Will Dhoni Play In IPL 2025: వచ్చే ఏడాది ఐపీఎల్‌లో మహీ మళ్లీ ఆడతాడా
MS Dhoni: వచ్చే సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్‌గానైనా ధోనీ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మేము కూడా ఆ నమ్మకంతోనే ఉన్నామని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ చెప్పారు.
IPL 2024: గత మూడు, నాలుగు సీజన్ల నుంచి ఐపీఎల్‌లో ఎక్కువగా ప్రస్తావన కొచ్చిన అంశం ధోనీ రిటైర్‌మెంట్. గత సీజన్, ఈ సీజన్లలో ఈ చర్చ తారస్థాయికి చేరింది. ధోనీ రిటైరై పోతాడని గత సీజన్ వలే ఈ సీజన్ లో కూడా అందరూ అనుకున్నారు. దీనిపై చర్చోపచర్చలు ఎన్నో నడిచాయి. కానీ చివరికి ఏ క్లారిటీ లేకుండానే సీఎస్‌కే లీగ్ దశలోనే తన ప్రయాణం ముగించింది.. ధోనీ రాంచీకి వెళ్లిపోయాడు. అయినా ధోనీ రిటైర్ మెంట్ పై చర్చ ఆగట్లేదు.
చేతిలో ఉన్న అవకాశాలను ఆర్ సీ బీ కి ఇచ్చి..
2024 ఐపీఎల్ చెన్నైకు అంతగా కలసి రాలేదు. ముందే దాదాపు కన్ఫర్మ్ అయిపోయిన ప్లే ఆఫ్ బెర్తును అనూహ్యంగా బెంగుళూరు లాగేసుకుంది. ఇప్పటి వరకూ 15 ఐపీఎల్ లు ఆడిన సీఎస్ కే 5సార్లు కప్ గెలిచింది. ఈ సీజన్ తో కలిపి కేవలం 3 సార్లే ప్లే ఆఫ్స్ కి ముందే.. అంటే లీగ్ దశలోనే నిష్క్రమించింది. అయితే ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ పోరాటం అనూహ్యంగా ముగిసింది. అంతా తమకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో చేజేతులా టీమ్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను బెంగుళూరు చేతిలో పెట్టి అవమానకర రీతిలో ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఆ అవమాన భారంతో ఆర్‌సీబీతో మ్యాచ్ ఓడిన అనంతరం ధోనీ కనీసం ప్లేయర్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా గ్రౌండ్ వీడాడు. దీంతో ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడని, మళ్లీ సీఎస్ కే జెర్సీతో గ్రౌండ్ లో కనిపించడనీ కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతా ఆ రోజే గుడ్ బై చెబుతాడు అనుకున్నారు
చెపాక్ వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మ్యాచ్ పూర్తైన అనంతరం ఫ్యాన్స్ ఎవ్వరూ స్టేడియం వదిలి వెళ్లొద్దని సీఎస్‌కే ముందుగానే కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీంతో ధోనీ క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడని అందరూ భావించారు. ధోనీకి సెండాఫ్ ఇచ్చేందుకే ఫ్యాన్స్ అందర్నీ ఉండమన్నారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. స్టేడియం మొత్తం కలియదిరిగిన సీఎస్‌కే ప్లేయర్లు అభిమానులకు క్రికెట్ బాల్స్ గిప్ట్ చేశారు. ఆర్ సీ బీ తో ఆ మ్యాచ్ గెలిచి, ప్లే ఆఫ్స్‌కి చేరి, చెన్నై కప్ కొడుతుందని అందరూ భావించగా లీగ్ దశలోనే పోరాటం ముగించి ఆ జట్టు ఇంటి బాట పట్టింది. ఇక అంతా అయిపోయింది. ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడని అందరూ అంటోన్న నేపథ్యంలో.. చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ దీనిపై కీలక అప్ డేట్ ఇచ్చారు.
మళ్లీ ఆడతాడనే ఆశగా ఉన్నాం - కాశీ విశ్వనాథన్
‘‘ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ధోనీ.. ఇంతవరకూ చెప్పలేదు. జట్టుతో దీని గురించి మాట్లాడలేదు. తన నిర్ణయాన్ని బయట పెట్టలేదు. ధోనీకి దీనికోసం కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నాం. ధోనీ నిర్ణయాల్లో టీమ్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఈ సీజన్ లో ధోనీ ఫిట్ గా కనిపించాడు. బ్యాటింగ్, వికెట్‌కీపింగ్ లో ఇబ్బంది పడలేదు. ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వచ్చే సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా నైనా ధోనీ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ తో పాటు మేము కూడా ధోనీ 2025 ఐపీఎల్ లో కూడా చెన్నై తరఫున ఆడతాడనే నమ్మకంతో ఉన్నాం. కానీ దానికి ఇంకా చాలా టైముంది. ధోనీ నిర్ణయం కోసం వేచి చూద్దాం’’ అని కాశీ విశ్వనాథన్ టీమ్ పోస్ట్ చేసిన ఓ వీడియోలో వెల్లడించారు.
రిటైరయితే చెన్నైలోనే అన్నాడుగా.. అంటే..
ఆర్ సీ బీ తో చివరి లీగ్ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే ధోనీ జట్టును వీడాడు. ఐ పీ ఎల్ కోసం రెండు నెలలుగా బిజీగా ఉన్న ధోనీ మ్యాచ్ తరువాత స్వస్థలం రాంచీకి వెళ్లిపోయాడు. తన రిటైర్ మెంట్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా.. ఇవేమీ పట్టించుకోకుండా రాంచీ వీధుల్లో బైక్ పై ఛిల్ అవుతూ కనిపించాడు. వచ్చే ఏడాది కనీసం ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్ గా అయినా ఆడతాడని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఇప్పటికే అభిమానుల కోసం మితిమీరిన క్రికెెట్ ఆడి తన ఆరోగ్యం పాడు చేసుకున్న ధోనీ.. వచ్చే ఏడాది ఫిట్ నెస్ సాధించి తిరిగి ఐపీఎల్ ఆడతాడో.. లేదో వేచి చూడాల్సి ఉంది. నేను రిటైర్ మెంట్ తీసుకుంటే అది చెన్నైలోనే అని గతలో ధోనీ చెప్పాడు. దీన్ని బట్టీ చూస్తే.. ధోనీ వచ్చే సీజన్ కూడా ఆడతాడనే అందరికీ అనిపిస్తుంది.