Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala Death: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా గురుగ్రామ్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. చౌతాలా హర్యానా ముఖ్యమంత్రిగా ఐదుసార్లు పని చేశారు.
Om Prakash Chautala: ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) చీఫ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా(89 ఏళ్లు) శుక్రవారం (డిసెంబర్ 20) కన్నుమూశారు. ఐదుసార్లు హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేసిన చౌతాలా గురుగ్రామ్‌లోని తన ఇంటిలో గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యులు ఆయన్ని రక్షించుకోలేకపోయారు.
1989 డిసెంబర్ 2న తొలిసారి సీఎం అయ్యి 171 రోజుల పాటు పదవిలో కొనసాగారు. తర్వాత 12 జలై 1990న మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1991 మార్చి 22న చౌతాలా మరోసారి సీఎం అయ్యారు. అప్పుడు కూడా కేవలం 15 రోజుల పాటు సీఎంగా కొనసాగారు. మళ్లీ 24 జులై 1999న ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చొని 2 మార్చి 2000 వరకు కొనసాగారు. తర్వతా మళ్లీ సీఎంగా ఎన్నికపై తొలిసారి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. 2005 వరకు సీఎంగా ఉన్నారు.
సీఎం నాయబ్ సింగ్ సైనీ సంతాపం
మాజీ ముఖ్యమంత్రి మృతి పట్ల నాయబ్ సింగ్ సైనీ సంతాపం వ్యక్తం చేశారు. "ఐఎన్‌ఎల్‌డి అధినేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి ఓం ప్రకాష్ చౌతాలా మరణం చాలా బాధాకరం. ఆయనకు నా నివాళులు. ఆయన జీవితాంతం రాష్ట్రానికి, సమాజానికి సేవ చేశారు. ఇది దేశ రాజకీయాలకు తీరని లోటు. ఆయనకు భగవంతుడు శ్రీరాముని పాద పద్మాలలో స్థానం కల్పించాలని కోరుతున్నా.
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ,"హర్యానా మాజీ ముఖ్యమంత్రి, INLD చీఫ్ ఓం ప్రకాష్ చౌతాలా మరణించారనే బాధాకరమైన వార్త అందింది. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సహకారం ఎల్లప్పుడూ గుర్తుంటుంది. ఈ దుఃఖ సమయంలో వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి ఓం ప్రకాష్ చౌతాలా మృతి చెందారనే వార్త బాధాకరమని, ఆయనతో సన్నిహిత సంబంధం ఉందని కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడా అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు."
తండ్రి దేవిలాల్ డిప్యూటీ పీఎం
ఓం ప్రకాష్ చౌతాలా తండ్రి చౌదరి దేవిలాల్ హర్యానాకు రెండుసార్లు సీఎంగా పని చేశారు. 1977 జూన్ 21న తొలిసారిగా సీఎం అయ్యి దాదాపు రెండేళ్లపాటు, 1987 జూన్ 20న సీఎం అయ్యి 165 రోజులు పాలించారు. దేవిలాల్ రెండుసార్లు ఉప ప్రధానిగా కూడా దేశానికి సేవలు అందించారు. నవంబర్ 1990 నుంచి జూన్ 1991 వరకు ఒకసారి, డిసెంబర్ 1989 నుంచి ఆగస్టు 1990 వరకు రెండోసారి ఆ పదవిలో ఉన్నారు.
రాజకీయాల్లో చౌతాలా కుటుంబం మూడో తరం
చౌతాలా కుటుంబంలోని మూడో తరం ప్రస్తుతం హర్యానా రాజకీయాల్లో ఉంది. అయితే ఆ కుటుంబం రెండుగా విడిపోయింది. ఓపీ చౌతాలా కుమారుడు అజయ్ సింగ్ చౌతాలా జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)ని పెట్టుకున్నారు. మరో కుమారుడు అభయ్ సింగ్ చౌతాలా ఓపీ చౌతాలాతో ఉన్నారు. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి.
బీజేపీతో కలిసి ఐదేళ్లు అధికారంలో ఉన్న జేజేపీ ఒక్క సీటులోనైనా విజయం సాధించలేకపోయింది. ఐఎన్‌ఎల్‌డీ మాత్రం 2సీట్లు గెలుచుకుంది. రానియా నుంచి అర్జున్ చౌతాలా గెలిచారు. ఈ ఎన్నిక్లలో ఓపీ చౌతాలా ప్రచారం కూడా చేశారు. దబ్వాలీ సీటు నుంచి ఆదిత్య దేవిలాల్ విజయం సాధించారు. దుష్యంత్ చౌతాలా మాత్రం ఓడిపోయారు.