ లోనే 2016లో రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించింది సింధు. ఆ తర్వాత గోపీ చంద్ తో ఆమెకు మనస్పర్థలు వచ్చాయి. అత్యుత్తమ శిక్షణ కోసమే బయటకు వచ్చేశానంటూ గోపీచంద్ అకాడమీ నుంచి నిష్క్రమించింది పీవీ సింధు. ఆ తర్వాత సౌత్ కొరియా కోచ్ పార్క్ టే సాంగ్ పీవీ సింధుకు శిక్షణ నిచ్చాడు. ముందు ఒలింపిక్స్ లో సిల్వర్ గెలుచుకున్న సింధు ఈసారి గోల్డ్ కొడుతుందని భావించినా... 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుచుకుంది సింధు. కొవిడ్ కారణంగా సరైన సన్నద్ధత లేకపోవటం అనేది అప్పుడు కారణంగా కనిపించింది. అయినా రెండు ఒలిపింక్స్ లో వరుసగా పతకాలు గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు చరిత్ర సృష్టించింది. అయితే ఈ సారి మరో సారి ఒలింపిక్ గోల్డ్ పై దృష్టి సారించిన సింధు..తన కోచ్ ను మళ్లీ మార్చింది. ప్రస్తుతం ఇండోనేసియాకు చెందిన ఆగస్ డి శాంటసో సింధు కోచ్ గా ఉండగా...లెజండరీ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే మెంటార్ గా ఉన్నారు. కానీ సింధు లో మునుపటి దూకుడు కనిపించలేదు. ఫలితంగా ఏ అమ్మాయినైతే సింధు ఓడించి టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకుందో అదే హే బిన్ జియావో చేతిలో ప్రీ క్వార్టర్స్ లో ఓడిపోయింది సింధు.
3. సెలబ్రెటీ స్టేటస్
ఈ అంశం గురించి చెప్పటానికి కొంచెం ఇబ్బందిగానే ఉన్నప్పటికీ సింధు ఆటపై పూర్తి విశ్లేషణాత్మక ధోరణితో చూస్తే ఈ పాయింట్ చెప్పక తప్పటం లేదు. 2016 రియో ఒలింపిక్స్ కి ముందు సింధు ఆశ, ధ్యాస అన్నీ ఆట మాత్రమే. బ్యాడ్మింటన్ తప్ప ఆమెకు మరో లోకం లేదు. ఆట మీద అంతటి తీవ్రతతో ఉండేది కాబట్టి రికార్డులన్నీ ఆమెకు సాగిలపడ్డాయి. ఏ భారతీయురాలు సాధించనంత ఘనతలు సాధించింది. ఎప్పుడైతే ఒలింపిక్స్ లో పతకం వచ్చిందో అప్పటి నుంచి ఆమెకు సెలబ్రెటీ స్టేటస్ వచ్చేసింది. మీడియా, పాపులారిటీ ఇవన్నీ కలిసి సింధును చుట్టుముట్టేశాయి. తన ఆటను డామినేట్ చేసేలా ఎండార్స్మెంట్లు, షూటింగ్ లు వీటన్నింటినీ సింధు మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు శిక్షణనిచ్చిన కోచ్ గోపీచంద్ తో అభిప్రాయ బేధాలు సింధు బయటకు రావటం కూడా కారణం కావచ్చు. ఇదివరకూ సింధు తనపై గోపీచంద్ చూపించే క్రమశిక్షణను షేర్ చేసుకునేవాళ్లు. ఫోన్ ముట్టుకోనివ్వరని, ఐస్ క్రీమ్ తిననివ్వరని చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని సింధు చెప్పేవారు. అలాంటి సింధు ఇప్పుడు ఓ సెలబ్రెటీ. బాలీవుడ్ ఈవెంట్స్, అవార్డ్ ఫంక్షన్స్ కు వేటికైనా అటెండ్ అయ్యే స్వేచ్ఛ ఆమెకు ఉంది. అంతెందుకు మొన్న పారిస్ ఒలింపిక్స్ లో సింధు కు సపోర్ట్ చేయటానికి మెగా ఫ్యామిలీ వెళ్లింది. ఉపాసన, చరణ్ లతో కలిసి ఆమె ఒలిపింక్ విలేజ్ టూర్ చేసింది. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. ఇవన్నీ కారణం చెప్పటం లేదు కానీ ఆటను డామినేట్ చేసేలా సింధు చుట్టూ చేరిపోతున్న విషయాలు ఆమెలోని ప్రతిభను మసకబారుస్తున్నాయేమోనన్న అనుమానాలు నెలకొంటున్నాయి. సింధు ఈ పాయింట్స్ ను ఓ సారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అపార ప్రతిభ, చిన్న వయస్సులోనే అతిగొప్ప విజయాలు సాధించిన సింధు మరింత ఎత్తుకు ఎదగాలి అనేది అందరీ ఆకాంక్ష. కోరిక.