Rajasthan Royals: క్యాపులు వచ్చాయ్ - కానీ కప్పు రాలేదు - 2016 సీన్ రిపీట్!
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ గెలుచుకున్నా కప్‌ను గుజరాత్‌కు కోల్పోయింది.
ఈ సంవత్సరం ఐపీఎల్‌ను కొత్త టీమ్ గుజరాత్ గెలుచుకుంది. ఫైనల్లో రాజస్తాన్‌ను 130 పరుగులకే పరిమితం చేసిన గుజరాత్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్‌ది టోర్నమెంట్ అంతా డిఫరెంట్ స్టోరీ. ఓపెనర్ జోస్ బట్లర్ ఈ సీజన్‌లో 863 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.
2016 సీన్ రిపీట్..
ఐపీఎల్ చరిత్రలోనే ఒక్క సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ బట్లర్. 2016లో విరాట్ కోహ్లీ చేసిన 973 పరుగులే ఇప్పటికీ హయ్యస్ట్‌గా ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తూ అప్పుడు విరాట్ కోహ్లీ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా రన్నరప్‌గానే నిలిచింది. అప్పుడు విరాట్ కోహ్లీ, ఇప్పుడు జోస్ బట్లర్ ఇద్దరూ నాలుగు సెంచరీలే చేయడం కూడా పూర్తిగా యాదృచ్చికం.
బౌలింగ్‌లో కూడా..
ఇక బౌలింగ్‌లో కూడా రాజస్తాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సత్తా చాటాడు. 17 మ్యాచ్‌ల్లో 27 వికెట్లను దక్కించుకున్నాడు. ఒక సీజన్‌లో స్పిన్నర్ ఇన్ని వికెట్లు తీయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటి సారి. రెండో స్థానంలో వనిందు హసరంగ (26 వికెట్లు - ఐపీఎల్ 2022), మూడో స్థానంలో ఇమ్రాన్ తాహిర్ (26 వికెట్లు - ఐపీఎల్ 2019) ఉన్నారు.
సమిష్టిగా ఆడిన రాజస్తాన్
గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే... హార్దిక్ పాండ్యా (487 పరుగులు), శుభ్‌మన్ గిల్ (483 పరుగులు), డేవిడ్ మిల్లర్ (481 పరుగులు) ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. అత్యధిక వికెట్లు తీసిన వారిలో మహ్మద్ షమీ (20 వికెట్లు), రషీద్ ఖాన్ (19 వికెట్లు) ఆరు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. అంటే సమిష్టి కృష్టి కారణంగా గుజరాత్ కప్ గెలిచిందన్న మాట.
రాజస్తాన్ ఆటగాళ్లు వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనపరిచినా... జట్టుగా సరిగ్గా ఆడలేకపోయారు. బాగా ఆడేవారికి సరైన సహకారం అందించలేకపోయారు. అందుకే గుజరాత్ మొదటిసారి కప్ ఎత్తగలిగింది.
View this post on Instagram