IPL 2024: మరో అరుదైన ఘనత సాధించిన కోహ్లీ, ఏకంగా 12 వేల పరుగులు
Virat Kohli : టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ 2024లో తొలి మ్యాచులో ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. టీ20 క్రికెట్‌లో 12000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
తొలి మ్యాచ్ ఇలా జరిగింది
ఐపీఎల్ 2024ను చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ప్రారంభించింది. చెపాక్ మైదానంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ అనుజ్ రావత్ (48: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అత్యధిక పరుగులు సాధించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రచిన్ రవీంద్ర (37: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాలుగు వికెట్లు తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
కోహ్లీ టీ 20 ప్రపంచకప్‌కు అవకాశమిదే
టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్(T20 World Cup) సెమీ ఫైనల్‌లో భారత జట్టు ఓడిపోయిన తర్వాత.. విరాట్ టీమ్ఇండియా తరుపున ఒక్క టీ20 మ్యాచ్ లోనూ కోహ్లీ రాణించలేదు. దీంతో పొట్టి క్రికెట్‌కు విరాట్ వీడ్కోలు పలికినట్లేనని.. అతడి స్థానంలో మరో ఆటగాడి ఎంపికపై అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే విరాట్ పొట్టి ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేందుకు ఓ అవకాశం ఉంది అదే ఐపీఎల్. బెంగళూరు తరపున బరిలోకి దిగుతున్న కోహ్లీ మరోసారి విశ్వరూపం చేస్తే పొట్టి ప్రపంచకప్‌లో విరాట్ స్థానం పదిలమే.
పాక్ క్రికెటర్ ఏమన్నాడంటే..?
కోహ్లీని టీ 20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకపోతే అంతకన్నా పిచ్చి నిర్ణయం ఇంకోటి ఉండదని పాక్ క్రికెటర్ మహమ్మద్ ఇర్పాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ను తీసుకోవద్దని చెప్పేవారంతా గల్లీ క్రికెట్ ఆడిన వారేనని కూడా విమర్శించాడు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ విధ్వంసాన్ని చూడలేదా అని నిలదీశాడు. భారత్‌కు కొన్ని మ్యాచుల్లో విరాట్ ఒంటిచేత్తో విజయాలు అందించిన విషయాన్ని గుర్తు చేశాడు. కోహ్లీని వచ్చే టీ20 ప్రపంచ కప్‌లోనూ జట్టులోకి తీసుకోవాలని.. భారత జట్టుకు కోహ్లీ అతిపెద్ద ఆస్తి అని ఇర్ఫాన్ అన్నాడు. కోహ్లీ ఉంటే మానసికంగా భారత్ పైచేయి సాధిస్తుందని కూడా అన్నాడు. విమర్శలు చేసేవారంతా గత ప్రపంచ కప్‌ను గమనించాలని కూడా ఇర్ఫాన్ వెల్లడించాడు. కోహ్లీ లేకపోతే భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భారత్ లీగ్ స్టేజ్‌లోనే కనీసం 4 మ్యాచ్‌ల వరకు ఓడిపోయేదిన్నాడు .