PBKS vs RR IPL 2024 Rajasthan Royals won by 3 wkts: పంజాబ్(PBKS)తో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR) విజయం సాధించింది. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో చివరి వరకూ విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. పిచ్ బౌలర్లకు అనుకూలించిన వేళ.. ప్రతీ పరుగుకు ఇరు జట్లు శ్రమించాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. రాజస్థాన్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో అషుతోష్ శర్మ ఒక్కడే 30 పరుగుల మార్క్‌ను దాటాడు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్... చివరి ఓవర్‌లో విజయం సాధించింది. యశస్వీ జైస్వాల్ 39 పరుగులతో రాణించాడు. చివరి ఓవర్‌లో విజయానికి రాజస్థాన్‌కు పది పరుగులు కావాల్సి ఉండగా హెట్‌మెయిర్ మరో బంతి మిగిలి ఉండగానే పని పూర్తి చేశాడు.
కట్టుదిట్టంగా రాజస్థాన్ బౌలింగ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం సరైందే అని కాసేపటికే అర్థమైంది. 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. అధర్వను అవుట్ చేసి ఆవేశ్‌ఖాన్... పంజాబ్‌కు తొలి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 15 పరుగులు చేసి అథర్వ, 15 పరుగులు చేసి జానీ బెయిర్ స్టో పెవిలియన్‌కు చేరారు. జానీ బెయిర్ స్టోను కేశవ్ మహరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రభ్‌సిమ్రన్‌సింగ్ 10, కెప్టెన్ శామ్ కరణ్ ఆరు, జితేశ్ శర్మ 29, గత మ్యాచుల్లో రాణించిన శశాంక్ సింగ్ 9 త్వరత్వరగా పెవిలియన్ చేరారు.
జితేశ్ శర్మ 29 పరుగులతో పర్వాలేదనిపించాడు. కానీ మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. పిట్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండడంతో... రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పరుగులు రాకపోవడంతో పంజాబ్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడక తప్పలేదు. చివర్లో అషుతోష్ శర్మ బ్యాట్ ఝుళిపించడంతో పంజాబ్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. అషుతోష్ శర్మ 11 బంతుల్లో ఒక ఫోరు, మూడు సిక్సులతో 31 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్ల ధాటికి పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు, ఆవేశ్ ఖాన్ రెండు, కుల్దీప్ సేన్, చాహల్ చెరో వికెట్ తీశారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్ బౌలర్లు సత్తా చాటి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మారుస్తారేమో చూడాలి.
లక్ష్య ఛేదన కష్టంగానే..
148 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు కష్టాలు తప్పలేదు. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకూ మ్యాచ్ సాగింది. 147 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని రాజస్థాన్ 7 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. తొలి వికెట్‌కు యశస్వీ జైస్వాల్, తనుష్ 56 పరుగులు జోడించడంతో మ్యాచ్ ఏకపక్షంగానే కనిపించింది. కానీ పంజాబ్ బౌలర్లు పుంజుకున్నారు. వరుసగా వికెట్లు తీస్తూ రాజస్థాన్‌ను కష్టాల్లోకి నెట్టారు.
యశస్వీ జైస్వాల్ 39 పరుగులు, తణుష్ 24, రియాన్ పరాగ్ 23 పరుగులతో పర్వాలేదనిపించారు. చివరి ఓవర్‌లో ఆరు బంతుల్లో పది పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి రెండు బంతులను అర్ష్‌దీప్ సింగ్ బాగానే వేశాడు. ఆరెండు బంతుల్లో పరుగులేమీ రాకపోవడంతో నాలుగు బంతుల్లో పది పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో హెట్‌మెయిర్ డబుల్, సిక్స్, ఫోర్‌తో ఇన్నింగ్స్‌ను ముగించాడు. హెట్‌మయర్ 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 27 పరుగులతో మెరుపులు మెరిపించి జట్టును గెలిపించాడు.