MI Vs GT Highlights: రషీదు - కొట్టింది చాల్లేదు - కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై ముంబై విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తొమ్మిది వికెట్లతో ఓటమి పాలైంది.
Mumbai Indians vs Gujarat Titans: ఐపీఎల్ 2023 సీజన్ 56వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (103 నాటౌట్: 49 బంతుల్లో, 11 ఫోర్లు, ఆరు సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. జట్టులో అతనే అత్యధిక స్కోరర్. ఇక గుజరాత్ బ్యాటర్లలో రషీద్ ఖాన్ (79 నాటౌట్: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, పది సిక్సర్లు) అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించాడు. కొంచెం ముందు బ్యాటింగ్‌కు దిగితే మ్యాచ్‌ను గెలిపించేవాడేమో.
219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (6: 9 బంతుల్లో), వృద్ధిమాన్ సాహా (2: 5 బంతుల్లో), హార్దిక్ పాండ్యా (4: 3 బంతుల్లో, ఒక ఫోర్) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో గుజరాత్ 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
విజయ్ శంకర్ (29: 14 బంతుల్లో, ఆరు ఫోర్లు) కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అభినవ్ మనోహర్ (2: 3 బంతుల్లో), రాహుల్ తెవాటియా (14: 13 బంతుల్లో, ఒక ఫోర్) కూడా విఫలం అయ్యారు. డేవిడ్ మిల్లర్ (41: 26 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) కూడా మెరుపులు మెరిపించాడు కానీ క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో 100 పరుగులకే గుజరాత్ ఏడు వికెట్లు కోల్పోయింది. భారీ ఓటమి ఖాయం అనుకున్నారంతా.
కానీ ఈ దశలో రషీద్ ఖాన్ (79 నాటౌట్: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, పది సిక్సర్లు) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. సిక్సర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. లక్ష్యం ఎక్కువైనా ఒత్తిడికి లోను కాకుండా ఆడాడు. కానీ రషీద్ వేగం సాధించాల్సిన రన్‌రేట్‌ను మ్యాచ్ చేయలేదు. దీంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 191 పరుగులకు పరిమితం అయింది. రషీద్‌కు తోడుగా మరొక్క బ్యాటర్ ఉన్నా, మరి కొన్ని బంతులు మిగిలినా రషీద్ ఖచ్చితంగా మ్యాచ్‌ను గెలిపించేవాడు.
టార్గెట్ పెట్టినా.. ఛేజ్ చేసినా.. ముంబయి ఇండియన్స్ ఒకే ఫార్ములా అనుసరిస్తోంది! దొరికిన బంతిని దొరికినట్టే బౌండరీ పంపించాలని కంకణం కట్టుకుంది. గుజరాత్ పైనా అలాగే ఆడింది. పవర్‌ప్లే ముగిసే సరికే వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (31: 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (29; 18 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అమేజింగ్ పాట్నర్‌షిప్ అందించారు. ఏడో ఓవర్లో వీరిద్దరినీ రషీద్ ఖాన్ ఔట్ చేసి బ్రేకిచ్చాడు. నేహాల్ వధేరా (15: 7 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)నూ అతడే పెవిలియన్‌కు పంపించాడు. అప్పటికి స్కోరు 88. ఆ తర్వాతే అసలు ఊచకోత మొదలైంది.
సూర్యకుమార్ యాదవ్ (103 నాటౌట్: 49 బంతుల్లో, 11 ఫోర్లు, ఆరు సిక్సర్లు), విష్ణు వినోద్ (30: 20 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించారు. నాలుగో వికెట్‌కు 42 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆడిన ప్రతి ఓవర్లోనూ పది పరుగుల చొప్పున సాధించారు. దాంతో ముంబయి 10.6 ఓవర్లకే 100కు చేరుకుంది. సూర్యాభాయ్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. రషీద్ బౌలింగ్‌లో విష్ణు వినోద్ ఔటయ్యాక తనలోని ఉగ్రరూపాన్ని బయటకు తీసుకొచ్చాడు. క్రీజుకు అటూ.. ఇటూ కదులుతూ ప్రతి బౌలర్‌నూ వణికించాడు. 18.6 ఓవర్లకు స్కోరును 218కి చేర్చాడు. ఆఖరి ఓవర్‌కు ముందు 87తో నిలిచిన అతడు.. ఆఖరి మూడు బంతుల్ని 6, 2, 6గా మలిచి తొలి సెంచరీ కిరీటం ధరించాడు. 49 బంతుల్లోనే ఈ ఘనత అందుకొని స్కోరును 218/5కు చేర్చాడు.