Story behind Special Jerseys In IPL: సాధారణంగా ఐపీఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీ ఒక్కో జెర్సీతో బరిలో దిగుతుంది. అయితే ఒక్కోసారి కొన్ని ఫ్రాంచైజీలు వాటి రెగ్యులర్ జెర్సీల్లో కాకుండా కొన్ని ప్రత్యేక జెర్సీలు ధరించి ప్రతి సీజన్‌లో ఓ మ్యాచ్ ఆడుతున్నాయి. గత కొన్ని సీజన్లుగా కొన్ని ఫ్రాంచైజీలు ఈ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నాయి. సమాజంలోని కొన్ని అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ స్పెషల్ జెర్సీల ముఖ్య ఉద్దేశం అని వారు చెబుతారు. మొట్టమొదటిశారి 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేసిన ఈ ప్రయోగాన్ని తరువాత చాలా టీమ్‌లు ఫాలో అయ్యాయి.
ముంబై ఇండియన్స్ అనగానే బ్లూ, చెన్నై సూపర్ కింగ్స్ అనగానే ఎల్లో జెర్సీలు టక్కున గుర్తు వస్తాయి. ఇవే కాదు ఒక్కో టీం ఒక్కో జెర్సీతో తన ఉనికిని చాటుకుంటుంది అని చెప్పచ్చు. అయితే ఐదు టీమ్స్ మాత్రం ప్రతి సీజన్‌లో ఒక మ్యాచ్‌ను స్పెషల్ జెర్సీలతో ఆడుతుంటాయి. అవి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉన్నాయి. ఈ సీజన్‌లో రీసెంట్గా రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఫుల్ పింక్ కలర్ జెర్సీ ధరించి బరిలోకి దిగింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్లేయర్లు స్పెషల్ జెర్సీ ధరించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: పర్యావరణ హితం కోరుతూ బెంగళూరు ప్లేయర్లు ఏదో ఒక మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీలో కనిపిస్తారు. ఈ సంప్రదాయాన్ని 2011లో ప్రారంభించారు. 'గో గ్రీన్' క్యాంపెయిన్‌కి సపోర్ట్‌గా ఈ జెర్సీ ధరించారు.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) 2023లో కోల్‌కతా ఫుట్‌బాల్ దిగ్గజం మోహన్ బగాన్ స్ఫూర్తితో గ్రీన్, మెరూన్ జెర్సీని ధరించింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో కూడా అదే జెర్సీతో బరిలో దిగింది. లక్నోసూపర్ జెయింట్స్ సహ యజమాని అయిన సంజీవ్ గోయెంకా గ్రూపునకు చెందినదే మోహన్ బగాన్ ఫుట్‌బాల్ క్లబ్.
ఢిల్లీ క్యాపిటల్స్: ఢిల్లీ క్యాపిటల్స్ పేరు 2018 వరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్. ఈ జట్టు 2015 సీజన్‌లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి లావెండర్ కలర్ ధరించింది. 2020 నుంచి ప్రతి సంవత్సరం లీగ్ గేమ్‌లలో ఓ మ్యాచ్‌కి రెయిన్‌బో థీమ్ జెర్సీని ధరిస్తోంది. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్న అంశానికి సంబంధించి, అలాగే JSW పెయింట్స్ బ్రాండ్ కోసం ఈ కలర్ జెర్సీని వినియోగిస్తున్నారు..
గుజరాత్ టైటాన్స్: గుజరాత్ టైటాన్స్ (GT)ది నేవిబ్లూ కలర్ జెర్సీని సెలక్ట్ చేసుకుంది. అయితే 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి హోమ్ గేమ్ లో లావెండర్ కిట్‌ను ఎంచుకుంది. క్యాన్సర్ రోగులు, ఆ మహమ్మారి నుంచి ప్రాణాలతో బయటపడినవారికీ, వారి కుటుంబాలకు మద్దతుగా ఈ జెర్సీని ధరించింది.
రాజస్థాన్ రాయల్స్: రాజస్థాన్ రాయల్స్ (RR) 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ జెర్సీలో పింక్ కలర్ యాడ్ చేసింది. తాజాగా ఐపిఎల్ 17 వ సీజన్ లో ఆటగాళ్లు తమ బ్లూ-పింక్ జెర్సీకి బదులుగా ఆల్-పింక్ జెర్సీలో మైదానంలోకి వచ్చారు. రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సంఘీభావం తెలిపేందుకు రాయల్స్ ఈ ప్రత్యేక జెర్సీని ధరించింది. ఈ మ్యాచ్‌లో విక్రయించే ప్రతి టిక్కెట్టు నుంచి రూ.100 మహిళల అభివృద్ధికి విరాళంగా ఇవ్వటానికి, మ్యాచ్‌లో ప్రతి సిక్స్‌కి రాజస్థాన్‌లోని ఆరు ఇళ్లకు సౌరశక్తిని అందించటానికి నిర్ణయించుకున్నారు.