ICC Punishment: అంపైర్లను దూషించిన ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయర్- ఐసీసీ కన్నెర్ర
IPL 2025 Cricket news: అంపైర్లతో అసభ్యంగా ప్రవర్తించినందుకుగాను ఇంటర్నేషనల్ క్రికెటర్ పై ఐసీసీ కొరడా ఝులిపించింది. జరిమానాతో హెచ్చరికలు జారీ చేసింది.
Alzarri Joseph News: అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ఐపీఎల్ అన్ సోల్డ్ అంతర్జాతీయ క్రికెటర్ పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కన్నెర్ర చేసింది. ఈ సంఘటన ఆదివారం జరుగగా తాజాగా దీనిపై ఐసీసీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటన సెయింట్స్ కిట్స్ తో వెస్టిండీస్- బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డే సందర్భంగా జరిగింది. ఐసీసీ ఆగ్రహానికి గురైన ఆ ప్లేయర్ మరెవరో కాదు. విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్. మైదానంలో వికెట్ల వేటతో చెలరేగి పోయే జోసెఫ్.. ఆదివారం మాత్రం తన నోరు అదుపులో పెట్టుకోలేక అపెక్స్ కౌన్సిల్ చేతికి చిక్కాడు. ఆదివారం మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
గొడవ జరిగిందిలా..
మ్యాచ్ మరికాసేపట్లో మొదలవుతుందనగా, జోసెఫ్ స్పైక్స్ ఉన్న బూట్లు ధరించి, పిచ్ పై నడిచాడు. దీనిపై అంపైర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీనిపై రెచ్చిపోయిన జోసెఫ్ తిట్లదండకం అందుకున్నాడు. దీంతో ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో దృష్టికి తీసుకెళ్లారు ఆన్ ఫీల్డు అంపైర్లు అంపైర్లు కుమార్ ధర్మసేన, లెస్సీ రీఫర్, థర్డ్ అంపైర్ ఆసిఫ్ యాకూబ్, ఫోర్త్ అంపైర్ గ్రెగరీ బ్రాత్ వైట్. దీనిపై విచారణ జరిపిన రిఫరీ.. ఐసీసీ ప్రవర్తన నియామవళిలోని ఆర్టికల్ 2.3ని అతిక్రమించినట్లు తేల్చారు. ఈ ఆర్టికల్ ప్రకారం ఎవరైన ప్లేయర్.. తోటి ప్లేయర్లు, మ్యాచ్ అధికారలపై అభ్యంతరకరమైన భాష వాడితే నేరంగా పరిగణిస్తారు. విచారణలో తన నేరాన్ని జోసెఫ్.. అంగీకరించడంతో అతనికి ఒక డీమెరిట్ పాయింట్ ను కేటాయించారు. గత రెండేళ్లలో అతను అందుకున్న రెండో డీ మెరిట్ పాయింట్ కావడం గమనార్హం. జోసెఫ్ ఇలాగే వ్యవహరిస్తే త్వరలోనే అతనిపై ఒకటి లేదా రెండు మ్యాచ్ ల నిషేధం పడే అవకాశం ఉంటుంది.
జోసెప్ తగ్గిన ఆసక్తి..
గతనెలలో ముగిసిన ఐపీఎల్ వేలంలో పేసర్ జోసెఫ్ పట్ల ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో అతను అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. ఇక ఈ సారి చాలామంది ధనాధన్ ప్లేయర్లు అందుబాటులోకి రావడంతో జట్టు కోట్లు కుమ్మరించాయి. భారత డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రూ.27 కోట్లతో టోర్నీలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తనను దక్కించుకుంది. రూ.26 కోట్లకుపైగా ధరతో శ్రేయస్ అయ్యర్ రెండో అత్యధిక ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు. తనను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దక్కించుకుంది.
మరోవైపు బంగ్లాదేశ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను విండీస్ కైవసం చేసుకుంది. తొలి వన్డేలో రూథర్ ఫర్డ్ తొలిసెంచరీతో సత్తా చాటడంతో భారీ లక్ష్యాన్ని విండీస్ సునాయాసంగా ఛేదించింది అలాగే మంగళవారం జరిగిన రెండో వన్డేలో నూ విండీస్ ఏడు వికెట్లతో గెలుపొందింది. తొలుత బంగ్లా 227 పరుగులకు ఆలౌటవగా, తర్వాత ఛేదనలో 230/3తో విండీస్ గెలుపొందింది. బ్రాండన్ కింగ్ 82 పరుగులతో సత్తాచాటాడు. ఇప్పటికే సిరీస్ ఫలితం తేలిపోగా, ఇరుజట్ల మధ్య అప్రధాన్యమైన మూడో వన్డే ఈనెల 12న గురువారం బేస్ టేర్ వేదికగా జరుగుతుంది.
Also Read: Shaheen Afridi: హిస్టరీ క్రియేట్ చేసిన ఆఫ్రిదీ.. పాక్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక మొనగాడు