Cyclone Effect In Andhra Pradesh: బంగాళాఖాతంలో తుపాను ముప్పు: ఏపీలో భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో మరింత అప్రమత్తత!
Cyclone Effect In Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి వచ్చే సోమవారం నాటికి తుపానుగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది..

Cyclone Effect In Andhra Pradesh: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ- వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం నాటికి ఆగ్నేయ, దాని పక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని తెలిపారు. ఇది ఆదివారం నాటికి తీవ్రవాయుగుండంగా రూపంతరం చెందుతుందని పేర్కొన్నారు. ఇది సోమవారం ఉదయానికి నైరుతి, దానికి పక్కనే ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు..
దీని ప్రభావంతో ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆదివారం భారీ నుంచి అతిభారీవర్షాలు, సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ, విపత్తుల నిర్వహణ సంస్థల అధికారులు హెచ్చరిస్తున్నారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతప్రజలు అలెర్ట్ గా ఉండాలన్నారు. తుపాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేసారు.
ఈ జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి..
రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ వివరించారు.
శనివారం(25-10-25) :
• కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఆదివారం(26-10-25) :
• గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు, కడప, అన్నమయ్య, చిత్తూరు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
సోమవారం(27-10-25) :
• కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షం..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలకు బయటకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. శుక్రవారం కురుసిన వర్షపాతం వివరాలు విపత్తుల సంస్థ అధికారి ప్రఖర్ జైన్ వెల్లడించారు.
శుక్రవారం రాత్రి 7 గంటలకు కోనసీమ(జి) అమలాపురంలో 63మిమీ, ఏలూరు (జి) తదువైలో 59మిమీ, అల్లూరి(జి) బుట్టాయగూడెంలో 55మిమీ, కృష్ణా(జి) మచిలీపట్నంలో 55మిమీ, నంద్యాల (జి) రంగాపురంలో 48మిమీ, కడప (జి) బద్వేల్ లో 44.7మిమీ వర్షపాతం నమోదైందన్నారు.





















