IPL 2024: మెరిసిన అయ్యర్, సాల్ట్ - బెంగళూరు ముందు భారీ టార్గెట్
KKR vs RCB: కోల్‌కతాతో పోరులో బెంగళూరు టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కి దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.
Royal Challengers target 223: బెంగళూరు(RCB)తో జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా(KKR) జట్టు భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో.... ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్ అయ్యర్ అర్థ సెంచరీతో రాణించాడు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కోల్‌కతాకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 14 బంతుల్లోనే 48.... పరుగులు చేశాడు. సునీల్ నరైన్, రఘువంశి, వెంకటేశ్ అయ్యర్ నిరాశపరిచారు. చివర్లో రస్సెల్, రమన్‌ధీప్ సింగ్ విజృంభించడంతో కోల్‌కతా భారీ స్కోరు చేసింది. బెంగళూరు బౌలింగ్‌లో యశ్ దయాల్, గ్రీన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
బ్యాటింగ్ సాగిందిలా..
గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన సునీల్ నరైన్ ఈ మ్యాచ్‌లో పరుగుల కోసం ఇబ్బంది పడ్డాడు. కానీ మరోవైపు సాల్ట్ దూకుడుగా ఆడాడు. సాల్ట్ యశ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదాడు. నాలుగో ఓవర్‌లో ఫెర్గూసన్‌కు సాల్ట్ చుక్కలు చూపించాడు. ఈ ఓవర్‌లో సాల్ట్ నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదేశాడు. 6, 4, 4, 6, 4, 4 తో ఫెర్గూసన్ బౌలింగ్‌లో సాల్ట్ బీభత్సం సృష్టించాడు. సాల్ట్ బాదుడుతో కోల్‌కతా స్కోరు 4 ఓవర్లకు 55 పరుగులకు చేరింది. 14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 పరుగులు చేసి సాల్ట్ ఔటయ్యాడు. సిరాజ్ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి పటీదార్ చేతికి సాల్ట్ చిక్కాడు.
దీంతో 56 పరుగుల వద్ద కోల్‌కతా తొలి వికెట్‌ను కోల్పోయింది. వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించే అవకాశం సాల్ట్‌కు చేజారింది. కోల్‌కతా 66 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. పది పరుగులు చేసిన సునీల్ నరైన్‌ను యశ్ ఔట్ చేశాడు. అతడు వేసిన బంతిని బౌండరీగా మలిచేందుకు ప్రయత్నించిన నరైన్ లాంగాఫ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. కోల్‌కతా స్వల్ప వ్యవధిలో మూడో వికెట్‌ను కోల్పోయింది. యశ్ బౌలింగ్‌లో మూడు పరుగులు చేసిన రఘువంశి ఇచ్చిన క్యాచ్‌ను ఒంటిచేత్తో కామెరూన్ గ్రీన్ అద్భుతంగా పట్టాడు. దీంతో 75 పరుగుల వద్ద కోల్‌కతా మూడో వికెట్‌ను నష్టపోయింది.
కాసేపు కుదురుకున్న దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్ 16 పరుగులు చేసి ఔటయ్యాడు. రింకూసింగ్ 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఫెర్గూసన్ వేసిన స్లో బంతిని ఆడే క్రమంలో రింకు సింగ్ ఔటయ్యాడు. 137 పరుగుల వద్ద కోల్‌కతా ఐదో వికెట్‌ను నష్టపోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. యశ్ దయాల్ వేసిన 17వ ఓవర్‌లో 23 పరుగులు వచ్చాయి. ఇందులో సిక్స్, రెండు ఫోర్లు, ఐదు నోబాల్స్, రెండు వైడ్లు ఉన్నాయి. దీంతో కోల్‌కతా స్కోరు 177 పరుగులకు చేరింది. తర్వాత డుప్లెసిస్ పట్టిన సూపర్ క్యాచ్‌కు శ్రేయస్ ఔటయ్యాడు.దీంతో 179 పరుగుల వద్ద కోల్‌కతా ఆరో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత రమణ్‌దీప్ సింగ్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సిరాజ్ వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది .