IPL 2025 Operation Sindoor Effect: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ల తరలింపు..! ముంబై, ఢిల్లీతో వేదికల మార్పు!!
ఆపరేషన్ సింధూర్ కారణంగా ఐపీఎల్ లోని కొన్ని మ్యాచ్ ల వేదిక మారనుంది. ఇప్పటికే దీనిపై స్పష్టమైన ప్రకటన చేసిన ఐపీఎల్ యాజమాన్యం.. తాజాగా మరో మ్యాచ్ కోసం మల్లగుల్లాలు పడుతోంది.

IPL 2025 PBKS VS DC Match Will Shift: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ ఐపీఎల్ పై పడింది. టోర్నీలోని కొన్ని మ్యాచ్ లను రీ షెడ్యూల్ చేస్తున్నారు. ఇప్పటికే ధర్మశాలలో ఈనెల 11 నుంచి జరిగే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ను ముంబైకి షిఫ్ట్ చేసిన ఐపీఎల్ యాజమాన్యం.. గురువారం పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను కూడా షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం చేపట్టిన వైమానిక దాడుల వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పంజాబ్ కు రెండో హోం గ్రౌండ్ గా పరిగణిస్తున్న ధర్మశాల.. ఇరు దేశాల బార్డర్ కు దగ్గరగా ఉంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అక్కడ జరిగే మ్యాచ్ లను బీసీసీఐ వేరే చోటికి తరలిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 11 నగరాల్లో విమనాయాన సేవలను నిలిపి వేయడంతో అందులో ధర్మశాల కూడా ఉండటంతో మ్యాచ్ లను తరలిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర, వాయువ్య, సెంట్రల్ ఇండియాలోని కొన్ని విమనాశ్రయాలను ఈనెల 10 వరకు మూసివేశారు. అందులో ధర్మశాలతోపాటు శ్రీనగర్, జమ్మూ, అమృత్ సర్, లేహ్, చండీగఢ్, బికనేర్, జోధ్ పూర్, గ్వాలియర్, కిషన్ గఢ్, రాజకోట్ తదితర నగరాలున్నాయి.
మిగతా మ్యాచ్ లు వేరే చోట..
టోర్నీలో ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడిన పంజాబ్.. చేతిలో ఇంకా మూడు మ్యాచ్ లు ఉన్నాయి. అందులో రెండు మ్యాచ్ లు హోం గ్రౌండ్ అయిన ధర్మశాలలో నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటికే ముంబై-పంజాబ్ మ్యాచ్ ను తరలించిన బోర్డు.. గురువారం జరిగే ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ ను కూడా వేరే చోట నిర్వహించే అవకాశముంది. ఇక ఆఖరిదైన రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ జైపూర్ లో జరగనుండటం, ఇక్కడ విమానయాన సర్వీసులకు ఎలాంటి ఢోకా లేకపోవడంతో అనుకున్నట్లుగా ఇక్కడ మ్యాచ్ జరిగే అవకాశముంది. ఇక టోర్నీలో 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు పంజాబ్ చేరువగా ఉంది. మరొక్క విజయం సాధిస్తే దాదాపుగా నాకౌట్ కు చేరుకుంటుంది. 10 ఏళ్ల తర్వాత పంజాబ్ 14 పాయింట్లకు పైగా సాధించడం ఈ సీజన్ లో ఇదే తొలిసారి కావడం విశేషం.
ఉగ్రవాదానికి చెక్ పెట్టేందుకు..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత బలగాలు పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాదుల 9 కీలక స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేశాయి. ఏప్రిల్ 22న జరగిన పహాల్గంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఉగ్రవాదుల స్థావరాలపై ఆకస్మిక దాడులు చేసింది. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో ఏకంగా 176 మంది ప్రాణాలు కోల్పోగా, 600 మంది పైగా గాయపడ్డారు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందారు. ఇందులో ఓ నేపాల్ టూరిస్ట్ ఉన్నారు. ఉగ్రదాడులకు ప్రతీకారంగా తాజాగా భారత్ ఈ వైమానికి దాడులు చేపట్టింది.




















